Begin typing your search above and press return to search.

'భీమ్లా' వేడుకకు 'బండ్ల' దూరం.. ఆ ఆడియో నిజమేనా..?

By:  Tupaki Desk   |   24 Feb 2022 5:29 AM GMT
భీమ్లా వేడుకకు బండ్ల దూరం.. ఆ ఆడియో నిజమేనా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. తాను అభిమానిని కాదని.. భక్తుడిని అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సందర్భం వచ్చినా రాకపోయినా 'ఈశ్వరా పవనేశ్వరా.. దేవరా' అంటూ పవన్ మీద అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక పవన్ సినిమా ఫంక్షన్స్ లో బండ్ల స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తుంటారు. అయితే ఇప్పుడు భీమ్లా ఈవెంట్ లో పవన్ డై హార్డ్ ఫ్యాన్ కనిపించకపోవడం అనేక సందేహాలు తలెత్తేలా చేసింది.

పవన్ నటించిన లేటెస్టు మూవీ 'భీమ్లా నాయక్' సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిన్న రాత్రి హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో పాటుగా పలువురు అతిథిలు హాజరై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసారు. అయితే ఈ ఫంక్షన్ లో బండ్ల గణేష్ ఎక్కడా కనిపించకపోవడంతో.. కారణం ఏమయ్యుంటుందా అని అభిమానులు వాకబు చేస్తున్నారు.

ఇటీవల ఓ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడినట్లు ఓ ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అయింది. అందులో 'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేసిన బండ్ల.. తాను వస్తే త్రివిక్రమ్ డౌన్ అవుతాడని రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించడం వినిపించింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అసభ్య పదజాలంతో దూషించించడం గమనించవచ్చు.

భీమ్లా ఈవెంట్ కు రావడానికి స్పీచ్ రెడీ చేసుకున్నానని.. ఆడిటోరియంలో అందరూ బండ్లన్న.. బండ్లన్న రావాలి అని గట్టిగా నినాదాలు చేస్తే అక్కడ ప్రత్యక్షమవుతానని గణేష్ అన్నారు. ఇందులో నిజమెంత అని పవన్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్న తరుణంలో అన్ని విషయాలను ధృవీకరించేలా బండ్ల గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించలేదు.

వైరల్ అయిన ఆడియోలో చెప్పినట్లుగానే ఈ కార్యక్రమంలో కొందరు అభిమానులు బండ్ల పేరును గట్టిగా అరుస్తూనే ఉన్నారు. 'బండ్లన్న రావాలి.. బండ్లన్న రావాలి' అంటూ నినాదాలు చేస్తున్న ఓ వీడియోని గణేష్ కు ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తూ.. మిమ్మల్ని మిస్ అయ్యామని ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి స్పందించిన బండ్ల గణేష్.. 'మీ ప్రేమకు ధన్యవాదాలు. మన దేవుడు పవన్ కళ్యాణ్ కు జై' అని ట్వీట్ చేసారు. దీనికి పవన్ ను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం.

ఇదంతా చూస్తుంటే బండ్ల గణేష్ నిజంగానే పవన్ కళ్యాణ్ క్యాంపు నుండి దూరమవుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. అలానే త్రివిక్రమ్ ను బండ్ల తిట్టినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆడియో కాల్ కూడా నిజమేనా? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇకపోతే 'భీమ్లా నాయక్' ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎక్కువగా ఫోకస్ అవలేదు.

దీంతో బండ్ల గణేష్ - త్రివిక్రమ్ మధ్య ఏం జరిగింది? ఈవెంట్ కు బండ్ల ఎందుకు రాలేదు? బండ్లను నిజంగానే పవన్ దూరం పెట్టాడా? ఇలా అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. బండ్ల గణేష్ ట్వీట్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సాన్నిహిత్యాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరని అనిపిస్తోంది. అదే సమయంలో ఆడియో మీద ఇంత రచ్చ జరుగుతున్నా.. త్రివిక్రమ్ గురించి ఒక ట్వీట్ కూడా వేయలేదు. కానీ పవన్ ని పొగుడుతూ అనేక ట్వీట్లు పెడుతున్నారు.

ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వాళ్ళు లీకైన ఆడియో కాల్ గురించి వివరణ తీసుకోడానికి ప్రయత్నించగా.. 'ఆడియో తనది కాదని.. ఈ విషయంపై తాను స్పందించనని' చెప్పినట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లతో బండ్ల గణేష్ సత్సంబంధాలపై త్వరలోనే అందరికీ ఓ స్పష్టత వస్తుందేమో చూడాలి.