Begin typing your search above and press return to search.

యూఎస్ లో తెలుగు సినిమా మీదున్న ప్రేమ వల్లే అది సాధ్యమైంది..!

By:  Tupaki Desk   |   23 March 2022 3:53 AM GMT
యూఎస్ లో తెలుగు సినిమా మీదున్న ప్రేమ వల్లే అది సాధ్యమైంది..!
X
'బాహుబలి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ''ఆర్.ఆర్.ఆర్'' అనే ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాని ప్రేక్షకులకు అందించబోతున్నారు. యావత్ సినీ ప్రియులు ఈ మల్టీస్టారర్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు.

ఇండియాలోనే కాకుండా ఓవర్ సీస్ లోనూ RRR సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. కరోనా పాండమిక్ కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తోంది. మార్చి 24న యుఎస్ ప్రీమియర్స్ ప్రదర్శించబడతాయి.

యూఎస్ఏలో 1200 లకి పైగా లోకేషన్స్ లో.. యూకేలో 1000కి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. యూఎస్ లో ప్రీ సేల్స్ రూపంలో ఇప్పటికే 2 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయంటే.. అక్కడ RRR సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓవర్ సీస్ లో సరిగమప సినిమాస్ మరియు రాఫ్తార్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చినప్పటికీ ఏమాత్రం బజ్ తగ్గకుండా డిస్ట్రిబ్యూటర్స్ ప్రచారం చేస్తూ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ ఓవర్సీస్ ఆడియన్స్ కోసం స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ షూట్ చేసి వదిలారు. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.

''నార్త్ అమెరికాలో ఒక లొకేషన్ లో 'స్పైడర్ మ్యాన్' లేటెస్ట్ సిరీస్ ప్రీమియర్స్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిందని యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ తేజు లాస్ట్ టైం నాకు చెప్పాడు. అయితే RRR సినిమా ప్రీమియర్స్ ద్వారా ఆ రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నాం.. యుఎస్ లో ఒక హాలీవుడ్ మూవీ రికార్డ్ ని మన తెలుగు సినిమా బీట్ చేయబోతోందని తెలిపాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది'' అని రాజమౌళి తెలిపారు.

''అయితే పాండమిక్ వచ్చి సినిమా రిలీజ్ ఆగిపోయింది.. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్లీ అలాంటి కలెక్షన్స్ వస్తాయా? అని నేను అడగ్గా.. 'అది ఆల్రెడీ క్రాస్ చేశాం సార్' అని తేజు చెప్పాడు. ఒక లొకేషన్ లో ప్రీమియర్స్ ద్వారా RRR మూవీ హయ్యెస్ట్ నంబర్స్ కలెక్ట్ చేసింది'' అని జక్కన్న చెప్పుకొచ్చారు.

ఇది కేవలం తను తారక్ - చరణ్ కలవడం వల్ల వచ్చింది కాదని.. అది ఓవర్ సీస్ లో తెలుగు ఆడియన్స్ కు మన సినిమా మీదున్న ప్రేమ వల్ల సాధ్యమైందని రాజమౌళి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యూఎస్ ప్రీ బుకింగ్స్ ని బట్టి చూస్తే ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద RRR సంచలనం సృష్టించబోతుందని అర్థం అవుతోంది.

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రిలీజ్ నాటికి ప్రీ సేల్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు అంచనా వేయొచ్చు. ఇది కరోనా పాండమిక్ తర్వాత అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచే అవకాశం ఉంది. అమెరికాలోనే కాకుండా.. ఆస్ట్రేలియా మరియు యూకే దేశాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీం నిజ జీవిత పాత్రలు తీసుకొని కల్పిత కథతో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రియా కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.