Begin typing your search above and press return to search.
ధోనీ సినిమాకి ధోనీ ఎంత తీసుకున్నాడంటే..
By: Tupaki Desk | 30 Aug 2016 4:36 AM GMTభారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై ఒక సినిమా త్వరలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ - తెలుగు - తమిళం - ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఎక్కడో జార్ఖండ్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధోనీ - రైల్వేలో ఉద్యోగం చేసుకునేవాడు. తరువాత, అనూహ్యంగా భారత క్రికెట్ జట్టులోకి రావడం - కెప్టెన్ స్థాయికి ఎదగడం... ఈ క్రమం అందరికీ తెలిసిందే. అయితే, ధోనీ జీవితం గురించి ఇంకా చాలా విషయాలను తెలియజేస్తూ తెరకెక్కింది... ఎమ్.ఎస్. ధోనీ- ద అన్ టోల్డ్ స్టోరీ. రిటైర్మెంట్ కాకుండా ఒక ప్లేయర్ పై ఇలా సినిమా రావడం ఇదే ప్రథమం.
అయితే, ఈ చిత్రం కోసం ధోనీ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..? అదేంటీ... ఈ చిత్రంలో హీరోగా నటించింది సుశాంత్ రాజ్ పుత్ కదా - ధోనీకి డబ్బులేంటీ అనేగా మీ ప్రశ్న! అవును, ఈ చిత్రంలో ధోనీ పాత్ర సుశాంత్ రాజ్ పుత్ చేస్తున్నారు, భార్య పాత్రలో కైరా అద్వానీ నటిస్తోంది, నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకుడు. అయితే, తన వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి... ధోనీ కూడా కొంత ఛార్జ్ చేశారు. ఎంత అనుకున్నారు.... దాదాపు రూ. 60 కోట్లు! అవును, ఈ చిత్రం కోసం ఇంత భారీ మొత్తం ధోనీ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సొమ్మును ఎలా చెల్లిస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. సినిమా విడుదలకు ముందే ఇచ్చేస్తారా..? విడుదల అయిన తరువాత లాభాల్లో వచ్చే వాటను ధోనీకి పంచుతారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి, సినిమాలో నటించకుండానే హీరో స్థాయి పారితోషికం అందుకుంటున్నాడు ధోనీ. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ బాగానే ఆకర్షిస్తోంది. ఇక, చిత్రం ఏస్థాయి వసూళ్లు తెచ్చిపెడతుందో తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకూ ఆగాల్సిందే.