Begin typing your search above and press return to search.

డైరెక్టర్ ను ఇరుకున పెట్టేసిన సుమ!

By:  Tupaki Desk   |   2 March 2022 9:39 AM GMT
డైరెక్టర్ ను ఇరుకున పెట్టేసిన సుమ!
X
సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడే .. సుమ ఎక్కడ ఉంటే అక్కడ అల్లరే. ఇంటర్వ్యూ అయినా .. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలనేది సుమకి బాగా తెలుసు. భాష మీద పట్టు .. అందుకు తగిన సమయస్ఫూర్తి ఉండటం ఆమె ప్రత్యేకత. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నడిపించడం .. వివాదాస్పదమైన అంశాల వైపు టాపిక్ మళ్లుతున్నప్పుడు వెంటనే తాను కలగజేసుకుని ట్రాక్ లోకి తీసుకుని రావడంలో ఆమె నేర్పు కనిపిస్తుంది. అందువల్లనే ఇంత కాలమైనా సుమను దాటుకుని ఎవరూ ముందుకు వెళ్లలేకపోతున్నారు.

తాజాగా సుమ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా టీమ్ ను ఇంటర్వ్యూ చేసింది. కథాపరంగా ఒక వైపున హీరో ఫ్యామిలీని .. మరో వైపున హీరోయిన్ ఫ్యామిలీని కూర్చోబెట్టేసింది. శర్వా ఫ్యామిలీ వైపు నిర్మాతను .. రష్మిక ఫ్యామిలీ వైపు దర్శకుడు కోశోర్ తిరుమలను ఉంచి .. మధ్యలో తాను కూర్చుని అల్లరి ప్రశ్నలతో నవ్వుల సందడి చేసింది. ''ఇంతమంది ఆడవాళ్లను ఈ సినిమాలో పెట్టుకున్నారు గదా? ఆర్టిస్టుల పేర్లను .. వాళ్ల పాత్రలను పేర్లను చకచకా చెప్పేయండి చూద్దాం'' అంటూ ముందుగా కిశోర్ తిరుమలను సుమ తికమక పెట్టేసింది.

శర్వానంద్ ను ఉద్దేశించి సుమ అతని ఫ్యామిలీ మెంబర్స్ తో .. "ఏంటండీ ఇంకా ఈ అబ్బాయికి మీరు పెళ్లి చేయలేదు. తాను రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి తనని రిజెక్ట్ చేసే స్టేజ్ వరకూ మీరు తీసుకెళ్లారే. మీకు అసలు ఏ అమ్మాయి నచ్చలేదా? ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ దొరికుంటే ఆయనకే కాదు .. నాక్కూడా పెళ్లి అయ్యుండేది కాదు" అంటూ అందరినీ ఘొల్లున నవ్వించారు. ఈ సినిమాలో ఎవరికీ ఎవరు ఏమౌతారు? అనే వరుసల గురించి సుమ అడగ్గానే, ఎవరికి వారు చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది.

"దయచేసిన నన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయవద్దు .. కన్ ఫ్యూజన్ లో నేను ఎక్కువ క్వశ్చన్స్ అడిగేస్తాను" అంటూ సుమ అక్కడి వాతావరణాన్ని కంట్రోల్ లోకి తీసుకుంది. ఆ తరువాత యాంకరింగ్ విషయంలో ఎవరికి జోహార్ చెప్పాలనిపిస్తుంది? అంటూ కిశోర్ తిరుమల ను సుమ అడిగింది. ప్రశ్న పూర్తికాకుండానే ఆయన సుమ పేరును చెప్పేశాడు. "నా పేరు కాకుండా మరొకరి పేరు కూడా ఉంది .. ఆప్షన్స్ చెప్పనివ్వండి" అని సుమ అంటున్నా వినిపించుకోకుండా ఆయన 'సుమ'నే అని కుంబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు.

ఒక్కోసారి నేను ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు మీ ఆడియో ఫంక్షన్స్ చూస్తాను. ఇలా ఉండాలి లైఫ్ లో మనం అనుకుంటాను. స్టేజ్ .. ఆర్టిస్టులు అంతా మారినా అదే ఎనర్జీతో కనిపిస్తారు. అదే ఎనర్జీతో లైఫ్ లో ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటాను. అందుకే మీకే జోహార్ చెబుతున్నాను" అన్నాడు.

అప్పుడు సుమ ఆప్షన్స్ లో తన పేరుతో పాటు బాలయ్య పేరు కూడా ఉందని చెప్పగానే, అయితే ఆయనకే జోహార్ అని కిశోర్ తిరుమల అన్నాడు. అప్పుడు సుమ "ఇప్పుడు అర్థమైందండి మీరు ఇంతమంది ఆడవాళ్లను ఎలా డీల్ చేశారో" అంటూ కార్యక్రమానికి కావలసిన ఫుల్ జోష్ ను తీసుకొచ్చేసింది.