Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : లైక్ షేర్ అండ్ సబ్‌ స్క్రైబ్

By:  Tupaki Desk   |   4 Nov 2022 10:15 AM GMT
మూవీ రివ్యూ : లైక్ షేర్ అండ్ సబ్‌ స్క్రైబ్
X
'లైక్ షేర్ అండ్ సబ్‌ స్క్రైబ్' మూవీ రివ్యూ
నటీనటులు: సంతోష్ శోభన్-ఫరియా అబ్దుల్లా-సుదర్శన్-గోవింద్ పద్మసూర్య-బ్రహ్మాజీ-సప్తగిరి-రఘుబాబు-మిర్చి కిరణ్-ఆడుగళం నరేన్-మీమ్ గోపి తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు-రామ్ మిరియాల
ఛాయాగ్రహణం: వసంత్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా ప్రేక్షకులను అలరించిన యువ దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఆ తర్వాత 'కృష్ణార్జున యుద్ధం'తో ఎదురు దెబ్బ తిన్నాడు. మధ్యలో ఓటీటీలో 'మ్యాస్ట్రో' మూవీ ద్వారా పలకరించిన గాంధీ.. ఇప్పుడు టాలెంటెడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అనే ట్రెండీ టైటిల్ తో సినిమా తీశాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం.. తెరపై ఎంత మేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ: విప్లవ్ (సంతోష్ శోభన్) పెద్ద ట్రావెల్ వ్లాగర్ కావాలన్న లక్ష్యంతో గువ్వ విహారి పేరుతో ఒక కొత్త యూట్యూబ్ ఛానెల్ మొదలుపెడతాడు. ఆ ఛానెల్ కి సబ్ స్క్రైబర్లను పెంచేే లక్ష్యంతో అతను అరకుకు బయల్దేరతాడు. అతను వ్లాగర్ కావడానికి స్ఫూర్తిగా నిలిచిన వసుధ వర్మ (ఫరియా అబ్దుల్లా) కూడా వీడియోలు తీయడం కోసం అక్కడికి వస్తుంది. వీరు తమ యూట్యూబ్ ఛానెళ్ల కోసం వీడియోలు తీసే పనిలో ఉండగా.. వసుధ డీజీపీ కూతురని తెలుస్తుంది. డీజీపీపై పగబట్టిన నక్సలైట్లు వసుధ కోసం అరకులో వెతుకుతున్న సమయంలో ఆమెతో పాటు విప్లవ్ ను కూడా ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. మరి ఆ గ్యాంగ్ ఎవరు.. కిడ్నాప్ తర్వాత జర్నీలో విప్లవ్-వసుధ ఎలా దగ్గరయ్యారు.. వాళ్లిద్దరూ కిడ్నాప్ గ్యాంగ్ నుంచి ఎలా బయటపడ్డారు.. డీజీపీతో నక్సలైట్ల వైరం ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: 'లైక్ షేర్ అండ్ సబ్‌ స్క్రైబ్' సినిమాలో హీరో సంతోష్ శోభన్.. రఘుబాబుకు తన కథంగా చెబుతుంటాడు. అతను ఎక్కడ బ్రేక్ ఇచ్చినా రఘుబాబు చిరాకు పడిపోతూ చాలా టెన్షన్ గా ఉంది.. తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటాడు. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం అంత టెన్షన్ పడిపోయేంత ఉత్కంఠ ఏమీ లేదీ చిత్రంలో. ఆరంభం నుంచి గందరగోళంగా సాగే సినిమాలో కథ సరిగా అర్థం కాక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది తప్ప.. ఉత్కంఠకు అవకాశమే లేదు. సీరియస్ కథను కామెడీ టోన్లో చెప్పడానికి దర్శకుడు మేర్లపాక గాంధీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టేసింది. కామెడీ పేరుతో మరీ సిల్లీగా అనిపించే సీన్లతో నింపేయడం.. కథాకథనాలు ఎంతమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'కు లైక్ కొట్టడం కష్టమే అవుతుంది.

పేరున్న ఆర్టిస్టులను పెట్టుకుని.. రకరకాల లొకేషన్లలో.. చెప్పుకోదగ్గ బడ్జెట్లోనే సినిమా తీశాడు మేర్లపాక గాంధీ. కానీ కథతో ఏమాత్రం సంబంధం లేకుండా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అంటూ నాన్ సీరియస్ టైటిల్ పెట్టాడు. ఈ టైటిల్ చూస్తేనే అసలిది ఫీచర్ ఫిలిమా లేక యూట్యూబ్ షార్టా అన్న సందేహం కలుగుతుంది. ఈ చిత్రాన్ని జనం అంత సీరియస్ గా తీసుకోకపోవడానికి కూడా అదే కారణం ఏమో. ఇక సినిమాను నడిపించిన విధానంలోనూ మేర్లపాక గాంధీ తాను కన్ఫ్యూజ్ అయి ప్రేక్షకులనూ కన్ఫ్యూజ్ చేశాడు. ఓపక్క నక్సలైట్లకు పోలీసులకు మధ్య వార్.. ప్రభుత్వంతో శాంతి చర్చలు.. నక్సలైట్ నాయకుల హతం.. అంటూ సీరియస్ అంశాల చుట్టూ మూల కథను రాసుకున్న గాంధీ.. ఒక వీడియో బ్లాగర్ గా హీరోను పరిచయం చేసి అతను సబ్ స్క్రైబర్లను పెంచుకోవడానికి పడే పాట్ల చుట్టూ సిల్లీ ఎపిసోడ్ ను నడిపించాడు. ఈ రెండు అంశాలు అస్సలు సింక్ కాలేదు. హీరో యూట్యూబ్ ఛానెల్ గొడవంతా ఒక చిన్న ఎపిసోడ్ కు పరిమితం. మరి దాన్ని సూచించేలా ఈ చిత్రానికి 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అనే సిల్లీ టైటిల్ అసలెందుకు పెట్టారన్నది అర్థం కాని విషయం.

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'.. 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాల్లో టిపికల్ క్యారెక్టర్ల ద్వారా.. సిచువేషన్ల ద్వారా చక్కటి కామెడీని పండించిన గాంధీ.. 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'లో ఫన్ జనరేట్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు. దంగల్.. రామ్ లీలా లాంటి సినిమాలు తీసిన కెమెరామన్ గా సుదర్శన్ ను చూపించడం.. అది నమ్మి హీరో అతణ్ని తన యూట్యూబ్ ఛానెల్ కోసం కెమెరామన్ గా పెట్టుకోవడం.. మధ్యలో విషయం తెలిసి అతడి మీద హీరో దండెత్తడం ఇదంతా మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఎప్పుడో 'అమ్మో ఒకటో తారీఖు' లాంటి చిత్రాల్లో ఇలాంటి కామెడీ.. అది కూడా వేరే టోన్లో తీస్తే వర్కవుట్ అయింది కానీ.. ఈ రోజుల్లో ఇలాంటి కామెడీ నడుస్తుందని అనుకోవడం విడ్డూరం. ఇలాంటి సిల్లీ సీన్లు సినిమాలో చాలా ఉన్నాయి.

'లైక్ షేర్ అండ్ సబ్ స్కైబ్'లో కామెడీ పూర్తిగా తేలిపోయిందని చెప్పలేం. అక్కడక్కడా కొన్నిచోట్ల నవ్వులు పండాయి. ఒక రౌడీ బ్యాచుని హీరో ఎదుర్కొనేటపుడు ముందు వాళ్లతో ఫైట్ విజువలైజ్ చేసుకోవడం.. తీరా రంగంలోకి దిగాక దానికి భిన్నంగా వారి చేతుల్లో తన్నులు తినడం లాంటి సీన్లు ఫన్నీగా అనిపిస్తాయి. అలాగే బ్రహ్మాజీ తన వంతుగా మంచి నవ్వులే పండించాడు. కానీ ఎక్కడో ఒక చోట కొన్ని నవ్వులు పండడం తప్పితే.. కథాకథనాల్లో ఏమాత్రం ఆసక్తి లేకపోవడం.. అసలు ఈ కథ ఎటు పోతోందో అర్థం కాని గందరగోళం నెలకొనడం సినిమాకు పెద్ద మైనస్. నక్సలైట్ వ్యవహారం అంటేనే పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన రోజుల్లో దాని చుట్టూ కథను అల్లుకోవడం కూడా ప్రతికూలతే. అక్కడక్కడా కొన్ని నవ్వుల కోసం మొత్తం సినిమాను భరించడం అయితే కష్టమే.

నటీనటులు: సంతోష్ శోభన్ మంచి నటుడని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. ఈ సినిమాలోనూ అతను ఆకట్టుకున్నాడు. విప్లవ్ పాత్రలో అతను చలాకీగా నటించాడు. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ట్రెండీగా సాగింది అతడి నటన. మంచి ఈజ్ ఉన్న ఈ కుర్రాడిని సరిగ్గా వాడుకునే దర్శకులు పడితే వేరే లెవెల్ కు వెళ్లగలడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ లాగా కాకుండా ఒక మామూలు అమ్మాయిలా కనిపించింది. వసుధ పాత్రలో ఆమె ఓకే అనిపించింది. లుక్స్ పరంగా ఫరియా యావరేజ్ కావడం మైనస్. పాత్రలో బలం లేకపోయేసరికి ఆమె సాధారణంగా అనిపించింది. సినిమా మొత్తంలో పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ ఆకట్టుకుంది బ్రహ్మాజీనే. మంచి కామెడీ పాత్రలు పడితే చెలరేగిపోయే బ్రహ్మాజీ.. తెలివి తక్కువ నక్సలైట్ నాయకుడు బ్రహ్మన్న పాత్రల్లో కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. తమిళ నటుడు ఆడుగళం నరేన్.. మీమ్ గోపి తమ పాత్రల్లో బాగానే చేశారు. హీరో పక్కనే ఉండే క్యారెక్టర్లో సుదర్శన్ అక్కడక్కడా పంచులు పేల్చాడు. సప్తగిరి కామెడీ పర్వాలేదు.

సాంకేతిక వర్గం: ప్రవీణ్ లక్కరాజు.. రామ్ మిరియాల పాటలు సోసోగా అనిపిస్తాయి. ఒక్క పాట కూడా వినాలనిపించేలా లేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. వసంత్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో మెరుపులు మెరిపించి.. 'కృష్ణార్జున యుద్ధం'తో గాడి తప్పిన మేర్లపాక గాంధీ.. ఈసారి మరింత కిందికి పడిపోయాడు. అతడి కథ కానీ.. కథనం కానీ ఎంగేజింగ్ గా లేదు. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్ల వరకు బాగానే డీల్ చేసినా.. మిగతా విషయాల్లో నిరాశ పరిచాడు. కథలో ఏమాత్రం ఆకర్షణ లేకపోగా.. కథనాన్ని గందరగోళంగా నడిపించిన గాంధీ.. సినిమాను అనాసక్తికరంగా తయారు చేశాడు.

చివరగా: లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్.. నో లైక్స్

రేటింగ్-1.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater