Begin typing your search above and press return to search.

మీడియా ఇజ్జత్ తీసిపారేసిన తాజా ప్రెస్ మీట్

By:  Tupaki Desk   |   13 Oct 2021 4:34 AM GMT
మీడియా ఇజ్జత్ తీసిపారేసిన తాజా ప్రెస్ మీట్
X
సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగిన ‘మా’ ఎన్నికలకు సంబంధించి మీడియా ప్రదర్శించిన అటెన్షన్ ఒక ఎత్తు అయితే.. మా ఓట్ల లెక్కింపు సందర్భంగా టీవీలు.. ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు వ్యవహరించిన తీరు పైత్యానికి పరాకాష్ఠగా మారిందని చెప్పాలి.తిప్పి కొడితే వెయ్యి ఓట్లు కూడా లేని ఒక అసోసియేషన్ ఎన్నికకు లైవ్ చూపటం ఒక ఎత్తు అయితే.. కౌంటింగ్ వేళ.. ఎన్నికల ఫలితాల్ని ‘జెట్’ స్పీడ్ లో అందించిన చానళ్లకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దిమ్మ తిరిగిపోయే పంచ్ ల మాదిరి పడ్డాయి.

అన్నింటికి మించి ఇప్పుడు వస్తున్న కొత్త సందేహం ఏమంటే.. జనరల్ ఎలక్షన్ మాదిరి.. అధిక్యత విషయంలో వేసిన బ్రేకింగ్ న్యూసులు.. వారి అధిక్యత ఇంత.. వీరికి పడిన ఓట్లు ఇంత? ఫలానా వారి లీడ్ ఇలా ఉందంటూ వచ్చిన వార్తల్లో తొంభై శాతానికి పైనే ఫేక్ అంటున్నారు. ఎందుకంటే.. ఓపక్క బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళలోనే.. ఫలానా అభ్యర్థి అధిక్యతలో ఉన్నారని.. వారి మెజార్టీ ఇంత అంటూ టీవీ స్క్రోలింగ్ లలో వచ్చిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది?

మీడియాకు సమాచారం ఇచ్చిందెవరు? అన్న ప్రాథమిక ప్రశ్నకు సమాధానాల్ని పలువురు చానళ్ల వారితో మాట్లాడినప్పుడు గుండెలు అవిసిపోయే మాట వారి నోటి నుంచి ఒక మాట వచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా అధిక్యతల్ని వేసిన ఫీడ్ లో చాలా వరకు రెండు ప్రముఖ చానళ్లలో వచ్చిన సమాచారాన్నే ఇచ్చామని చెబుతున్నారు. ఎందుకిలా? అంటే.. ఫలానా నటికి ఇంత అధిక్యమని తప్పుగా వచ్చినా.. మిగిలిన చానళ్లలో ఫలానా నటి మెజార్టీ ఇంత అని ఇస్తున్నారు? మీరు ఆ మాత్రం ఫాలో అప్ చేయరా? అంటూ మీడియా హౌస్ ల్లోని బాసుల నోటికి భయపడి.. మారు మాట్లాడకుండా కాపీ.. కట్.. పేస్ట్ అన్నట్లుగా సదరు రిజల్ట్ ను తమ రిజల్ట్ గా చెప్పుకోవటం.. అలా అరకొర సమాచారమే అసలు సమాచారంగా మారినట్లుగా చెబుతున్నారు.

మా ఎన్నికల ఫలితాల్ని ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవటం.. దానికి సంబంధించిన బాధ్యుడు ఎవరూ లేకపోవటం కూడా తాజాగా పడిన మరకకు కారణమని చెప్పాలి. మొత్తంగా ‘మా’ ఎన్నికల కవరేజ్ సందర్భంగా మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు.. వారి మీద పెద్ద మరకలా మారాయని చెప్పక తప్పదు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోని వారు కొందరు చేసిన వ్యాఖ్యలు మీడియా ఇజ్జత్ తీసేసినట్లుగా మారిందంటున్నారు.