Begin typing your search above and press return to search.

కోవిడ్-19 నుండి దేశాన్ని రక్షించుకుందాం: RRR టీమ్ విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   6 May 2021 10:30 AM GMT
కోవిడ్-19 నుండి దేశాన్ని రక్షించుకుందాం: RRR టీమ్ విజ్ఞప్తి
X
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటమే కాకుండా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు ప్రాంతాల్లో లాక్‌ డౌన్ నైట్ కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ కూడా కరోనా వ్యాప్తి నివారణకు తమ వంతు కృషి చేస్తోంది. కరోనా వేళ జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్‌ తప్పకుండా ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని.. వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ గురించి, ఆసుపత్రిలో బెడ్స్ - ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబిలిటీ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రజలకు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఓ వీడియోతో ముందుకు వచ్చారు.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అజయ్ దేవగన్ - హీరోయిన్ అలియా భట్ - దర్శకుడు రాజమౌళి వివిధ భాషల్లో కరోనా మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, అందుబాటులో ఉంటే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని, అందరూ భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేలా తోటివారిని ప్రోత్సహించమని కోరారు. మన కోసం, మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం, చుట్టూ ఉన్నవారి కోసం, దేశం కోసం జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ విజ్ఞప్తి చేసింది.

ఈ వీడియో అలియా తెలుగులో మాట్లాడగా కన్నడలో ఎన్టీఆర్.. తమిళ్ లో చరణ్, మలయాళంలో రాజమౌళి.. అజయ్ దేవగన్ హిందీలో మాట్లాడుతూ ప్రజలకు జాగ్రత్తలు తెలియజేసారు. ''మాస్క్ ధరించండి. అందుబాటులో ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి! వైరస్ వ్యాప్తిని ఆపడానికి మరియు కోవిడ్-19 నుండి దేశాన్ని రక్షించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడండి'' అని 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ పేర్కొన్నారు.