Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ తో టాలీవుడ్ క‌ష్టం ఎంత‌?

By:  Tupaki Desk   |   17 May 2020 11:30 PM GMT
లాక్ డౌన్ తో టాలీవుడ్ క‌ష్టం ఎంత‌?
X
క‌రోనా మ‌హమ్మారీ అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రికొత్త పాఠాలు నేర్పించింది. లాక్ డౌన్ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌భుత్వాలే చేతులెత్తేసే ప‌రిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వినోద‌ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వాల వైఖ‌రి ఇప్ప‌టికే నెమ్మదిగా అర్థ‌మైపోతోంది. ఇప్ప‌ట్లో థియేట‌ర్ల‌ను.. మాల్స్ ని ఓపెన్ చేయ‌డం కుద‌ర‌ద‌ని.. షూటింగుల అనుమ‌తులు చెప్ప‌లేమ‌ని అంటున్నారంటేనే టాలీవుడ్ ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ ప‌ర్య‌వ‌సానం ఏకంగా యాభై వేల మంది సినీ కార్మికుల పొట్ట కొడుతోంది. దాదాపు 1700 థియేట‌ర్లు మూత ప‌డితే 500 కోట్ల విలువ చేసే సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు నిలిచిపోయాయి. ఏడాదికి 200 తెలుగు సినిమాలు తీస్తుంటే.. 50-60 మ‌ధ్య అనువాద చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ‌వుతుంటాయి. కానీ క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో షూటింగులు ఆగిపోయాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడో వంతు సెట్స్ కెళ్ల‌డం కూడా క‌ష్ట‌మేననేది అంచ‌నా. ఇప్ప‌టికే పాతిక సినిమాల రిలీజ్ లు ఆగిపోతే మ‌రో 50 సినిమాల చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లోనే ఆగిపోయి ఉన్నాయి. రోజూ సెట్స్ పై ర‌క‌ర‌కాల లొకేష‌న్ల‌లో క‌లుపుకుని 7500 మంది ఉపాధి పొందుతుంటారు. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చేసే ల్యాబులు ఇత‌ర‌త్రా చోట్ల మ‌రో 7500 మంది ఉపాధి పొందుతుంటారు. వీళ్లంద‌రికీ ఉపాధి క‌రువైంది. ఇక భారీ పాన్ ఇండియా చిత్రాలు నిలిచిపోవ‌డంతో ఆ మేర‌కు పెద్ద ఎత్తున ఉపాధి పోయింది. వెయ్యి పైగా సింగిల్ స్క్రీన్లు.. 500 మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌లో ప‌ని చేసేవాళ్లంద‌రి ఉపాధి కోల్పోయిన‌ట్ట‌య్యింది. ప్రొడ‌క్ష‌న్ విభాగం .. ఎగ్జిబిష‌న్ రంగం క‌లుపుకుంటే ఏకంగా 50 వేల మంది వ‌ర‌కూ ఉపాధిని కోల్పోయి ఉంటార‌ని ఓ అంచ‌నా. అలాగే సినీజ‌ర్న‌లిజంపై ఆధార‌ప‌డి ప్ర‌త్య‌క్ష ప‌రోక్షంగా 700-1000 మంది వ‌ర‌కూ స‌రైన ఉపాధి లేక అల్లాడుతున్నార‌ని అంచ‌నా.

వీటితో పాటు సినీనిర్మాత‌ల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌లేని ధైన్యం. హీరోలు టాప్ టెక్నీషియ‌న్లు.. ద‌ర్శ‌కులు త‌మ పారితోషికాల్ని పూర్తిగా త‌గ్గించుకోవాల్సిన స‌న్నివేశం ఉందిపుడు. అలాగే ఈ లాక్ డౌన్ వ‌ల్ల తెలంగాణ ప్ర‌భుత్వం భారీగా న‌ష్ట‌పోయింద‌నే అంచ‌నా వెలువ‌డింది. సినీప‌రిశ్ర‌మ నుంచి జీఎస్టీ రూపంలో భారీ మొత్తం రావాల్సింది అంతా కోల్పోయిన‌ట్టే అయ్యింది.