Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' సాంగ్ లిరిక్స్ బాగాలేవన్న వారికి లిరిసిస్ట్ సమాధానం

By:  Tupaki Desk   |   3 Sep 2021 9:30 AM GMT
భీమ్లా నాయక్ సాంగ్ లిరిక్స్ బాగాలేవన్న వారికి లిరిసిస్ట్ సమాధానం
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి నిన్న గురువారం టైటిల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు స్పెషల్ గా వచ్చిన ఈ పాటకు థమన్ స్వరాలు సమకూర్చారు. తెలంగాణ జానపద కళాకారుడు మొగులయ్య - చౌరస్తా రామ్ మిరియాల - శ్రీకృష్ణ - పృథ్వీచంద్ర కలిసి హుషారుగా ఆలపించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 9.7 మిలియన్ల వ్యూస్ తో సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక మంది వీక్షించిన లిరికల్ వీడియోగా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు ఆ పాటతో కాస్త నిరాశ చెందినా.. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రిని మాత్రం అందరూ అభినందిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ రామజోగయ్య ని ట్యాగ్ చేస్తూ.. మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు అన్నా అని ట్వీట్ పెట్టాడు.

దీనికి స్పందించిన రామజోగయ్య 'నెక్స్ట్ టైమ్ బాగా రాస్తా తమ్ముడు' అని రిప్లై ఇచ్చారు. అలానే 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కి లిరిక్స్ రాసే అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెబుతూ మరో ట్వీట్ చేశారు. ''పిలిచి బ్లాక్ బస్టర్ హిట్టు పాట కట్టబెట్టిన
ప్రియతములు పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ గార్లకు ధన్యవాదాలు. ముఖ్యంగా మొదటిసారి విన్నప్పుడు ప్రతీ లైన్ కి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం ఎప్పటికీ మరచిపోలేను. ఆ అరగంట సమయం అమూల్యం. థమన్ సృజన విభిన్నం వినూత్నం గంభీరం'' అని రామజోగయ్య పేర్కొన్నారు.

ఇకపోతే 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ పై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ, ఐపీఎస్ రమేశ్ ఈ పాటలోని సాహిత్యంపై ట్వీట్ చేస్తూ.. 'తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ.. మేము ఎవరి రక్షణ కోసమైతే తాము జీతాలు తీసుకుంటున్నామో.. వారి బొక్కలు విరగ్గొట్టము. రామజోగయ్య శాస్త్రికి పోలీసుల పరాక్రమాన్ని వర్ణించేందుకు ఇంతకుమించిన పదాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరం. పోలీసుల సేవలు ఇందులో ఎక్కడ పేర్కొనలేదు' అని పేర్కొన్నారు.

ఏదేమైనా పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.