Begin typing your search above and press return to search.

హీరోయిన్ల‌నే బ‌లిపెడ‌తారు కానీ హీరోల జోలికి వెళ్ల‌రు!

By:  Tupaki Desk   |   19 Feb 2022 4:49 PM GMT
హీరోయిన్ల‌నే బ‌లిపెడ‌తారు కానీ హీరోల జోలికి వెళ్ల‌రు!
X
భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌కు వందేళ్ల సుదీర్ఘ‌మైన చ‌రిత్ర ఉంది. ఇంత పెద్ద హిస్ట‌రీలో ఎప్పుడూ హీరోయిన్ల‌కు పారితోషికాలు త‌క్కువే. మ‌హిళా వివ‌క్ష అనేది అనాదిగా వ‌స్తున్న‌దే. ముఖ్యంగా హీరో డామినేటెడ్ ఇండ‌స్ట్రీగా సినీప‌రిశ్ర‌మ‌లు ఖ్యాతికెక్కాయి.

అయితే కాలంతో పాటే మార్పు క‌నిపించ‌డం లేద‌ని ఆవేద‌న చెందే క‌థానాయిక‌ల శాతం కూడా అంతే ఇదిగా పెరుగుతోంది. ఇప్ప‌టికే కంగ‌న - దీపిక‌- క‌రీనా- అనుష్క‌ స‌హా చాలా మంది క‌థానాయిక‌లు పారితోషికంలో అస‌మాన‌త్వం గురించి మాట్లాడారు. తాము హీరోల‌కు ధీటుగా శ్ర‌మిస్తున్నా కానీ పారితోషికంలో ఎస‌రు పెడ‌తారు! అంటూ నిర్మాత‌ల‌పై అస‌హ‌నం వెల్ల‌గ‌క్కిన హీరోయిన్లు చాలా మంది.

పారితోషికంలో కోతతో  హీరోయిన్ల‌నే బ‌లిపెడ‌తారు కానీ హీరోల జోలికి వెళ్ల‌రు!! అంటూ త‌నలోని ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కింది భూమి ఫెడ్నేక‌ర్. మనమంతా సామాజిక న్యాయంలో వెన‌క‌బ‌డ్డాం.

 బాలికా శక్తి లింగ సమానత్వం గురించి మాట్లాడుతాము కానీ భారతదేశంలో మహిళలు ఇప్పటికీ అన్నిచోట్లా వివక్షను ఎదుర్కొంటున్నారు. భూమి పెడ్నేకర్ ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో వేతన వ్యత్యాసాల సమస్య గురించి మాట్లాడారు. దయచేసి కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీతం తగ్గించుకోండి అని ఏ నిర్మాత వెళ్లి నా హీరోతో కానీ సహనటుడితో కానీ చెప్పినట్లు నేను ఎప్పుడూ వినలేదు!! అని చెప్పింది.

అది ఎప్ప‌టికీ జరగదు. కానీ నాయిక‌ల‌ను త‌గ్గిస్తూనే ఉంటారు. దీనిని నేను హాస్యాస్పదంగా భావిస్తున్నాను అని కూడా త‌న‌లోని అస‌హ‌నాన్ని బ‌య‌ట‌పెట్టింది ది గ్రేట్ భూమి.

ఈరోజుల్లోనూ ప‌రిశ్ర‌మ ఇలా ఉంద‌ని అర్థం చేసుకోవాల‌ని కూడా భూమి ఫెడ్నేక‌ర్ చెబుతోంది. ఇక కేవ‌లం సినీరంగంలోనే కాదు ప్ర‌యివేట్ ఉద్యోగాల్లోనూ పురుషుల‌తో స‌మానంగా  స్త్రీల‌కు పారితోషికాలు అంద‌డం లేదు. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో మాత్రం ఆడా- మ‌గా అనే విభేధం లేదు. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో కొన్ని టెక్నిక‌ల్ రంగాల్లో మ‌హిళ‌ల‌పై వివ‌క్ష త‌క్కువ‌.