Begin typing your search above and press return to search.

బ్లాక్ మనీని వైట్ చేయడానికే 'లైగర్' సినిమా తీశారు..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 4:49 AM GMT
బ్లాక్ మనీని వైట్ చేయడానికే లైగర్ సినిమా తీశారు..!
X
"లైగర్" సినిమా నిర్మాణంలో విదేశీ పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ లను విచారించిన సంగతి తెలిసిందే. గురువారం దాదాపు 13 గంటలపాటు ఈ విచారణ సాగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ ఫిర్యాదు మేరకు ఈడి అధికారులు ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

"లైగర్‌" ప్రాజెక్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టినట్లు ఈడీకి ఫిర్యాదు చేసింది తానేనని బక్కా జాడ్సన్ పేర్కొన్నారు. ఈ విషయములో గతంలో తానిచ్చిన కంప్లెయింట్ మేరకే పూరీ జగన్నాథ్ - ఛార్మీ లను అధికారులు విచారిస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ కూతురు కవిత - పూరీ జగన్నాథ్ - ఛార్మీలపై ఈడీకి ఫిర్యాదు చేసింది నేనే. కవిత నల్లధనాన్ని వైట్‌ గా మార్చడానికి లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టారు అని బక్కా జాడ్సన్ ఆరోపించారు. దీని మీద ఢిల్లీలో ఈడీ మరియు సీబీఐలకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

ఈడీ వద్ద పక్కా ఆధారాలు వున్నాయి కాబట్టే ఇప్పుడు పూరీ - ఛార్మీలను విచారించారని అన్నారు. నిన్న అధికారులు లెక్కలు తెమ్మన్నారు. అన్నీ కరెక్ట్ గా ఉంటే ఒక గంటలో విచారణ అయిపోయేది. వీళ్ళు జవాబులు చెప్పలేకపోయారు కాబట్టే.. అన్ని గంటలు విచారించారని అన్నారు.

లైగర్ ఇష్యూ ఇప్పుడు పెద్ద సబ్జెక్టు అయింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా కావడంతో నేషనల్ ఇష్యూ అయింది. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయటానికి తెరాసకు చెందిన కవిత మరియు బీజేపీ ఎంపీ అరవింద్ కుమ్మక్కై ఒకరి మీద ఒకరు మాటల యుద్దాలు చేసుకుంటున్నారని.. ఇదంతా ఒక డ్రామా అని జాడ్సన్ ఆరోపించారు.

బక్కా జాడ్సన్ మాట్లాడుతూ.. "2017లో డ్రగ్స్ కేసులో 17 మంది సినీ సెలబ్రటీలను పిలిచి విచారించారు. వెంట్రుకలు గోళ్ళు సేకరించారు. ఆ తరవాత ఆ కేసు సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి ప్రతీ సినిమా ఈవెంట్ కు గెస్టుగా తెలంగాణ బాహుబలి కల్వకుంట్ల తారకరామారావు హాజరవడం స్టార్ట్ అయ్యింది"

"బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణం కేసులో డ్రగ్స్ కేసులో ఎంక్వైరీ చేస్తే మళ్ళీ హైదరాబాద్ లో మూలాలు బయటపడ్డాయి. అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా విచారించారు. 17 మంది సెలబ్రిటీలు ఉన్న ఫొటోలను కూడా నేను ఈడి ఆఫీస్ లో ఇచ్చాను. తెల్లారే రంగారెడ్డి జిల్లా కోర్టు వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది"

"ఈ కేసులో పూరీ జగన్నాథ్ - ఛార్మి కూడా ఉన్నారు. అక్కడి నుంచి వీరికి కవితతో అనుబంధం ఏర్పడింది. అప్పట్లో కవిత కొంతమంది ప్రొడ్యూసర్స్ ను పిలిపించి అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ని ప్రమోట్ చేయాలని.. పెద్ద పెద్ద సినిమాలు తీయాలని వారికి చెప్పింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా మూవీ చేశారు. ఇవన్నీ కూడా నేను ఈడికి వివరించాను" అని తెలిపారు.

"ఎన్నడూ లేని విధంగా పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా అప్పుడు ఎక్కువ మార్కెట్ కి వచ్చాడు. నేను కేసు పెట్టిన తర్వాత మరీ ఎక్కువగా వచ్చాడు. 'నేను డబ్బులు కట్టను.. ఏం చేసుకుంటారో చేసుకోండి' అని పూరీ మాట్లాడిండు. ఒక పాన్ ఇండియా సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరూ అలా మాట్లాడరు. ఈ కథా స్క్రీన్ ప్లే నడిపించింది వీళ్ళే"

"నిజంగా ఎవరైనా పాన్ ఇండియా సినిమా తీయాలనుకుంటే.. విజయ్ దేవరకొండ తో తీయరు. ఎందుకంటే ఆయనకు పాన్ ఇండియా క్రేజ్ లేదు. ప్రభాస్ - మహేశ్ బాబు లాంటి ఐదారుగురు యాక్టర్స్ కు మాత్రమే ఉంది. పాన్ ఇండియా అంటే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలి. విజయ్ దేవరకొండ కు కలెక్షన్స్ వస్తాయో రావో ఆమాత్రం తెలియదా? ఇది కచ్చితంగా అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేయటానికి తీసిన సినిమా"

"కాబట్టే ఇప్పుడు తెలంగాణాలో ఓ పెద్ద డ్రామా నడుస్తోంది. సీఎం కూతురు - బీజేపీ నాయకుడు కలిసే ఈ ఇష్యూని పక్కదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానని కవిత నా మీదకి రావాలి కానీ.. అరవింద్ ఇంటి మీదకు ఎందుకు వెళ్ళింది? ఈడీ ఎంక్వైరీ చేస్తుంటే కవిత ఎందుకు లైగర్ ఇష్యూ మీద మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇద్దరూ తోడు దొంగలు" అని జాడ్సన్ అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.