Begin typing your search above and press return to search.

జన జాగృతి పార్టీలో చిరు.. అభ్యుదయ పార్టీలోకి చరణ్..!

By:  Tupaki Desk   |   15 Feb 2022 7:42 AM GMT
జన జాగృతి పార్టీలో చిరు.. అభ్యుదయ పార్టీలోకి చరణ్..!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'అభ్యుదయ పార్టీ' లో కీలక పాత్ర పోషించబోతున్నారు. అదేంటి చెర్రీ ఎప్పుడు రాజకీయాల్లో చేరారు? అసలు ఈ అభ్యుదయ పార్టీ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఇది నిజం కాదులేండి.. ఇదంతా చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో భాగంగా జరుగుతోంది.

RC15 మూవీ శంకర్ శైలిలో భారీ బడ్జెట్ తో రూపొందే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఇందులో చరణ్ ఓ రాజకీయ నాయకుడిగా వైట్ అండ్ వైట్ డ్రెసులో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అలానే ఈ సినిమాలో 'అభ్యుదయ పార్టీ' అనే కల్పిత రాజకీయ పార్టీకి చెందిన నేతగా చెర్రీ నటించనున్నారని సమాచారం.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రస్తుతం నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో రాజకీయాలను శాసింసే కింగ్ మేకర్ పాత్రలో నటిస్తున్నారు. ఇది మలయాళ సినిమా ‘లూసిఫర్‌’ కి రీమేక్ గా రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి ‘జన జాగృతి’ అనే పొటికల్ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నారు.

ఇటీవలే తిరిగి ప్రారంభమైన 'గాడ్ ఫాదర్' షూటింగ్ లొకేషన్ నుంచి బయటకు వచ్చిన పిక్స్ ని బట్టి ఈ విషయం స్పష్టమైంది. ‘జన జాగృతి’ అనేది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జన సేన’ పార్టీ పేరుకి దగ్గరగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ కూడా RC15 లో అభ్యుదయ పార్టీ మద్దతుదారుడిగా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇలా మెగా తండ్రీకొడుకులు ఇద్దరూ రాజకీయాల పార్టీలలో భాగం అవుతుండటంతో అందరి దృష్టి ఈ సినిమాలపై పడింది.

ఇదిలా ఉంటే RC15 సినిమా కొత్త షెడ్యూల్ ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తిరిగి ప్రారంభించారు. ఆసక్తికరంగా ఈ షెడ్యూల్ చిరంజీవితో సంబంధం కలిగి ఉంది. అదేంటంటే చిరు తెరంగేట్రం చేసిన 'పునాదిరాళ్లు' సినిమాలో మొదటి సన్నివేశాన్ని 1978 ఫిబ్రవరి 11న తూర్పుగోదావరిలోని దోసకాయలపల్లిలో చిత్రీకరించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అదే రోజున అదే ఊర్లో రామ్ చరణ్ షూటింగ్ జరుగుతుండటం విశేషం.

RC15 సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 15 రోజుల పాటు జరిగే రాజమండ్రి షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల మీద ఒక పాటని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అలానే హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తారని అంటున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శంకర్-చరణ్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథ అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 సంక్రాంతికి RC15 ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాత ప్రకటించారు.