Begin typing your search above and press return to search.

ఇద్దరూ ఇద్దరే అంటున్న 'అందాల రాక్షసి'

By:  Tupaki Desk   |   10 Sep 2017 9:04 AM GMT
ఇద్దరూ ఇద్దరే అంటున్న అందాల రాక్షసి
X

తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాఖండ్ చిన్నది.. నడుమందాల సన్నజాజి లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన - భలేభలే మగాడివోయ్ - శ్రీరస్తు శుభమస్తు వంటి హిట్ మూవీస్ లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా నాగ చైతన్యతో కలిసి అమ్మడు నటించిన యుద్ధం శరణం థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. అయితే తాజాగా నిన్న ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ ఎవరికీ తెలియని చాలా విషయాలను పాఠకులతో పంచుకుంది. తండ్రీకొడుకులిద్దరితో అదేనండీ.. అక్కినేని నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా - నాగచైతన్యతో యుద్ధం శరణం చిత్రాల్లో నటించిన లావణ్య ఇద్దరూ ఇద్దరేనంటోంది.

ఇద్దరూ డౌన్ టు ఎర్త్ అని, కానీ యాక్టింగ్ లో మాత్రం ఎవరి ప్రత్యేతక వారిదే అని చెబుతోంది. తను చూసినవారిలో మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ నాగార్జునేనని చెప్పడం విశేషం. నానిలో తన స్పాంటేనియస్ నచ్చుతోందని, తన తొలిచిత్ర హీరో నవీన్ చంద్ర టాలెంటెడ్ అని - అల్లు శిరీష్ ఇంటెలిజెంట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తోంది. అంతేనా.. సందీప్ కిషన్ మంచి స్నేహితుడని - శర్వానంద్ ఫన్నీ అని - నాగ చైతన్య చాక్లెట్ బాయ్ అని యంగ్ హీరోలను తన బుట్టలో వేసుకునేలా చిలకపలుకులు పలుకుతోంది.

కాలేజీలో చదువుకునేటప్పుడే తనను అందాల రాక్షసి అని పిలిచేవారంట. ఎవరైనా వాష్ రూమ్ కి వెళ్తే ముఖం మొత్తం పౌడర్ రాసుకుని ఎర్రటి బొట్టు, కాటుక పెట్టుకుని తలుపు చాటున దాక్కుని భయటకు రాగానే వారిని భయపెట్టేదంట. వాళ్లు కోప్పడ్డా తర్వాత శాంతించి నువ్వు మా అందాల రాక్షసి అనేవారంట. ఈ పదమే తన సినిమా మొదటి టైటిల్ అవుతుందని కలలో కూడా అనుకోలేదని ఆనాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు వివరించింది ఈ చిన్నది.

కాజల్ మేనేజరే తనకూ మేనేజర్ గా వ్యవహరించాడని అయితే డ్రగ్స్ వ్యవహారంలో అతని ఫొటోతో పాటు కాజల్ ను టీవీల్లో చూపించారని దీనికి తాను ఎంతో బాధపడ్డానని అంటోంది ఈ చిన్నది. కాజల్ ఏ తప్పూ చేయకపోయినా మేనేజర్ కారణంగా తను ఇబ్బందులు పడ్డట్టు అనిపించిందని విచారం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా నటిగా నూటికి నూరు శాతం సంతృప్తి ఇచ్చిన పాత్ర ఇంతవరకు పడలేదంటూ ముక్తాయించింది ఈ భామ.