Begin typing your search above and press return to search.

పరుచూరి ఇలా అయిపోయారేంటబ్బా?!

By:  Tupaki Desk   |   13 March 2022 5:30 AM GMT
పరుచూరి ఇలా అయిపోయారేంటబ్బా?!
X
తెలుగు తెరపై కథలను పరుగులు తీయించిన రచయితలు ఎంతోమంది ఉన్నారు. సీనియర్ సముద్రాల నుంచి నేటి వరకూ ఎంతోమంది రచయితలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తూనే ఉన్నారు. అయితే ఒక సామాన్య ప్రేక్షకుడు ఎలాంటి కథలను ఇష్టపడతాడు?

ఎలాంటి భాష వాడితే వాళ్లకి బాగా అర్థమవుతుంది? అనే ఉద్దేశంతో ఆ దిశగా కసరత్తు చేయడమనేది పరుచూరి బ్రదర్స్ తోనే మొదలైంది. తెలుగు కథను ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన కథా రచయితలలో వారు ప్రముఖంగా కనిపిస్తారు. పరుచూరి వెంకటేశ్వరరావు - పరుచూరి గోపాలకృష్ణ ఈ ఇద్దరినీ కూడా 'పరుచూరి బ్రదర్స్' అని ఎన్టీఆర్ పిలిచేవారు. అదే స్క్రీన్ నేమ్ గా మారిపోయింది.

ఈ అన్నదమ్ములిద్దరూ దాదాపు 300 సినిమాలకి పైగా పనిచేశారు. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు ఇలా ప్రతి అంశంపై వారు తమదైన ముద్రవేశారు. ఒక సినిమాకి ఇద్దరు నిర్మాతలు .. ఇద్దరు దర్శకులు .. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పనిచేయడం మామూలే.

కానీ ఒక సినిమాకి .. ఒక కథకి ఇద్దరు రచయితలు పనిచేసి .. ఇద్దరి ఆలోచనలు .. అభిప్రాయాలను ఒకటి చేసి కథను రక్తి కట్టించడమనేది పరుచూరి బ్రదర్స్ లోనే కనిపిస్తుంది. ఇక ఒక వైపున తాము సృష్టించిన కొన్ని పాత్రలలో తామే తెరపై కనిపించడం కూడా వారితోనే మొదలైంది.

అలాంటి పరుచూరి బ్రదర్స్ లో పరుచూరి వెంకటేశ్వరరావు బయట కనిపించక చాలా కాలమైంది. పరుచూరి గోపాలకృష్ణ మాత్రం 'పరుచూరి పలుకులు' .. 'పరుచూరి పాఠాలు' కార్యక్రమాలతో ప్రేక్షకులతో టచ్ లోనే ఉన్నారు. అయితే పరుచూరి వెంకటేశ్వరరావు వయోభారంతో ఇంటిపట్టునే ఉంటున్నారు.

రీసెంట్ గా ఆయనను దర్శకుడు జయంత్ సి పరాన్జీ కలిశాడు. ఆ సమయంలో ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'గురువు గారిని ఇలా చూడటం చాలా బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం చురుగ్గానే ఉంది. వారు 300 సినిమాలకి పైగా రాస్తే, 200 సినిమాలకి పైగా బ్లాక్ బస్టర్ హిట్లే" అని రాసుకొచ్చాడు.

నిజంగానే పరుచూరి వెంకటేశ్వరరావుని ఇలా చూస్తే ఆయన అభిమానులందరికీ బాధగానే అనిపిస్తుంది. తెలుగు కథకు వయసైపోయిందా? అనిపిస్తుంది. వందలాది కథలను తన భుజాలపై మోసి అలసినట్టుగా అనిపిస్తున్నారు. రామలక్ష్మణులనే కాదు పరుచూరి బ్రదర్స్ ను చూసి కూడా అన్నదమ్ములు ఎలా ఉండాలనేది తెలుసుకోవచ్చు. ఒకసారి ఒక సినిమాకి పరుచూరి వెంకటేశ్వరావు పనిచేస్తుండగా గోపాలకృష్ణ అక్కడికి వచ్చారట. "మీరంటే నా సినిమాకి పనిచేస్తున్నారు కనుక మీకు భోజనం తెప్పిస్తాను .. మరి మీ తమ్ముడికి ఎట్లా?" అని ఆ నిర్మాత అన్నాడట.

అప్పుడు వెంకటేశ్వరావు "నా తమ్ముడికి భోజనం పెట్టని చోట నేను ఎట్లా పనిచేస్తాను?" అంటూ గోపాలకృష్ణను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఒక సందర్భంలో గోపాలకృష్ణ ఈ విషయం చెప్పారు. వాళ్లిద్దరూ రచయితలకు మాత్రమే కాదు .. అన్నదమ్ములందరికీ ఆదర్శమే!