Begin typing your search above and press return to search.

అందాల రాశి ఖన్నాకు అసలేమైంది?!

By:  Tupaki Desk   |   25 Feb 2022 9:30 AM GMT
అందాల రాశి ఖన్నాకు అసలేమైంది?!
X
తెలుగు తెరకు కొంతకాలం క్రితం పరిచయమైన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. వెండితెరని వెన్నెల సరస్సులా మార్చిన గ్లామర్ ఆమె సొంతం. కలువ పూల రాశి పోసినట్టుగా కనిపించే ఈ సుందరిని చూసి, అదుపు తప్పని మనసు లేదంటే అతిశయోక్తి కాదు.

ఆమె ఊహలకు దూరం కాలేకపోయిన హృదయం లేదంటే ఆశ్చర్యం లేదు. అంతలా .. అందమైన అమృత భాండంలా ప్రేక్షకులకు కనిపించింది. తేట కళ్లతో .. ఊట చూపులతో నిద్దర్లు లేకుండా చేసింది. అలాంటి రాశి ఖన్నా ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు.

అయితే ఆమె ఆ స్థాయిలో స్పీడ్ చూపించలేదు. వచ్చిన అవకాశాలను ఓపికగా చేసుకుంటూ వెళుతోంది. హిట్ వచ్చినా హడావిడి చేయలేదు .. ఫ్లాప్ వస్తే కుంగిపోలేదు. అలా తడబడకుండా కెరియర్ ను నెట్టుకొస్తున్న రాశి ఖన్నా పట్ల అందరిలోను ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఒక నాయికగా కనిపించింది. ఆ సినిమా చూసినవాళ్లు ఆ పాత్రను రాశి ఖన్నా ఎంచుకోవడం పట్ల అసహనాన్ని .. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సినిమా ఫ్లాప్ తో పాటు రాశీకి కాస్త చెడ్డ పేరును కూడా తెచ్చిపెట్టింది.

కారణం ఏదైనా ఈ సినిమా తరువాత రాశి ఖన్నా తమిళ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అలాగే హిందీ వెబ్ సిరీస్ లపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తమిళంలో ఆమె చేసిన సినిమాలు నాలుగు విడుదలకి రెడీ అవుతున్నాయి. అలాగే తెలుగులో గోపీచంద్ సరసన చేసిన 'పక్కా కమర్షియల్' మే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో చేయడం ఆమెకి ఇది రెండవ సారి. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ జోడీగా చేసిన 'థ్యాంక్యూ' కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను రాశి ఖన్నా నుంచి రానున్న సినిమాలన్నీ చాలా కాలం క్రితం ఒప్పుకున్నవే. కొత్తగా ఆమె సైన్ చేసిన సినిమాలేవీ కనిపించడం లేదు. తెలుగులో కొత్త కథానాయికల జోరు అంతకంతకూ పెరుగుతున్న ఈ సమయంలో రాశి ఖన్నా యాక్టివ్ గా లేకపోతే కష్టమే. పైగా ఆమె తెలుగు సినిమాలు చేస్తే తమిళ సినిమాలకి, అక్కడ సినిమాలు చేస్తే ఇక్కడ గ్యాప్ ఇచ్చేస్తోంది. ఇది కెరియర్ ను ప్రమాదం పడదోసే అలవాటే.

అందువలన రాశి ఖన్నా తన అమాయకత్వాన్ని పక్కన పెట్టకపోయినా, అందాన్ని .. అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోకుండా కాస్త లౌక్యాన్ని చూపకపోయినా కష్టమే!