Begin typing your search above and press return to search.

#2022 సంక్రాంతి గిఫ్ట్ .. MAA సొంత‌ బిల్డింగ్ ప్ర‌క‌ట‌న‌?

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:38 AM GMT
#2022 సంక్రాంతి గిఫ్ట్ .. MAA సొంత‌ బిల్డింగ్ ప్ర‌క‌ట‌న‌?
X
పంచ్ లు వేసేవాళ్ల‌కు ప్ర‌శ్నించేవారికి కొద‌వేమీ లేదు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా పంచ్ లు వేస్తూ ప్ర‌శ్న‌ల‌తో విసిగించేవారికి ఇంకేం ప‌నుంటుంది? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో సొంత భ‌వ‌న నిర్మాణం గురించి అన‌వ‌స‌ర హంగామాతో భ‌జంత్రీలు మోగించిన వారిపై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మా సొంత భ‌వ‌నం నిర్మించడమే ప్రధాన ఎజెండా అంటూ ఇరువ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. అయితే తాను స్థ‌లాలు వెతికాన‌ని ముఖ్య‌మంత్రుల్ని క‌లుస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన‌ మంచు విష్ణు గెలిచాక దానిపై ఎలాంటి అప్ డేట్ చెప్ప‌క‌పోవ‌డంపై ఎవ‌రికి వారు పంచ్ లు వేస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భ‌వంతి నిర్మాణ ఖర్చులను తానే భరిస్తానని విష్ణు ప్రకటించ‌గా.. ఇది జ‌రుగుతుందా? అంటూ అప్పుడే పెద‌వి విరిచేసారు. అధ్య‌క్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అందరి దృష్టి విష్ణు `మా` భ‌వంతిని నిర్మిస్తారా లేదా? అన్నదానిపైనే ఫోక‌స్ అయ్యి ఉంది. రొటీన్ రాజ‌కీయ నాయ‌కుల త‌ర‌హాలో అదంతా కేవ‌లం మాట‌ల‌వ‌ర‌కేనా ..? చేత‌ల్లో కూడా ఉంటుందా? అన్న సందిగ్ధ‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఇలాంటి వాళ్లంద‌రికీ రివ‌ర్స్ పంచ్ వేసేందుకు అధ్య‌క్షుడు మంచు విష్ణు ప్రాక్టిక‌ల్ గా రెడీ అవుతున్నారు. త్వరలో `మా` బిల్డింగ్ గురించి విష్ణు ప్రకటన చేయబోతున్నారన్న గుస‌గుస‌ల న‌డుమ‌ ఉత్సాహంగా ఒక ట్వీట్ ను అత‌డు పోస్ట్ చేశాడు. దాని సారాంశం ఏమిటీ అంటే?``దేవుడు దయతో ఉన్నాడు! భాగస్వామ్యం చేయడానికి గొప్ప వార్తలను కలిగి ఉండండి! @themohanbabu త్వరలో ప్రకటిస్తారు`` అంటూ టీజ్ చేశారు. ఇంకేం ఉంది? మా అధ్య‌క్షుడి నుంచి క‌చ్ఛితంగా మా అసోసియేష‌న్ భ‌వంతి నిర్మాణంపైనే అప్ డేట్ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. `మా` అధ్యక్షుడిగా తన కొడుకు విజయంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. మరి కాసేపట్లో సీనియర్ నటుడు ఎం.బి స్వ‌యంగా బ‌రిలో దిగి అధికారికంగా ప్రకటన చేయనున్నారని భావిస్తున్నారు.

2022 సంక్రాంతికి స‌రైన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది క‌చ్ఛితంగా ఆర్టిస్టుల‌కు సొంత భ‌వంతి నిర్మాణంపై ఆన్స‌ర్ రావ‌డ‌మే. న‌డిగ‌ర‌సంఘం భ‌వంతి త‌ల‌ద‌న్నేలా తెలుగు ఆర్టిస్టుల భ‌వంతి ఉండాల‌ని కోరుకుంటున్నారు. దీనికోసం భారీ బ‌డ్జెట్లు వెచ్చిస్తార‌ని కూడా ఆర్టిస్టుల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.