Begin typing your search above and press return to search.

271 కోట్ల ఆస్తి కోసం లెజెండ‌రీ శివాజీ గ‌ణేష‌న్ ఇంట త‌గాదా

By:  Tupaki Desk   |   8 July 2022 1:06 PM GMT
271 కోట్ల ఆస్తి కోసం లెజెండ‌రీ శివాజీ గ‌ణేష‌న్ ఇంట త‌గాదా
X
నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ఇంట ఆస్తి త‌గాదాలు ర‌చ్చ‌కెక్కాయి. కొడుకుల‌తో స‌మానంగా త‌మ‌కు వాటా కావాలంటూ కూతుళ్లు బిగ్ ఫైట్ కి దిగారు. దాదాపు 271 కోట్ల విలువ చేసే ఆస్తి కోసం ఫైటింగ్ ఇద‌ని త‌మిళ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. వివ‌రాల్లోకి వెళితే...

నడిగర్ తిలగం శివాజీ గణేశన్ భార‌త‌దేశంలోని గొప్ప నటులలో ఒకరిగా కీర్తిప్ర‌తిష్ఠ‌లు సంపాదించుకున్నారు. ఆయన మరణించి రెండు దశాబ్దాలు గడిచినా అభిమానుల్లో ఎక్క‌డా క్రేజ్ ఎక్క‌డా తగ్గలేదు. దివంగత కమల్ గణేశన్ ఆయ‌న స‌తీమ‌ణి. వారికి నిర్మాత-నటుడు రామ్ కుమార్- శాంతి- రజ్వీ- ప్రముఖ నటుడు ప్రభు నలుగురు పిల్లలు.

శివాజీ గణేశన్ కుటుంబంలో వార‌సులు అంతా ఒక‌టిగానే ఉన్నార‌ని అంతా భావించారు. కానీ ఇంత‌లోనే షాకింగ్ వార్త బ‌య‌ట‌ప‌డింది. శివాజీ గ‌ణేష‌న్ కుమార్తెలు శాంతి - రజ్వి తమ తోబుట్టువులపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్ లో దివంగత నటుడు శివాజీ గ‌ణేష‌న్ సంపద ప్రస్తుతం రూ. 271 కోట్లు. వారసత్వ చట్టం 2005 సవరించిన చట్టం ప్రకారం కుమార్తెలకు కూడా కుమారులతో సమాన హక్కులు క‌ల్పించాలి అని పిటిష‌న్ వేసారు.

తమ తండ్రి ఎలాంటి వీలునామా రాయ‌లేదని.. తోబుట్టువులు రామ్ కుమార్- ప్రభు నకిలీ వీలునామాతో మొత్తం సంపదను స్వాధీనం చేసుకున్నారని శాంతి- రజ్వీ ఆరోపించారు. తమకు తెలియకుండానే అనేక ఆస్తులను విక్రయించారని.. వారి సోదరులు తమ కుమారుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని వారు వాద‌న‌లు వినిపిస్తున్నారు. 1000 సవర్ల విలువైన బంగారం.. వజ్రాలు.. వెండి ఆభరణాలను కూడా మోసం చేశారని ఆరోపించారు.

ఆస్తి త‌గాదాను మ‌రింత లోతుగా ప‌రిశీలిస్తే..శివాజీ గ‌ణేష‌న్ కుమార్తెలు శాంతి నారాయణస్వామి - రజ్వీ గోవిందరాజన్ లు తమ సోదరులు వారి వార‌సులపై త‌మ‌ తల్లిదండ్రుల ఆస్తులను `అక్రమంగా విక్రయం.. దుర్వినియోగం`` చేశారని పిటీష‌న్ లో ఆరోపించారు. కుమార్తెల వాద‌న ప్ర‌కారం.. నలుగురు పిల్లలు అన్ని ఆస్తులపై నాలుగో వంతు వాటాకు అర్హులు. 8 కిలోల బంగారం.. 500 కిలోల వెండి ఆభరణాలను ప్రభు- రామ్‌కుమార్ అక్రమంగా సొంతం చేసుకున్నారని కుమార్తెలు ఆరోపించారు. ఐకానిక్ శాంతి థియేటర్ లో రూ.82 కోట్ల విలువైన వాటాను సోదరులు అక్రమంగా తీసుకున్నారని కుమార్తెలు ఆరోపించారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సోదరులు తమ తండ్రి సంతకాలు న‌కిలీవి తీసుకున్నారని ఆరోపించారు. శివాజీ కుమార్తెలు .. త‌మ సోద‌రులు ప్రభు గణేశన్- ఆయన కుమారుడు-నటుడు విక్రమ్ ప్రభు.. నిర్మాత రామ్ కుమార్.. ఆయన కుమారుడు నటుడు దుష్యంత్ రామ్ కుమార్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

శివాజీ గణేశన్ 2001లో మరణించగా ఆయన భార్య కమల 2007లో మరణించారు. శివాజీ గణేశన్ తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం - హిందీ సహా పలు భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. శివాజీ మరణించిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత‌ కుమార్తెలు వారసత్వ పోరాటంలో పాల్గొని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించి గతంలో చేసిన విక్రయాలు చెల్లవని ప్రకటించాలని కోరారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రామ్ కుమార్ ప్రస్తుతం రాజకీయాలలో నిమగ్నమై బీజేపీలో చురుగ్గా కొనసాగుతున్నారు. మరోవైపు ప్రభు వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. దళపతి విజయ్ తో కలిసి `వరిసు` లాంటి క్రేజీ సినిమాలో న‌టిస్తున్న అత‌డు.. మరికొన్ని చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

టాలీవుడ్ లో లెజెండ‌రీ ద‌ర్శ‌క‌నిర్మాత దాస‌రి నారాయ‌ణ‌రావు ఇంట ఆస్తి త‌గాదాలు అప్ప‌ట్లో రచ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. దాస‌రికి స‌న్నిహితులు.. ఆయ‌న‌ ఫేవ‌రెట్ హీరో శివాజీ గ‌ణేష‌న్ ఇంట కూడా ఆస్తి త‌గాదాలు బ‌య‌ట‌ప‌డడం ఇప్పుడు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.