Begin typing your search above and press return to search.

ఆ ఫైనాన్షియర్‌.. స్టార్ హీరోనూ బెదిరించాడట

By:  Tupaki Desk   |   23 Nov 2017 12:36 PM IST
ఆ ఫైనాన్షియర్‌.. స్టార్ హీరోనూ బెదిరించాడట
X
తమిళ సినీ పరిశ్రమను రెండు రోజులుగా ఓ అంశం కుదిపేస్తోంది. ప్రముఖ నటుడు.. దర్శక నిర్మాత శశికుమార్ బావ.. స్వయంగా నిర్మాత కూడా అయిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం అక్కడ కలకలం రేపింది. అన్బు చెళియన్ అనే ఫైనాన్షియర్ ఒత్తిడిని తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అశోక్.. సుదీర్ఘంగా ఒక లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమిళ సినీ పరిశ్రమ అంతా అన్బు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఫైనాన్షియర్లు నిర్మాతల్ని వడ్డీల కోసం ఎలా వేధిస్తారో.. అధిక వడ్డీలు వేసి ఎలా కుంగదీస్తారో ప్రముఖులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి చెబుతున్నారు.

ఇటీవలే ‘కేరాఫ్ సూర్య’ సినిమాతో పలకరించిన దర్శకుడు సుశీంద్రన్ సైతం ఈ విషయమై స్పందించాడు. అన్బు చెళియన్ దారుణమైన వ్యక్తి అని.. అతను ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడని అతను ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అజిత్ కుమార్ లాంటి స్టార్ హీరో కూడా అన్బు చెళియన్ బాధితుడే అని అతను వెల్లడించాడు. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్ కడవుల్’ (తెలుగులో నేను దేవుణ్ని)లో నిజానికి అజితే హీరోగా నటించాల్సిందని.. ఐతే అన్బు చెళియన్ బెదిరింపుల వల్లే అతను ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని.. దాని వెనుక పెద్ద కథ ఉందని సుశీంద్రన్ అన్నాడు. మరోవైపు గౌతమ్ వాసుదేవ్ మీనన్.. పార్తీబన్ లాంటి ప్రముఖ దర్శక నిర్మాతల్ని కూడా అన్బు తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని.. అతను ఫైనాన్స్ మాఫియాను గుప్పెట్లో పెట్టుకుని నిర్మాతల్ని ఆడుకుంటున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.