Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ క్రికెట‌ర్ లాలా బ‌యోపిక్

By:  Tupaki Desk   |   4 Dec 2019 4:40 AM GMT
లెజెండ‌రీ  క్రికెట‌ర్ లాలా బ‌యోపిక్
X
క్రీడా బ‌యోపిక్ ల హుషారు చూస్తున్న‌దే. స‌చిన్ .. ధోనీ.. మిల్కా సింగ్.. మేరికోమ్ .. అజ‌హ‌రుద్దీన్ వంటి క్రీడాకారుల‌పై బ‌యోపిక్ లు వ‌చ్చాయి. ఇప్పుడు క్లాసిక్ డేస్ లెజెండ‌రీ క్రికెట‌ర్ పై సినిమాకి రాజ్ కుమార్ హిరాణీ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ స‌న్నాహాలు చేస్తుండ‌డం వేడెక్కిస్తోంది.

మున్నాభాయ్ సిరీస్ .. పీకే.. సంజు వంటి చిత్రాల‌తో సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడిగా రికార్డుల‌కెక్కిన‌ రాజ్‌కుమార్ హిరాణి .. ఏ ప్ర‌య‌త్నం చేసినా అభిమానుల్లో క్యూరియాసిటీ ఉంటుంది. అత‌డు ఎంచుకునే క‌థ‌ల‌కు ఉండే క్రేజు అలాంటిది. సున్నిత అంశాలు.. మాన‌వ‌తా విలువ‌లున్న‌ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన రాజ్‌కుమార్ హిరాణీ త్వ‌ర‌లో ఓ లెజెండ‌రీ క్రికెట‌ర్ జీవితాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. సంజ‌య్ ద‌త్‌ జీవితక‌థ‌ని ర‌ణ‌బీర్ క‌పూర్ తో తెర‌కెక్కించి శ‌హ‌భాష్ అనిపించుకున్న ఆయ‌న ఈసారి లెజెండ‌రీ క్రికెట‌ర్ లాలా అమ‌ర్ నాథ్ జీవిత క‌థ‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించి హిరాణి ప్రీప్రొడ‌క్ష‌న్ కి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మారిన ట్రెండ్ లో క్లాసిక్ డేస్ క్రికెట‌ర్ల గురించి నేటిత‌రానికి తెలిసింది త‌క్కువే. అయితే అలాంటి ఓ గ్రేట్ క్రికెట‌ర్ లాలా అని చెప్పొచ్చు. టెస్టుల్లో భార‌త్ త‌రుపున తొలి సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా లాలా అమ‌ర్ నాథ్ రికార్డు నెల‌కొల్పారు. ఇండియా త‌రుపున 1933 నుంచి 1953 వ‌ర‌కు ప్రాతినిధ్యం వ‌హించిన అమ‌ర్ నాథ్ 24 టెస్ట్‌లు.. 184 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో భార‌త్ త‌రుపున ఆడిన క్రికెట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి లెజెండ‌రీ క్రికెటర్ జీవితాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు రాజ్‌కుమార్ హిరాణి. అయితే బ‌యోపిక్ ఏదైనా సునిశిత అంశాల‌తో హృద‌యాల్ని రంజింప‌జేయాలి. క్రీడా స్ఫూర్తిని ర‌గిలించాలి. ఆ స‌త్తా హిరాణికి ఉంది. ష్యూర్ షాట్ హిట్ కొట్టే ట్యాలెంట్ అత‌డిది కాబ‌ట్టి దీని పైనా అంచనాలుంటాయి.

క్రికెట్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కిన‌ టాలీవుడ్ మూవీ `జెర్సీ` బాలీవుడ్ లో అదే పేరుతో రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో షాహీద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా ద్వారా గౌత‌మ్ తిన్న‌నూరి బాలీవుడ్ కు వెళుతున్నాడు. ఇదే స‌మ‌యంలో రాజ్ కుమార్ హిరాణీ లాంటి ద‌ర్శ‌కుడు క్రికెట్ నేప‌థ్యం లో బ‌యోపిక్ తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.