Begin typing your search above and press return to search.

నాగ్ ఫోన్ చేసి అడిగినా నో చెప్పిన అందాల రాక్ష‌సి!

By:  Tupaki Desk   |   6 July 2022 7:30 AM GMT
నాగ్ ఫోన్ చేసి అడిగినా నో చెప్పిన అందాల రాక్ష‌సి!
X
లావణ్య త్రిపాఠి.. ఈ సొట్టబుగ్గల సుందరి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 'అందాల రాక్షసి' మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన లావ‌ణ్య త్రిపాఠి.. తొలి ప్ర‌య‌త్నంలోనే హిట్ కొట్టి యూత్ ను ఎట్రాక్ట్ చేసింది. ఆ త‌ర్వాత అందం, అభిన‌యంతో వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. అయితే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎద‌గ‌లేక‌పోయినా.. న‌టిగా మంచి మార్కులు వేయించుకుంది. ఇక‌పోతే త్వ‌ర‌లోనే ఈ అందాల సోయ‌గం 'హ్యాపీ బర్త్ డే' అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది.

రితేష్ రానా దర్శకత్వం వ‌హించిన సర్రియల్ యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ల‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం జూలై 8న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని.. సినిమాకు సంబంధించి ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది.

అలాగే ఈ ఇంట‌ర్వ్యూలో 'సోగ్గాడే చిన్నినాయనా'కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న 'బంగార్రాజు' సినిమా గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. 'సోగ్గాడే చిన్నినాయనా'లో నాగార్జున‌కు జోడీగా లావ‌ణ్య న‌టించిన సంగ‌తి తెలిసిందే. 2016లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. దీంతో ఈ హిట్ మూవీకి సీక్వెల్ గా డైరెక్ట‌ర్ కళ్యాణ్ కృష్ణ కురసాల 'బంగార్రాజు'ను తెర‌కెక్కించాడు. ఇందులో నాగ చైత‌న్య‌, నాగార్జున‌లు క‌లిసి న‌టించారు.

ఇక సీక్వెల్ లోనూ లావ‌ణ్య త్రిపాఠి ఉంటుంద‌ని భావించినా.. అది జ‌ర‌గ‌లేదు. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో 'బంగార్రాజు చిత్రంలో మీరెందుకు నటించలేదు?' అన్న‌ ప్ర‌శ్న ఎదురైంది. అందుకు లావ‌ణ్య బ‌దులిస్తూ.. బంగార్రాజులో కూడా న‌టించ‌మ‌ని నాగార్జున గారు త‌న‌కు ఓ రోజు ఫోన్ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. 'సోగ్గాడే చిన్నినాయనాలో త‌న‌ది నాగార్జున భార్య పాత్ర కావ‌డం వ‌ల్ల సీక్వెల్ లో లీడ్ రోల్ పోషించిన‌ నాగచైతన్యకు త‌ల్లిగా చేయ‌మ‌ని అడిగార‌ట‌.

నాగార్జున‌ ఆ మాట‌న‌గానే లావ‌ణ్య‌ ఒకింత షాక్ అయింద‌ట‌. అందుకు కార‌ణం అప్ప‌టికే ఆమె చైతుకు జోడీగా 'యుద్ధం శరణం' అనే మూవీ చేసింది. అందువ‌ల్ల‌నే చైతుకి త‌ల్లిగా చేయ‌లేన‌ని లావ‌ణ్య త్రిపాఠి నాగ్ ఆఫ‌ర్ కు సున్నితంగా నో చెప్పింద‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే 'బంగార్రాజు'లో తాత నాగార్జున పాత్రని ఉంచి, తండ్రి నాగార్జున పాత్రని తీసేశార‌ని.. దాంతో లావణ్య పాత్రని కూడా ఎగిరిపోయింద‌ని తెలుస్తోంది.