Begin typing your search above and press return to search.

లెజెండరీ కమెడియన్ ఆస్తుల వివరాలు వెల్లడించిన తమ్ముడు..!

By:  Tupaki Desk   |   18 May 2021 2:30 AM GMT
లెజెండరీ కమెడియన్ ఆస్తుల వివరాలు వెల్లడించిన తమ్ముడు..!
X
తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే నటులలో రాజబాబు ఒకరు. బ్రతికున్నన్నాళ్ళూ తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించి హాస్యనట చక్రవర్తిగా రాజబాబు నిలిచిపోయారు. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లాంటి హీరోలు సైతం రాజబాబు డేట్స్ దొరికిన తర్వాతే కొత్త సినిమాలకు డేట్స్ ఇచ్చేవాళ్లంటే అప్పట్లో ఆయన ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. బిజీ కమెడియన్ గా ఉన్న రాజబాబు అప్పట్లో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవాడని ఇండస్ట్రీలో చాలామంది అంటుంటారు. సంపాదనలో ఎక్కువ శాతం దానధర్మాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. అయితే లెజెండరీ కమెడియన్ రాజబాబు 47 ఏళ్లకే మరణించారు. రాజబాబుకు నాగేంద్ర బాబు - మహేష్ బాబు అనే ఇద్దరు కొడుకులున్నారు. ప్రస్తుతం వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇటీవల రాజబాబు పెద్ద తమ్ముడు, నటుడు చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

చిట్టిబాబు మాట్లాడుతూ.. ''కాకి లా కలకాలం బ్రతకను.. హంసలాగా ఆరు నెలలే బ్రతుకుతాను అనేవాడు అన్నయ్య.. అన్నట్లుగానే 47 ఏళ్లకే వెళ్ళిపోయాడు'' అని చెప్పారు. అన్నయ్య బాగా డబ్బు సంపాదించిన తర్వాత చేతికి ఎంత వస్తే అంత దానం చేశాడు.. ఎందరినో చదివించాడు.. పెళ్లిళ్లు చేశాడు.. కాలేజీలు కట్టించాడని తెలిపారు. అయితే రాజబాబు చాలా దురదృష్టవంతుడని.. అప్పట్లో అంత సంపాదించి కూడా అనుభవించకుండా వెళ్లిపోయాడని బాధ పడ్డాడు. ''రజినీకాంత్ - చిరంజీవి - రాజేంద్రప్రసాద్ వంటి వారు చదివిన ఇన్స్టిట్యూట్ కి నేను మా అన్నయ్య ఫారిన్ కారు వేసుకుని వెళ్ళేవాడిని. అన్నయ్య వల్ల అప్పుడే అన్నీ అనుభవించా. అందుకే ఇప్పుడు చిరంజీవి గారు కోటి రూపాయలు కారు కొన్నా నాకు ఏమి అనిపించదు'' అని చిట్టిబాబు అన్నారు. అప్పట్లో రాజబాబు లక్ష రూపాయలు పెట్టి శివాజీ గణేషన్ నుంచి ఫారెన్ కారు కొన్నాడని తెలిపాడు.

అయితే కార్లు కొన్నాడు.. బిల్డింగులు కొన్నాడు.. పేరు తెచ్చుకున్నాడు.. కీర్తి సంపాదించాడు.. కానీ ఇవేమీ రాజబాబుని పూర్ణాయుస్సుతో బ్రతకనివ్వలేదు అని అన్నాడు. ''రాజబాబు చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లల్లో ఒకరికి 9 ఏళ్ళు మరొకరికి 11 ఏళ్ళు. నిజంగా మా వదినకు పాదాభివందనం చేయాలి. అంత చిన్న పిల్లలను భర్త లేకుండా ఒంటరిగా పెంచి పెద్ద చేసి.. ఈ రోజు అమెరికాలో సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టుకొనే స్థాయికి ప్రయోజకులను చేసింది'' అని చెప్పుకొచ్చారు. రాజబాబు పిల్లలు ఇద్దరూ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారని.. అక్కడ 10 కోట్ల విలువ చేసే ఇంట్లో హాయిగా జీవిస్తున్నారని.. సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టారని.. ఇండియాలో 25 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు చిట్టి బాబు. అయితే ఇవన్నీ చూడకుండానే రాజబాబు వెళ్లిపోయారని అన్నయ్యను తలచుకొని చిట్టుబాబు కన్నీటి పర్యంతం అయ్యారు.