Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలకు మళ్ళీ మంచి రోజులొచ్చాయ్..!

By:  Tupaki Desk   |   27 Nov 2022 11:30 PM GMT
చిన్న సినిమాలకు మళ్ళీ మంచి రోజులొచ్చాయ్..!
X
ఏ ఇండస్ట్రీలో అయినా ఏడాది పొడవునా ప్రేక్షకులను అలరించేది చిన్న మీడియం రేంజ్ సినిమాలే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పాండమిక్ తర్వాత ఈ ఏడాదిలో భారీ బడ్జెట్ చిత్రాలు - స్టార్ హీరోల సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ థియేటర్లలోకి వచ్చేసాయి. పెద్ద సినిమాలన్నీ దండయాత్ర చేయడంతో చిన్న సినిమాలు ఇబ్బంది పడ్డాయనేది వాస్తవం.

పెద్ద సినిమాల కారణంగా సరైన విడుదల తేదీలు దొరక్క.. ఏదొక డేట్ కి తీసుకురావాలనుకున్నా ఆశించినన్ని థియేటర్లు అందుబాటులో లేక చిన్న సినిమాలు చితికి పోయాయి. స్టార్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన చిత్రాలకు తప్ప మిగతా వాటన్నిటికీ దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఇటీవల కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న చిత్రాలే ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పిస్తున్నాయి.

స్టార్ హీరోలే బ్రేక్ ఈవెన్ అందుకోలేని చోట పలు చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాయి. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళ్ - మలయాళ - హిందీ చిత్ర పరిశ్రమమలోనూ లో బడ్జెట్ లో తీసిన చిత్రాల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తూ.. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

నిజానికి స్టార్ హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే తప్ప వసూళ్లు అంతగా రావు. కాని చిన్న సినిమాలకు బాగుందని మౌత్ టాక్ వస్తే మాత్రం పెట్టిన బడ్జెట్ కి మూడింతలు వసూలు చేయగలుగుతాయి. ఈ మధ్య వచ్చిన సినిమాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

దసరా - దీపావళి సీజన్లలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వగా.. డ్రై సీజన్ గా భావించే మిగతా రోజుల్లో చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. తెలుగులో ఇటీవల వచ్చిన 'మసూద' చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఫస్ట్ వీక్ లో దాదాపు 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ హారర్ మూవీ.. నిర్మాతలకు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. రెండో వారంలోనూ ఈ సినిమాకు ఆక్యుపెన్సీ బాగుంది. ఇప్పుడు తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు.

అలానే సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టి హిట్ దిశగా పయనించింది. తమిళ్ లో 'లవ్ టుడే' అనే చిన్న చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిస్టారిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ తోలి రోజే 2 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

ఇక ఇటీవల మలయాళంలో రిలీజైన 'జయ జయ జయ జయహే' అనే చిన్న చిత్రం మాసివ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 5-6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా.. 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలానే తక్కువ బడ్జెట్ లో తీసిన 'ఉంచాయ్' అనే హిందీ సినిమా కూడా హిట్టైంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 40 కోట్ల వరకూ రాబట్టింది.

ఇలా ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాలు చాలా వరకు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. దీన్ని బట్టి చిన్న చిత్రాలకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంది. వీటి బాక్సాఫీస్ ఫలితాలు చూసి మరికొన్ని సినిమాలు థియేటర్లకు క్యూలు కడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లోనూ చిన్న సినిమాల సందడి ఇలానే కొనసాగుతుందేమో చూడాలి.