Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: లోఫర్

By:  Tupaki Desk   |   17 Dec 2015 9:31 AM GMT
మూవీ రివ్యూ: లోఫర్
X
చిత్రం : ‘లోఫర్’

నటీనటులు: వరుణ్ తేజ్ - దిశా పటాని - రేవతి - పోసాని కృష్ణమురళి - ముకేష్ రుషి - ఆలీ - బ్రహ్మానందం - సప్తగిరి - చరణ్ - ధన్ రాజ్ తదితరులు
ఛాయాగ్రహణం: పి.జి.విందా
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాతలు: శ్వేత లానా - తేజ - సి.వి.రావు
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: పూరి జగన్నాథ్

ఇడియట్ - పోకిరి లాంటి తిట్లనే టైటిళ్లుగా పెట్టి సెన్సేషనల్ హిట్లు కొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఇప్పుడు తన హీరోను ‘లోఫర్’గా మార్చేశాడు. ముకుంద, కంచె సినిమాల్లో క్లాస్ పాత్రలేసిన వరుణ్ తేజ్.. ఈసారి మాస్ చొక్కా తొడుక్కున్నాడు. మరి ఈ చొక్కా అతడికి సరిపోయిందా? పూరి తిట్ల సెంటిమెంటు మళ్లీ వర్కవుటైందా? చూద్దాం పదండి.

కథ:

మురళి (పోసాని కృష్ణమురళి) ఓ లోఫర్ తండ్రి. తన కొడుకు రాజాని చిన్నప్పుడే తన భార్య దగ్గర్నుంచి తీసుకొచ్చేసి.. ఆ పిల్లాడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం మొదలుపెడతాడు. కొడుక్కేమో తల్లి చనిపోయిందని చెబుతాడు. తల్లికేమో కొడుకు చనిపోయాడని చెబుతాడు. తండ్రితో పాటు జోద్ పూర్ లో సెటిలైపోయిన ఈ రాజా (వరుణ్ తేజ్) దొంగగా మారతాడు. తండ్రీ కొడుకులు దొంగతనాలు, మోసాలు చేసుకుని బతికేస్తున్న టైంలో తండ్రి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడని ఇంటి నుంచి పారిపోయి జోద్ పూర్ వస్తుంది మౌని (దిశా పటాని). ఆ అమ్మాయిని రాజా ప్రేమిస్తాడు. ఐతే రాజా... మౌని అత్త (రేవతి)కి నచ్చడు. ఆ అత్తే తన కన్న తల్లి అని తెలుస్తుంది రాజాకు. ఇంతలో మౌనిని ఆమె అన్నలు ఇంటికి లాక్కెళ్లిపోతారు. ఇక రాజా.. తనెవరో చెప్పకుండా తనను అసహ్యించుకుంటున్న తల్లికి ఎలా దగ్గరయ్యాడు? మౌనిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రభాస్ అన్నట్లు హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాను నడిపించే టిపికల్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకడు. పూరి కెరీర్లో సూపర్ హిట్లన్నీ కూడా హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచినవే. ఐతే మొదట్లో పూరి హీరో క్యారెక్టర్లు కొత్తగా అనిపించాయి. ట్రెండ్ సెట్టర్లయ్యాయి. ఆ తర్వాత ఆ టైపు క్యారెక్టర్లు కోకొల్లలుగా వచ్చాయి. పూరి కూడా మళ్లీ మళ్లీ ఆ ‘తేడా’ క్యారెక్టర్లే ట్రై చేస్తూ వచ్చాడు. దీంతో ఒకప్పుడు కొత్తగా అనిపించిందే రాను రాను మొహం మొత్తేలా తయారైంది. తాను సెట్ చేసిన ట్రెండుని దాటి బయటకు రాలేక అందులోనే గింగిరాలు తిరుగుతున్నాడు పూరి. అందుకు తాజా రుజువు ‘లోఫర్’.

లోఫర్ ట్రైలర్ చూడగానే అందరికీ పూరి పాత సినిమాలే గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా ‘ఏక్ నిరంజన్’ ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఐతే సినిమాలో ఇంకేదైనా మ్యాజిక్ చేసి ఉంటాడులే అనుకుంటే నిరాశ తప్పలేదు. తన సినిమాల్ని తనే కాపీ కొట్టి.. ఒక కలగాపులగం వంటకం వండాడు పూరి. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో తరహాలో ‘అమ్మ సెంటిమెంటు’ను దట్టించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అందులో ఉన్న డెప్త్, ఎమోషన్ ఇందులో మిస్సవడడంతో ఇక్కడ ప్రేక్షకులు కరిగిపోయే ఛాన్స్ లేకపోయింది. అటు పూరి బలమైన హీరో క్యారెక్టరైజేషనూ పెద్దగా వర్కవుట్ కాక.. ఇటు సినిమాకు ప్రధాన బలమవతుందని పూరి చెప్పిన అమ్మ సెంటిమెంటూ పెద్దగా పండక.. ‘లోఫర్’ మామూలు సినిమాగా మిగిలిపోయింది.

కథకు ఎంతో కీలకమైన హీరోయిన్ నేపథ్యమే అసహజంగా అనిపిస్తుంది. మైనింగ్ యజమాని ఆస్తిని కొట్టేయడానికి విలన్ అతడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం.. అడ్డం వచ్చిన భార్యను చంపేయడం..మరికొన్ని హత్యలు చేయడం ఇవన్నీ అతకనట్లుగా అనిపిస్తాయి. తీరా చూస్తే ఆ మైనింగ్ యజమాని పెద్ద కామెడీ పీస్. అదేదో నేరుగా అతణ్నే బెదిరించేసి అతడి ఆస్తి లాక్కుంటే సరిపోయేదిగా.

ఇక తన తల్లిని వెతుక్కుంటూ విలన్ ఊరికిి వచ్చే హీరో నేరుగా వాళ్ల పని పట్టకుండా మధ్యలో డ్రామాలాడ్డం సినిమాను సాగదీయడంలో భాగంగానే అనిపిస్తుంది. హీరో తన తల్లికి నిజం చెప్పకపోవడంలోనూ లాజిక్ కనిపించదు. నిజానికి కథనంలో మ్యాజిక్ ఉంటే.. ఈ లాజిక్కులన్నీ గుర్తుకు రావు. ఆ మ్యాజిక్ మిస్సవడంలోనే సమస్య అంతా. కథనం ఎటు పోతోందో అర్థం కాకుండా ఇష్టానుసారం వెళ్తుండటంతోనే ప్రేక్షకుడికి ఈ లాజిక్కులన్నీ గుర్తుకొస్తాయి.

టైటిల్స్ పడేప్పుడు పోసాని మార్కు లోఫర్ వేషాలు చూస్తే పూరి ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ అక్కడక్కడా చిన్న చిన్న మెరుపులు తప్పితే.. ప్రేక్షకుల్ని కట్టిపడేసే సన్నివేశాలేమీ లేవు. హీరోయిన్ క్యారెక్టర్ని తొలి సన్నివేశంలోనే కామెడీగా మార్చేయడంతో ఆ పాత్ర తాలూకు ఎమోషన్ తో ప్రేక్షకుడు కనెక్టవడానికి అవకాశం లేకపోయింది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ పేలవం. ప్రథమార్ధంలో పోసాని మార్కు పంచ్ లు తప్పితే చెప్పుకోవడానికేమీ లేదు. పూరి మార్కు డైలాగులకు, పోసాని టైమింగుకి సెట్టవడంతో అక్కడక్కడా నవ్వులు పండుతాయి. ద్వితీయార్ధంలో కూడా పోసాని కనిపించినపుడు మాత్రమే కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది.

పోసాని అప్పుడప్పుడూ లైన్లోకి తీసుకురావడం.. ఆలీతో ‘తమ్ముడు’ పేరడీ చేయించడం.. ఇవన్నీ కథనాన్ని సవ్యంగా నడపలేక తొక్కిన అడ్డదారుల్లా కనిపిస్తాయి. తల్లి బాధ చెబుతూ రేవతి వరుణ్ దగ్గర ఆవేదన చెందే సన్నివేశం బాగున్నా.. అందులోని డైలాగులూ ఆకట్టుకున్నా.. అంతకుమించి ఎమోషనల్ గా కదిలించే బలమైన సన్నివేశాలేమీ పడలేదు. దీంతో తల్లీకొడుకుల సెంటిమెంటు అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు. ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ కూడా మామూలుగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి తప్పితే.. కథనంలో పస లేకపోవడంతో ‘లోఫర్’ చాలావరకు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.

నటీనటులు:

రాజా పాత్రలో వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఒక చదువులేని దొంగకు ఇలాంటి స్టైలింగ్ ఏంటి అన్న డౌట్ వచ్చినప్పటికీ వరుణ్ లుక్ - అప్పీయరెన్స్ మాత్రం బాగుంది. నటన పర్వాలేదు. సెంటిమెంటు సీన్లలో గొప్పగా నటించకపోయినా ఎబ్బెట్టుగా మాత్రం అనిపించలేదు. యాక్షన్ సీన్స్ లో వరుణ్ బాగా చేశాడు. దిశా పటాని అందంగా ఉంది. గ్లామర్ వల బాగానే విసిరింది. నీ వాలు కళ్లల్లో పాటలో ఆమె అందాల్ని బాగా ఎలివేట్ చేశాడు పూరి. ఈ పాట చూస్తే గ్లామర్ హీరోయిన్ గా దిశాకు మంచి ఫ్యూచర్ ఉందని అర్థమైపోతుంది. క్యారెక్టర్ లోనే విషయం లేదు కాబట్టి నటన గురించి మాట్లాడాల్సిన పని లేదు. రేవతి పాత్ర అనుకున్న స్థాయిలో లేదు కానీ.. నటన పరంగా నిరాశ పరచలేదు. తల్లి బాధ గురించి చెప్పే సీన్లో ఆమె నటన సూపర్బ్. పోసాని తనదైన శైలిలో నవ్వించాడు. సినిమాలో అందరికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేసింది అతనే. ఆలీ ‘తమ్ముడు’ స్ఫూఫ్ లో కొంత నవ్వించాడు. బ్రహ్మానందంది ఇలా మెరిసి అలా మాయమయ్యే క్యారెక్టర్. చెప్పుకోవడానికేమీ లేదు. విలన్ పాత్రధారులందరూ అవసరానికి మించి నటించిన ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక వర్గం:

సునీల్ కశ్యప్ సంగీతం నాట్ బ్యాడ్. చాలా వరకు పాటలు పూరి స్టయిల్లోనే చేశాడు. ‘నీ వాలు కళ్ల’ వినసొంపుగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. కాకపోతే.. ‘లోఫర్’ అనేది ఏదో గొప్ప మాట అయినట్లు హీరో ఫైట్లు చేస్తున్నపుడు బ్యాగ్రౌండ్లో ‘‘వీడు... లోఫర్’’ అంటూ సౌండ్లేంటో అర్థం కాదు. ఈ ఆలోచన అతడిదో, పూరిదో మరి. పి.జి.విందా ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక పూరి రచయితగా - దర్శకుడిగా.. రెండు రకాలుగానూ నిరాశ పరిచాడు. తల్లీ కొడుకుల సెంటిమెంటు నేపథ్యంలో కథ నడిపించాలనుకోవడం సరే కానీ.. దీనికి హీరోయిన్ తో లింకు పెట్టడంతోనే వ్యవహారం గాడి తప్పినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. డైలాగులు, టేకింగ్ తో కొన్ని చోట్ల నెట్టుకొచ్చాడు కానీ.. చాలా చోట్ల అర్థం లేని సన్నివేశాలతో బండి లాగించేయాలని చూశాడు. పూరి పెన్ పవర్ తల్లి బాధ చెప్పే సన్నివేశంలో కనిపిస్తుంది. పోసానికి రాసిన డైలాగులు కూడా బావున్నాయి. ఆడోళ్లను డైనోసర్లు అంటూ పెట్టిన పోలిక పూరి మార్కును తెలియజేస్తుంది.

చివరగా: లోఫర్ లోఫరే.. ఇడియట్ కాదు, పోకిరి కాదు.

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre