Begin typing your search above and press return to search.

19 వ‌ర‌కు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్ర‌ద‌ర్శ‌న‌కు నో!

By:  Tupaki Desk   |   17 May 2019 6:26 AM GMT
19 వ‌ర‌కు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్ర‌ద‌ర్శ‌న‌కు నో!
X
వివాదాస్ప‌ద చిత్రంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వ‌ర్మ రూపొందించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీలో విడుద‌ల కాని విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల ముందు విడుద‌ల చేయాల‌ని భావించినా.. అందుకు ఏపీ అధికార‌ప‌క్షం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో విడుద‌ల ఆగింది. అనంత‌రం చిత్ర బృందం విడుద‌ల కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. చిత్ర విడుద‌ల విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నో చెప్ప‌టంతో సినిమా విడుద‌ల కాలేదు. పోలింగ్ పూర్తి అయిన త‌ర్వాత సినిమాను విడుద‌ల చేయాల‌ని భావించినా.. విడుద‌ల కాలేదు.

ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని తాజాగా నిర్ణ‌యించ‌టంతో ఈ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఈ నెల 19 వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

ఈ చిత్రాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల‌ను ఒప్పుకోలేద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఈసీ ఆదేశాల్ని ప‌ట్టించుకోకుండా విడుద‌ల‌పై నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుద‌ల‌పై ఉత్త‌ర్వుల్ని జారీ చేశారు.

దీనికి సంబంధించిన న‌క‌ళ్ల‌ను ఏపీ వ్యాప్తంగా అన్ని ఆర్వోలు.. ఎస్పీలు.. స‌బ్ క‌లెక్ట‌ర్లు.. ఆర్టీవోలు.. 66 మంది త‌హ‌సీల్దార్ల‌కు పంపారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని అన్ని థియేట‌ర్ య‌జ‌మానులు పంపారు. సో.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో ఈ నెల 19 త‌ర్వాతే విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి.