Begin typing your search above and press return to search.

కందికొండ‌కు చిత్ర‌పురిలో 2బెడ్ రూమ్.. ఏంటీ గుస‌గుస‌?

By:  Tupaki Desk   |   13 March 2022 8:30 AM GMT
కందికొండ‌కు చిత్ర‌పురిలో 2బెడ్ రూమ్.. ఏంటీ గుస‌గుస‌?
X
అనారోగ్యంతో కన్నుమూసిన సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని. తనకు విషయం తెలిసి చాలా బాధ పడుతున్నానని ఆయన అన్నారు. కందికొండ యాదగిరి చిత్రపురి కాలనీలో నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారని అనారోగ్యం పాలైన తర్వాత ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని నాలుగు లక్షలు వెనక్కి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అనారోగ్యం పాలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏదైనా సహాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

అందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారి సమక్షంలో కందికొండ కుటుంబానికి 20 లక్షల రూపాయలు విలువ చేసే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొని అందజేసార‌ని అన్నారు. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత తండ్రి అనారోగ్యం దృష్ట్యా సింగిల్ బెడ్ రూమ్ తమకు సరిపోవడం లేదని కందికొండ కుమార్తె తమ దృష్టికి తీసుకురావడంతో అది మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్లానని అనిల్ కుమార్ పేర్కొన్నారు.

మంత్రివర్యులు కూడా ఆ విషయం మీద సానుకూలంగా స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి అంగీకరించారని వారి కుమార్తెను సమయం చూసుకుని వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.

కందికొండ కుటుంబానికి ముందు సింగిల్ బెడ్ రూమ్ ఇచ్చామని డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామని ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. అయితే కొందరు కావాలని ఈ విషయం మీద దుష్ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలా చేయడం సరికాదని అన్నారు. కందికొండ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇవ్వడానికి ఏ సమయంలో అయినా సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా అనిల్ చెప్పుకొచ్చారు. చిత్రపురి అధ్య‌క్షుడి విన్న‌పాన్ని కాల‌నీలో ఉన్న 24శాఖ‌ల కార్మికులు విన్నార‌నే ఆశిద్దాం.

కందికొండ‌కు ధాతృ సాయం

టాలీవుడ్ లో చార్ట్ బ‌స్ట‌ర్ పాటల‌కు సాహిత్యం అందించారు కందికొండ‌. ఆయ‌న కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలున్నాయి. పూరీ జ‌గ‌న్నాథ్ స‌హా టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులతో అత‌డికి సాన్నిహిత్యం ఉంది. పూరి అన్ని సినిమాల‌కు ఇంచుమించుగా అత‌డు పాట‌లు రాశారు. నైజాం యాస భాష‌ను ప్ర‌తిబింబించే మాస్ పాట‌ల‌ను అత‌డు రాసాడు. చ‌క్క‌ని మెలోడీల‌కు సాహిత్యం అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి- దేశముదురు- ఇడియట్- చిరుత- టెంపర్ వంటి పలు సినిమాలకు లిరిక్స్ అందించారు.

అయితే ఆయ‌న గ‌త‌ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన విష‌యం తెలిసిందే. అత‌డి అనారోగ్యం కాంప్లికేటెడ్ అని వైద్యులు అప్ప‌ట్లో ధృవీక‌రించారు. భారీ ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం కావ‌డంతో కుటుంబ స‌భ్యులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. అంత‌కుముందు ఓ ప్ర‌యివేట్ ఆసుపత్రిలో వెన్ను భాగానికి శ‌స్త్ర చికిత్సను చేశారు. దీనికి అయ్యే మెజారిటీ ఖ‌ర్చును పాప్ స్టార్ స్మిత సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. స్మిత ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో సినీ కార్మికులు స‌హా ప్ర‌జ‌లకు త‌న‌వంతు సాయ‌మందించారు. సేవాకార్య‌క్ర‌మాల‌తో త‌న పెద్ద మ‌న‌సుతో ఆక‌ట్టుకున్నారు. కందికొండ సాయానికి ముందుకొచ్చారు. అయితే ప‌రిశ్ర‌మ‌లో ఇత‌ర కొలీగ్స్ నుంచి కందికొండ‌కు సాయం అంద‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్త‌మైంది.