Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాణ సంస్థ‌కు పంచ్ మీద పంచ్

By:  Tupaki Desk   |   12 July 2022 3:30 AM GMT
అగ్ర నిర్మాణ సంస్థ‌కు పంచ్ మీద పంచ్
X
టాలీవుడ్లో చాలా వేగంగా అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా ఎదిగిన ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. యుఎస్‌లో డిస్ట్రిబ్యూష‌న్‌తో మొద‌లుపెట్టి.. ఆ త‌ర్వాత శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి అరంగేట్రంలోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుందీ సంస్థ‌. ఆపై జ‌న‌తా గ్యారేజ్, రంగ‌స్థ‌లం, పుష్ప లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లూ ఉన్నాయి మైత్రీ బేన‌ర్లో. అలా అని ఆ సంస్థ సినిమాల‌న్నీ ఆడేయ‌ట్లేదు.

పుష్ప త‌ర్వాత మైత్రీ వారికి రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో మూడు ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌డం గ‌మ‌నార్హం. ముందుగా మ‌హేష్ బాబుతో చేసిన భారీ చిత్రం స‌ర్కారు వారి పాట మైత్రీ వారికి నిరాశ‌ను మిగిల్చింది. పైకేమో బ్లాక్‌బ‌స్ట‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని ప్ర‌చారం చేసుకున్నారు కానీ.. చివ‌రికి ఆ సినిమా న‌ష్టాల‌నే మిగిల్చింది. థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మిన మొత్తంతో పోలిస్తే రూ.20 కోట్ల మేర షేర్ త‌క్కువ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

చాలా వ‌ర‌కు త‌మ రెగ్యుల‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కే సినిమాను అమ్మ‌డంతో ఆమేర‌కు త‌ర్వాతి సినిమాల‌తో స‌ర్దుబాటు చేయాల్సిన అవ‌స‌రం ప‌డింది మైత్రీ వారికి. ఇక స‌ర్కారు వారి పాట రిలీజైన 20 రోజుల‌కే అంటే సుంద‌రానికీ అనే మీడియం రేంజ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మైత్రీ సంస్థ‌. ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌లేక‌పోయింది.

ఈ సినిమాకు రూ.24 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగితే అందులో స‌గం షేరే వ‌చ్చింది. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద న‌ష్ట‌మే. ఓటీటీలో సైతం ఈ సినిమాకు ఆశించిన స్పంద‌న రావ‌ట్లేద‌న్న‌ది టాక్. కి తాజాగా మైత్రీ బేన‌ర్ నుంచి హ్యాపీ బ‌ర్త్‌డే అనే చిన్న సినిమా రిలీజైంది. మొద‌ట్నుంచి ఈ బేన‌ర్లో సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న చెర్రీని నిర్మాత‌గా ప‌రిచ‌యం చేశారు.

డ‌బ్బులు పెట్టిందేమో మైత్రీ వాళ్లే. చిన్న సినిమా అయిన‌ప్ప‌టికీ రూ.5 కోట్ల దాకా బ‌డ్జెట్ పెట్టారు.గ‌ట్టిగా ప్ర‌మోష‌న్ కూడా చేశారు. తీరా చూస్తే ఈ సినిమా వ‌సూళ్లు రిలీజ్ ఖ‌ర్చుల‌కే స‌రిపోయే స్థాయిలో ఉన్నాయి.

నెగెటివ్ టాక్, వ‌ర్షాలు ఆ సినిమాను గ‌ట్టి దెబ్బ తీశాయి. ఇంత త‌క్కువ టైంలో మూడు సినిమాలు న‌ష్టాలు మిగ‌ల్చ‌డం మైత్రీ వారికి షాక్. ఓవైపు ఆర్థిక న‌ష్టం, మ‌రోవైపు బ్రాండ్ దెబ్బ తిన‌డంతో మైత్రీ వారికి మింగుడు ప‌డ‌ని విష‌య‌మే.