Begin typing your search above and press return to search.

పెద్ద సినిమాకే ఇలా అయితే చిన్న సినిమాల పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   1 Feb 2020 8:14 AM GMT
పెద్ద సినిమాకే ఇలా అయితే చిన్న సినిమాల పరిస్థితి ఏంటీ?
X
గతంలో చిన్న సినిమాల నిర్మాతలు పలువురు తమ సినిమాల విడుదల సమయంలో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని.. పెద్ద నిర్మాతలు పలువురు థియేటర్ల ను వారి ఆధీనం లో పెట్టుకుని చిన్న సినిమాలకు దారి ఇవ్వడం లేదని.. చాలా తక్కువ థియేటర్లను ఇవ్వడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు అంటూ నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్ర నిర్మాత కేఎస్‌ రామారావు కూడా థియేటర్లపై ఆధిపత్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట.

ఈనెల 7వ తారీకున రాబోతున్న 'జాను' చిత్రానికి పెద్ద ఎత్తున థియేటర్లు ఉన్నాయి. కాని మా సినిమా కు మాత్రం థియేటర్ల కొరత ఏర్పడింది అంటూ నిర్మాత రామారావు అన్నారట. కొందరు నిర్మాతలకు మాత్రమే లాభం కలిగేలా ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఏర్పాటు చేయడం ఏంటనీ.. నిర్మాతల మండలి వల్ల అప్పుడు ఉపయోగం ఏంటంటూ ఆయన ప్రశ్నించాడు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రానికి భారీ బజ్‌ క్రియేట్‌ అవ్వలేదు. దాంతో థియేటర్లు ఎక్కువ దక్కలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం లేదని గతంలో పలు సార్లు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ వంటి స్టార్‌ నటించిన సినిమాకు కూడా థియేటర్లు లభించక పోతే పరిస్థితి ఏంటీ అంటూ రౌడీ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రౌడీ సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే కొత్త హీరోల సినిమాలకు చిన్న బడ్జెట్‌ చిత్రాలను అసలు ఆ నిర్మాతలు బతకనిస్తారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి 14న సాధ్యం అయినంత వరకు ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అది ఏ మేరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి. జాను ఫలితంపై కూడా రౌడీ సినిమా థియేటర్ల సంఖ్య ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.