Begin typing your search above and press return to search.

ఆకాశంలో ఆపద .. 'రన్ వే 34'

By:  Tupaki Desk   |   15 March 2022 9:30 AM GMT
ఆకాశంలో ఆపద .. రన్ వే 34
X
విమాన ప్రయాణాలు .. ప్రమాదాలు నేపథ్యంలోని కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ వారు కూడా విమాన నేపథ్యంలో కథలను భారీస్థాయిలోనే తెరకెక్కించారు. విమానం గాలిలో ఉన్నప్పుడు గానీ .. అది ల్యాండ్ అవబోతున్న సమయంలో గాని ఏదో ఒక సాంకేతిక పరమైన సమస్య తలెత్తుతుంది.

ప్రమాదం అంచులవరకూ వెళ్లి .. చివరి నిమిషంలో హీరో దానిని సాల్వ్ చేసి అందరినీ ప్రాణాలతో బయటపడేస్తాడు. ఈ లోగా పడే టెన్షన్ మామూలుగా ఉండదు. అలాంటి ఒక యథార్థ సంఘటన ఆధారంగా 'రన్ వే 34' సినిమా రూపొందింది.

అజయ్ దేవగణ్ ఈ సినిమాకి ఒక నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా వ్యవహరించాడు. జస్లీన్ రాయల్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించాడు. అజయ్ దేవగణ్ పైలట్ గా .. రకుల్ కో పైలట్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఒక కీలకమైన పాత్రను అమితాబ్ పోషించారు. 2015 లో దోహా - కొచ్చికి సంబంధించిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. అప్పుడు పైలట్ .. కో పైలట్ ఏం చేయాలనే అయోమయానికి లోనవుతారు. చివరికి తమ సమయస్ఫూర్తితో అందరి ప్రాణాలను కాపాడతారు.

అలాంటి ఒక కథతో ఈ సినిమా రూపొందింది. ముందుగా ఈ సినిమాకి 'మేడే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆ తరువాత కరోనా కారణంగా విడుదల విషయంలో జాప్యం జరిగింది. అప్పటివరకూ జరిగిన ప్రమోషన్స్ వలన ఇది పాత సినిమా అనిపించకూడదు.

అందువలన ప్రేక్షకుల ముందుకు కొత్తగా వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా టైటిల్ ను 'రన్ వే 34' గా మార్చారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ వలన అందరిలో అంచనాలు పెరుగుతూ పోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా వదిలిన టీజర్ కూడా ఆసక్తిని పెంచుతూ వెళ్లింది.

భూమికి 35 వేల అడుగుల ఎత్తులో విమానం ఉండగా వాతావరణంలో హఠాత్తుగా మార్పులు సంభవించడం .. పైలట్ - కో పైలట్ టెన్షన్ పడుతుండటం ఈ టీజర్ లో చూపించారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.

ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. బోమన్ ఇరాని .. ఆకాంక్ష సింగ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. రిలీజ్ తరువాత ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.