Begin typing your search above and press return to search.

ఏంటీ ప్ర‌భాస్ సినిమాలో విలన్స్ లేరా?

By:  Tupaki Desk   |   2 March 2022 8:51 AM GMT
ఏంటీ ప్ర‌భాస్ సినిమాలో విలన్స్ లేరా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న హెరిటేజ్ ల‌వ్ స్టోరీ `రాధేశ్యామ్‌`. ప్ర‌భాస్ నుంచి దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డం.. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. `సాహో` సినిమా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని సంతృప్తి ప‌రిచినా కొన్ని వ‌ర్గాల‌ని మాత్రం సాటిస్‌ఫై చేయ‌లేక‌పోయింది. దీంతో గ‌త ఫ‌లితాన్ని దృష్టిలో పెట్టుకుని ఊహ‌ల‌కంద‌ని క‌థ‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప్ర‌భాస్ చేసిన ప్ర‌య‌త్నం `రాధేశ్యామ్‌`.

గ‌త కొంత కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట సంచ‌ల‌నంగా మారింది. నేటి నుంచి ఈ చిత్ర ప్ర‌మోషన్స్ ని మేక‌ర్స్ భారీ స్థాయిలో ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం మార్చి 2న ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ముంబైలో ఇందు కోసం భారీ ఈవెంట్ ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ట్రైల‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. ఒకే సారి ఐదు భాష‌ల‌కు సంబంధించిన ట్రైల‌ర్ లు విడుద‌ల కానున్నాయి. ట్రైల‌ర్ రిలీజ్ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఇటీవ‌ల ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. స‌ముద్రం మ‌ధ్య లో జోరు వాన‌లో షిప్ మునిగిపోతుండ‌గా ప్ర‌భాస్ గాల్లో ఎగురుతున్న స్టిల్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

ఇదిలా వుంటే ఈ చిత్రంలో ఎలాంటి విల‌న్ లేడ‌ని షాకింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చేసింది. అంతే కాకుండా హాలీవుడ్ పాపుల‌ర్‌ మూవీ `టైటానిక్` త‌ర‌హాలో విషాద‌కర ఎండింగ్ తో `రాధేశ్యామ్‌` ముగుస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సునామీ నేప‌థ్యంలో సాగే ఎండింగ్ చాలా థ్రిల్లింగ్ గా వుండ‌బోతోంద‌ని నెట్టింట వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఇవ‌న్నీ వ‌ట్టి రూమ‌ర్లే న‌ని, వాస్త‌వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వుంద‌ని చెబుతున్నారు.

సినిమాలో విషాదాంత‌పు ఎండింగ్ వుండ‌ద‌ని, ఓడ ప్ర‌మాదంలో చిక్కుకున్న హీరోయిన్ ని నేచ‌ర్ కాపాడే దృశ్యాలు సంబ్ర‌మాశ్చార్యాల‌కు లోను చేస్తాయ‌ని, 20 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ కు భారీ స్థాయిలో వీఎఫ్ ఎక్స్ ని వినియోగించార‌ని, ఆ దృశ్యాలు తెర‌పై ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని క‌లిగించ‌డ‌మే కాకుండా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్. హీరో ప్ర‌భాస్ ఇందులో హ‌స్త‌సాముద్రికుడిగా స‌రికొత్త పాత్ర‌లో న‌టించారు.

ఇత‌రుల మైండ్ ని రీడ్ చేయ‌గ‌ల స‌మార్ధ్యం వున్న హీరో విధి కార‌ణంగా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు? .. విధికి ఎదురునిలిచిన త‌న ప్రేమ‌ని ఎలా ద‌క్కించుకున్నాడు అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. విధి, అది క‌ల్పించే ప‌రిస్థితులే ఇందులో విల‌న్ గా ప్ర‌ధాన భూమిక‌ను పోషించాయని, ఇందులో ప్ర‌త్యేకంగా విల‌న్ అంటూ ఎవ‌రూ లేక‌పోవ‌డం విశేషం.