Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' vs 'టక్ జగదీష్' ౼ థియేటర్ vs ఓటీటీ..!

By:  Tupaki Desk   |   20 Aug 2021 11:02 AM GMT
లవ్ స్టోరీ vs టక్ జగదీష్ ౼ థియేటర్ vs ఓటీటీ..!
X
టాలీవుడ్ లో పండగల సీజన్ లో తమ సినిమాలను విడుదల చేయాలని ఫిలిం మేకర్స్ పోటీ పడుతుంటారు. సెలవులు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో సహా థియేటర్లకు వస్తారని అందరూ భావిస్తుంటారు. అదే సమయంలో ఇద్దరు క్రేజీ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల వద్ద ఉండే కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా యువసామ్రాట్ నాగచైతన్య - నేచురల్ స్టార్ నాని మధ్య ఆసక్తికరమైన పోటీ ఏర్పడనుంది.

అది ఎలా అంటే చైతన్య హీరోగా నటించిన 'లవ్ స్టోరీ' - నాని 'టక్ జగదీష్' సినిమాలు ఒకే రోజుల (సెప్టెంబర్ 10) విడుదల అవుతున్నాయి. కాకపోతే చైతూ సినిమా థియేటర్లలో వస్తుంటే.. నాని మూవీ డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే 'లవ్ స్టోరీ' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 'టక్ జగదీష్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తారు.

వాస్తవానికి ఈ రెండూ థియేటర్స్‌ లో విడుదలవ్వాల్సిన సినిమాలే. ఏప్రిల్ నెలలో ఒకే రోజున రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, కూర్చొని మాట్లాడుకొని వారం గ్యాప్ తో రావాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో లేదని భావించిన 'టక్ జగదీష్' మేకర్స్ ఓటీటీ విడుదలకు మొగ్గు చూపారు.

అదే సమయంలో 'లవ్ స్టోరీ' చిత్ర నిర్మాతలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ చేయడానికే డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 10న పోటీ పడుతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే.. 'టక్ జగదీష్' డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబట్టి, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్స్ లో ఉంటారు. నాగచైతన్య మాత్రం థియేటర్లలోకి వచ్చిన తర్వాత కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

అందుకే దీన్ని రెండు సినిమాల మధ్య పోటీ అనేకంటే.. కరోనా వల్ల విజృంభిస్తున్న ఓటీటీలకు, గడ్డుకాలం ఎదుర్కొంటున్న థియేటర్లకు మధ్య పోటీగా అభివర్ణించవచ్చు. ఏదేమైనా 'టక్ జగదీష్' - 'లవ్ స్టొరీ' లపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న 'మాస్ట్రో' చిత్రాన్ని కూడా హాట్ స్టార్ లో సెప్టెంబర్ 10న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే 'టక్ జగదీష్' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ - థియేటర్ల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. అది కూడా థియేట్రికల్ రిలీజ్ అవుతున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి పోటీగా అదే రోజున విడుదల చేస్తుండటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ దీన్ని ఖండించారు.

ఈ నేపథ్యంలో 'లవ్ స్టొరీ' నిర్మాత, ఏషియన్ సునీల్ మాట్లాడుతూ.. 'టక్ జగదీష్' నిర్మాతలు విడుదల తేదీ గురించి మరోసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే మేము రిలీజ్ డేట్ ని ప్రకటించిన తర్వాత అదే రోజున మరో చిత్రాన్ని విడుదల చేయడం సరికాదు. సెప్టెంబర్ 10 నుండి వాయిదా వేసుకోవాలని మేము వారిని అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు నాకు ఏమీ అవదు. నేను నా సినిమాని రిలీజ్ చేస్తాను. కానీ ఫ్యూచర్ ఏంటి?. 'పుష్ప' లేదా చిరంజీవి గారి సినిమాలు వస్తున్నాయి. అప్పుడు కూడా ఇలానే చేస్తే ఎగ్జిబిటర్స్ డబ్బులు ఎలా కడతారు. చివరకు ఇది ప్రొడ్యూసర్ కే ప్రాబ్లమ్ అవుతుంది. అది వాళ్ళకి అర్థం కావాడం లేదు అని అన్నారు. మరి 'టక్ జగదీష్' నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇకపోతే 'టక్ జగదీష్' సినిమా విడుదల నిర్ణయం హీరో నాని నిర్మాతలకే వదిలేశారు. గతేడాది నాని 'వి' సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా, 'లవ్‌ స్టోరీ' చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. వరుస విజయాలతో జోష్ మీదున్న నాగచైతన్య - శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

మరోవైపు 'టక్ జగదీష్' సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. 'నిన్ను కోరి' తర్వాత నానితో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇందులో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.