Begin typing your search above and press return to search.

లోకేశ్ కనగరాజ్ దర్శకుడిగా కమల్ .. రజనీ కాంబో!

By:  Tupaki Desk   |   19 July 2022 10:40 AM GMT
లోకేశ్ కనగరాజ్ దర్శకుడిగా కమల్ .. రజనీ కాంబో!
X
కోలీవుడ్ ఇండస్ట్రీకి రజనీ .. కమల్ ఇద్దరూ కూడా రెండు కళ్ల వంటివారు. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం చాలా కష్టం. ఎవరి ప్రత్యేకత వారిది .. ఎవరి ప్రాధాన్యత వారిది. ఇద్దరూ బాలచందర్ వెలికితీసిన ముత్యాలే .. ఆయన సానబెట్టిన వజ్రాలే. కమల్ ని చూసి నటన నేర్చుకోవడానికి తాను ప్రయత్నించినట్టుగా రజనీ అనేక వేదికలపై చెప్పారు. కెమెరా ముందుకు రాగానే రజనీలా మారిపోవడం మరొకరికి చేతకాదని కమల్ అనేక స్టేజ్ లపై చెప్పారు. వాళ్లిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం అలాంటిది.

కెరియర్ ఆరంభంలో ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఒక వైపున రజనీకి .. మరో వైపున కమల్ కి క్రేజ్ పెరుగుతున్న సమయంలో ఇకపై కలిసి నటించకూడదని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు. పాత్రల నిడివి పరంగా .. పారితోషికం పరంగా మనస్పర్థలు తీసుకురావడానికి కొంతమంది చేసిన ప్రయత్నం కారణంగా వాళ్లు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారని అంటారు. అప్పటి నుంచి ఇక వారు కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వాళ్లిద్దరినీ కలిసి తెరపై చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

అలాంటి ఒక రోజు ఎంతో దూరంలో లేదనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. రజనీ - కమల్ కలిసి నటించడమనేది ఖాయమైపోయిందని అనుకుంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ పేరు వినిపిస్తోంది. కోవిడ్ కి ముందు రజనీ హీరోగా తన సొంత బ్యానర్ లో ఒక సినిమా చేయాలని కమల్ అనుకున్నారు. ఆ తరువాత కోవిడ్ రావడం .. కమల్ పై రాజకీయాల ఒత్తిడి .. రజనీ అనారోగ్యం కారణాలుగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఆ ప్రాజెక్టును ఇప్పుడు పట్టాలెక్కించడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

కమల్ తో పాటు ఈ సినిమాలో రజనీ నటించడమే కాదు .. నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటారని టాక్. కథ ప్రకారం అంచనా వేసుకున్న బడ్జెట్ 250 కోట్లు అని తెలుస్తోంది. రజనీ .. కమల్ ఇద్దరి పాత్రలకి సమానమైన ప్రాధాన్యత ఉండేలా డిజైన్ చేశారట.

ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలోని సినిమాతో రజనీ .. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని సినిమాతో కమల్ బిజీగా ఉన్నారు. ఇక విజయ్ సినిమా పనుల్లో లోకేశ్ ఉన్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ముగ్గురూ కలిసి సెట్స్ పైకి వెళతారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!