Begin typing your search above and press return to search.

హీరోకు లోపం...అదే నిర్మాత‌కు వ‌రం

By:  Tupaki Desk   |   6 March 2022 4:30 AM GMT
హీరోకు లోపం...అదే నిర్మాత‌కు వ‌రం
X
సినిమాల ట్రెండ్ మారింది. పాత్ర‌ల స్వ‌భావ‌మూ మారింది. ఒక‌ప్పుడు రాముడి ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తే హీరో.. కానీ కాలం మారింది. హీరో అంటే ఇలాగే వుండాల‌ను రూల్ ని ప‌క్క‌న పెట్టేశారు. ర‌ష్‌గా వుండాలి. వంద మందినైనా మ‌ట్టిక‌రిపించ‌గ‌ల‌గాలి.. అవ‌స‌రాన్ని బ‌ట్టి మారుతుండాలి. అంతే కాకుండా కొత్త‌గా మ‌రో మ్యాన‌రిజాన్ని.. లోపాన్ని కూడా ప్ర‌ధానంగా చూపిస్తూ హీరో పాత్ర‌ల‌ని మ‌లుస్తున్నారు. అలా హీరో పాత్ర‌ల్ని ఏదో ఒక లోపంతో మ‌లిచిన చిత్రాలకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో ఇప్ప‌డు ఇదే త‌ర‌హా చిత్రాలు ట్రెండ్ గా మారాయి.

ఈ ట్రెండ్ కు ఈ మ‌ధ్య కాలంలో శ్రీ‌కారం చుట్టిన ద‌ర్శ‌కుడు మారుతి. 2015లో మారుతి డైరెక్ట్ చేసిన చిత్రం `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`. నేచుర‌ల్ స్టార్ నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించారు. యువీ క్రియేష‌న్స్‌, జీఏ 2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో హీరో నాని మ‌తిమ‌రుపు వ్యాధితో బాధ‌ప‌డుతుంటాడు. అది అత‌నికి ప్ర‌ధాన లోపంగా మారుతుంది. ప్రేమించిన అమ్మాయికి త‌న లోపం గురించి చెప్ప‌కుండా నాని చేసిన విన్యాసాలు థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయించాయి. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల్లో వున్న నానికి ఈ సినిమా సూప‌ర్ హిట్ ని అందించి అత‌ని కెరీర్ కి ప్లాస్ గా మారింది.

ఇక 2016లో కింగ్ నాగార్జున‌, కార్తీ క‌ల‌యిక‌లో రూపొందిన‌ `ఊపిరి` చిత్రం కూడా ఇదే ఫార్మాట్ క‌థ‌తో వ‌చ్చింది. ఇందులో నాగార్జున అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డే వ్య‌క్తిగా క‌నిపించారు. ఓ ప్ర‌మాదం కార‌ణంగా చ‌ల‌నం లేని వ్య‌క్తిగా మారిన వ్య‌క్తి ప‌డే మాన‌సిక వేద‌న నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. త‌మ‌న్నా హీరోయిన్ గా, శ్రియ‌, అనుష్క కీల‌క అతిథి పాత్ర‌లలో న‌టించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాషల్లో మంచి విజ‌యాన్ని సాధించింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా లోపం వున్న యువ‌కుడి పాత్ర‌లో న‌టించారు. 2017లో వ‌చ్చి `జై ల‌వ‌కుశ‌` చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన విష‌యం తెలిసిందే. రెండు పాత్ర‌లు సాధార‌ణంగా వుంటే కీల‌కంగా నిలిచే నెగెటివ్ ఛాయ‌లున్న జై పాత్ర‌కు న‌త్తి అనే లోపం వుంటుంది. అసుర అసుర రావ‌ణాసుర అంటూ ఎన్టీఆర్ విల‌నిజాన్ని ప‌లికించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఇక ఇదే ఏడాది శ‌ర్వానంద్ చేసిన `మ‌హానుభావుడు` ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది.

అతి శుభ్రం అనే ఓసిడీ వున్న యువ‌కుడిగా శ‌ర్వానంద్ ఈ చిత్రంలో క‌నిపించారు. మెహ్రీన్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని మారుతి తెర‌కెక్కించారు. శ‌ర్వా కెరీర్ లో ఓ వినూత్న‌మైన సినిమాగా ఈ మూవీ నిలిచింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ చేసిన `రాజా ది గ్రేట్‌` కూడా ఇదే పంథాలో తెర‌పైకొచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరో ర‌వితేజ అంధుడిగా క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - సుకుమార్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `రంగ‌స్థ‌లం` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇందులో హీరో రామ్ చ‌ర‌ణ్ చిట్టిబాబుగా వినికిడి లోపం వున్న యువ‌కుడిగా న‌టించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

ఇక బ‌న్నీ న‌టించిన `పుష్ప‌` గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అల్లు అర్జున్ డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాకుండా ఎడ‌మ భుజం వైక‌ల్యం వున్న వ్య‌క్తిగా క‌నిపించాడు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఇలా హీరోకు వున్న లోపం ప్ర‌తీ సినిమాకు వ‌రంగా మారి నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించ‌డం విశేషం.