Begin typing your search above and press return to search.

ఏపీలో 175కి పైగా సినిమా హాళ్లకు తాళాలు..!

By:  Tupaki Desk   |   27 Dec 2021 10:40 AM GMT
ఏపీలో 175కి పైగా సినిమా హాళ్లకు తాళాలు..!
X
ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టిక్కెట్ ధరల సమస్య ఇంకా కొనసాగుతోంది. దీనికి తోడు గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలను విరుద్ధంగా నడుపుతున్న సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేసి సీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్దేశించిన టిక్కెట్ల ధరలతో థియేటర్లను నడపలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేస్తున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 175కి పైగా సినిమా థియేటర్లు మూతపడ్డాయని తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వం సీజ్ చేసినవైతే.. మిగతావి తక్కువ టికెట్ ధరలతో సినిమా థియేటర్లు నడపలేమని స్వచ్ఛందంగా నిర్వాహకులు మూసివేసినవి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు క్లోజ్ అవడంతో ఇటీవల విడుదలైన సినిమాల ప్రదర్శనలకు ఏపీలో అంతరాయం కలిగింది.

రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల రిలీజ్ లు ఉండటంతో వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఎగ్జిబిటర్లు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తే ఏమి చేయాలనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీలో ఇటీవల థియేటర్ల మీద జరిగిన దాడులతో కొందరు ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో భాగంగా కొన్ని థియేటర్లని స్వచ్చందంగా క్లోజ్ చేశారు. అయితే మరికొందరు మాత్రం డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు సినిమాలను ప్రదర్శిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా ఏపీలో టిక్కెట్ ధరల తగ్గింపు వ్యవహారం మీద చిరంజీవి - నాగార్జున వంటి సీనియర్ హీరోలు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోసారి అవకాశం వస్తే సినిమాటోగ్రఫీ మంత్రితో సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాలని చూస్తున్నారట. మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఆంద్రప్రదేశ్ లో కూడా టికెట్ రేట్ల అంశం మీద సానుకూలంగా స్పందన వస్తుందేమో చూడాలి.