Begin typing your search above and press return to search.

లెక్కల మాస్టారు భలే ట్విస్ట్ ఇచ్చాడే !

By:  Tupaki Desk   |   25 March 2022 11:30 AM GMT
లెక్కల మాస్టారు భలే ట్విస్ట్ ఇచ్చాడే !
X
కథ ఏదైనా దానిపై సుకుమార్ చేసే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. నూటికి నూరు శాతం తనకి సంతృప్తి కలిగితేనే తప్ప, ఆయన సెట్స్ పైకి వెళ్లడు. కథాకథనాలను నడిపించే తీరు .. పాత్రలను మలిచే విధానం కొత్తగా ఉంటాయి. ఆయన నుంచి వచ్చిన 'పుష్ప' సినిమా బన్నీ కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో ఆయన బన్నీ లుక్ ను డిజైన్ చేసిన తీరు .. బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసిన విధానం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించిన మొదటి అంశంగా మారింది.

ఈ సినిమాను ఆయన అడివి నేపథ్యంలో నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. చిత్తూరు జిల్లా యాస .. దేవిశ్రీ పాటలు .. సమంత ఐటమ్ .. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేసింది. ఇక హిందీలోనూ ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన కథా చర్చలు తమిళనాడులోని 'కూనూర్'లో జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

జూన్ లో గానీ .. జూలైలో గాని రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారట. సెకండ్ పార్టులో హీరోకి .. విలన్ కి మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా పోరాటం మొదలవుతుందని సుకుమార్ చెప్పాడు. దాంతో సెకండ్ పార్టులో ఏదో ఒకటి తేలిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా 3వ పార్టును కూడా సుకుమార్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

కథను అనేక అనూహ్యమైన మలుపులు తిప్పుతూ కావలసినంత ముందుకు తీసుకునివెళ్లే అవకాశం ఉండటం వలన, ఆయన ఈ ఆలోచనకి వచ్చాడని అంటున్నారు.

మొత్తానికైతే 'పుష్ప 3' ఉంటుందనే టాక్ అయితే వచ్చింది. ఇక మిగిలినదల్లా ఈ టాక్ బలపడటమే. అయితే 'పుష్ప 2' తరువాత 'పుష్ప 3'ని కథను పట్టుకుని వెంటనే సెట్స్ పైకి వెళ్లడం జరగదట. మధ్యలో సుకుమార్ - బన్నీ ఇద్దరూ కూడా వేరే ప్రాజెక్టులు చేసుకుంటారు.

అంత సెట్ చేసుకున్న తరువాతనే మళ్లీ రంగంలోకి దిగుతారన్న మాట. 'పుష్ప 2' తరువాత బోయపాటితో బన్నీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి సుకుమార్ ఏ హీరోను ఎంచుకుంటాడనేది చూడాలి. 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తుండగా, పార్టు 3 కూడా ఉంటుందని లెక్కల మాస్టారూ భలే ట్విస్ట్ ఇచ్చాడే.