Begin typing your search above and press return to search.

హీరోయిన్లలో హీరో ఎవరంటే..

By:  Tupaki Desk   |   20 Aug 2015 6:22 PM GMT
హీరోయిన్లలో హీరో ఎవరంటే..
X
ఎంతటి పనినైనా ఎంతో సునాయాసంగా చెయ్యగలిగేవాడే మన సినిమా హీరో. అందుకే సాధారణ ప్రజలు చేయలేని వాటిని చేసినవారంతా హీరోలుగా కీర్తింపబడతారు. మరి సినిమా విషయానికొస్తే హీరోలలోనే హీరోలు ఎందుకుండాలి. కమేడియన్లలో అగ్రస్థానం సంపాదిస్తే కామెడియన్లలో హీరో అవుతాడు. అలాగే వరుసపెట్టి బంపర్ హిట్ సినిమాలు తీస్తూ వస్తే దర్శకులలో హీరో అవుతాడు. పైన చెప్పిన వాటికి బ్రహ్మానందం, రాజమౌళిలు సమాధానాలని కొత్తగా చెప్పనవసరం లేదు. మరి తెలుగు హీరోయిన్లలో హీరో ఎవరు? అదే నాయికలలో అగ్ర స్థానం ఎవరికి దక్కుతుంది?

హీరోలకు క్రేజ్, దర్శకులకు సక్సెస్ కొలమానమైన ఈరోజుల్లో నాయికామణులను మాత్రం కేవలం గ్లామర్ తో కొలవలేం. అటు అందాల విందుని వడ్డిస్తూనే ఇటు గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ చివరికి సినిమా విజయానికి కారణమైతేనే వారికి నిజమైన క్రెడిట్ దక్కుతుంది. అప్పటికప్పుడు వెలుగు వెలగడానికి వీటిలో ఒక్కటున్నా సరిపోతుందికానీ కలకాలం నిలవాలంటే అన్నిటి కలబోత వుండాల్సిందే.

ఇక మన హీరోయిన్ల జాబితాలో అగ్ర కధానాయికలుగా తరచూ వినిపిస్తున్న పేర్లు సమంతా, అనుష్క, శృతిహాసన్ ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. వీరిలో సమంతా కుందనపు బొమ్మగా అలరిస్తున్నా నటనా ప్రధానమైన పాత్రలు కరువవుతున్నాయి. గౌతం మీనన్ ఎటో వెళ్ళిపోయింది మనసు తరువాత గుర్తుపెట్టుకునే పాత్రలు దక్కలేదు. ఇక ఐరెన్ లెగ్ ముద్ర నుండి గోల్డెన్ లెగ్ గా మార్చుకున్న శృతికి కావలిసినంత టాలెంట్ వున్నా దర్శకులు ఆమెని గ్లామర్ డాల్ గానే చూస్తున్నారు. విజయ్ 'పులి'లో కధాప్రాధాన్యమైన పాత్ర పోషించినట్టు సమాచారం. రకుల్ ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతుంది. అటు గ్లామర్ తోనూ ఇటు నటనతోనూ, మరోవైపు వైవిధ్యంతోనూ తెలుగునాట దూసుకెళ్తున్న తార అనుష్క ఒక్కతే.. ప్రస్తుతం ఆమె చేతిలో వున్న సినిమాలే వాటికి ఉదాహరణ. రుద్రమదేవి, సైజ్ జీరో, బాహుబలి 2 ఆమె కెరీర్ లో మరపురాని చిత్రాలుగా నిలిచిపోవాలని కోరుకుందాం.. ఇంతకీ హీరోయిన్లలో హీరో ఎవరో అర్ధమైంది కదూ...