Begin typing your search above and press return to search.

దిల్ రాజు అనుకున్నా అవ్వదా?

By:  Tupaki Desk   |   20 July 2022 4:13 PM GMT
దిల్ రాజు అనుకున్నా అవ్వదా?
X
టాలీవుడ్లో ఇప్పుడు నంబర్ వన్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే మరో మాట లేకుండా దిల్ రాజు పేరు చెప్పేయొచ్చు. సినిమాల నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు కూడా ఒక రేంజ్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ.. ఇండస్ట్రీ మీద దిల్ రాజుకున్న పట్టు వేరు. నిర్మాణ పరంగానే కాక డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్లోనూ ఆయన్ని కొట్టేవారు లేరు.

ఇండస్ట్రీలో ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా అందులో రాజుది కీలక పాత్రగా ఉంటుంది. ఆయన ఇండస్ట్రీలో ఏమనుకుంటే అది చెయ్యగలరు. అలాంటి వ్యక్తి మీడియా సమావేశంలో ఒక కీలక ప్రకటన చేసి దానికి కట్టుబడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన నిర్మాణంలో తెరకెక్కిన ‘థ్యాంక్ యు’ సినిమాకు టికెట్ల రేట్లు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో రూ.112, మల్టీప్లెక్సుల్లో రూ.177గా ఉంటాయని ఆయన ఘనంగా ప్రకటించారు.

తీరా చూస్తే బుకింగ్స్‌లో మాత్రం సింగిల్ స్క్రీన్లలో రూ.175, మల్టీప్లెక్సుల్లో 200-250 రేటు పెట్టారు. ఇంతకముందు గీతా ఆర్ట్స్ వారి ‘పక్కా కమర్షియల్’ సినిమాకు కూడా ఇలా తక్కువ రేట్లే పెడుతున్నట్లు ఘనంగా ప్రకటించి.. చివరికి మామూలు రేట్లతోనే రిలీజ్ చేశారు. అది గీతా వారి క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీసింది.

ఐతే నిర్మాత అనుకున్నా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒప్పుకోకపోవడంతో ఆ నిర్ణయం అమలు కాలేదన్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. నిజానికి అల్లు అరవింద్ అనుకుంటే తాము చెప్పిన రేట్లను అమలు చేయడం కష్టమేమీ కాదు.

మేజర్, విక్రమ్ సినిమాల నిర్మాతలు చెప్పినట్లే తక్కువ రేట్లతో సినిమాలు రిలీజ్ చేసి మంచి ప్రయోజనం పొందారు. అలాంటిది అల్లు అరవింద్ వల్ల ఇది కాని పని అనుకోలేం. ఇక దిల్ రాజు విషయంలో ఇలా జరగదని అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఆయన డిస్ట్రిబ్యూషన్లోనూ టాప్‌లో ఉన్నారు.

పెద్ద ఎగ్జిబిటర్ కూడా. అలాంటి వ్యక్తి అనుకుంటే తన సినిమాకు తక్కువ రేట్లు పెట్టలేరంటే.. ఈ నిర్ణయం తన చేతుల్లో లేదు అంటే నమ్మలేం. ఈ వారం రిలీజవుతున్న డబ్బింగ్ మూవీ ‘షంషేరా’కు రాజు చెప్పిన రేట్లను అమలు చేస్తున్నపుడు.. ఆయన సినిమాకు ఇలా జరగట్లేదంటే తాను చేసిన ప్రకటన విషయంలో రాజే యుటర్న్ తీసుకున్నాడన్నది స్పష్టం. ఐతే ఏ ప్రకటనా చేయకుండా సినిమాను రిలీజ్ చేస్తే సమస్య లేకపోయేది కానీ.. మీడియా సమావేశంలో తక్కువ రేట్లు అంటూ ఘనంగా ప్రకటించి ఇప్పుడు ఇలా మాట తప్పడం ఆయన క్రెడిబిలిటీకి పెద్ద దెబ్బే.