Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నిక కాదు.. ముందు ఈసీ మీటింగ్ షెడ్యూల్ ప్రకారం జరగదట

By:  Tupaki Desk   |   7 July 2021 5:30 AM GMT
‘మా’ ఎన్నిక కాదు.. ముందు ఈసీ మీటింగ్ షెడ్యూల్ ప్రకారం జరగదట
X
వ్యవహారం స్మూత్ గా సాగినంత కాలం అందరూ మంచోళ్లే. లెక్కలో చిన్నతేడా వచ్చినప్పుడు.. ఒక్కొక్కరిలోని ‘మొండితనం’ అనుకోని రీతిలో బయటకు వచ్చేస్తుంది. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా)లో ఇలాంటి పరిణామం చోటు చేసుకోనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కొవిడ్ కారణంగా షెడ్యూల్ ప్రకారం ఈ మార్చిలో జరగాల్సిన ఎన్నికల్ని సెప్టెంబరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికి లోగుట్టుగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 9న (శుక్రవారం)న ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. అదిప్పుడు జరిగే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. రాబోయే చోటు చేసుకునే చాలా పరిణామాలకు ఇది నాందిగా భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే.. ఇకపై జరిగేది మరో ఎత్తు అంటూ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు ముఖ్యుల నోటి నుంచి ప్రైవేటు సంభాషణల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ‘మా’ ఎన్నికను ఇప్పటికిప్పుడు నిర్వహించే ఆలోచనలో ప్రస్తుత కార్యవర్గం లేదని చెబుతున్నారు. ఇందుకు అవసరమైన గ్రౌండ్ రెఢీ అయ్యిందని.. దీని ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఎగ్జిక్యూటివ్ భేటీ జరిగే అవకాశం లేదంటున్నారు.

ఇప్పటివరకు అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం.. ఒకసారి ఎన్నికైన కార్యవర్గం కొత్త కార్యవర్గం వచ్చే వరకు కొనసాగుతుంది. అంతే తప్పించి కార్యవర్గం తప్పనిసరిగా రెండేళ్లకు మించి అధికారంలో ఉండకూడదన్న రూల్.. ‘మా’ బైలాలో లేని నేపథ్యంలో.. ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న సెప్టెంబరులో జరిగే అవకాశమైతే లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం ప్రకారం ఎన్నికల్ని నిర్వహించటానికి ముందు.. ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ నిర్వహించి.. తీర్మానం చేయాలి. అందుకు భిన్నంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగకుండానే ఏజీఎం సమావేశం జరిగిందని లీగల్ అడ్వైజర్ తన అభిప్రాయాన్ని చెప్పారు.

అంటే.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని అర్థం ఏమిటంటే.. సెప్టెంబరులో ఎన్నికల్ని నిర్వహిస్తామన్న నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దీంతో.. మా ఎన్నికల్ని సెప్టెంబరులో జరపటానికి వీలుగా 2019లో ఆమోదించిన తీర్మానం చెల్లదన్న విషయాన్ని ‘మా’ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. శుక్రవారం జరగాల్సిన ఎగ్జిక్యూటివ్ సమావేశం కూడా జరగదంటున్నారు.

ఎందుకన్న ప్రశ్నకు.. ‘మా’ ఆఫీసులోని సిబ్బంది పలువురికి కొవిడ్ వచ్చిన నేపథ్యంలో ఈసీ భేటీ జరిగే అవకాశం లేదంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవటానికి ఈసీ భేటీ జరగాలి.

ఒకవేళ అది జరగకపోతే.. ఎన్నికల తేదీ మీద స్పష్టత రాదంటున్నారు. ఇప్పుడున్న ‘‘కొవిడ్’ పరిస్థితుల్లో ఈసీ భేటీ వాయిదా పడటం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ‘మా’ ఎన్నికల నిర్వహణ సెప్టెంబరులో జరిగే అవకాశం దాదాపు లేనట్లేనని ‘మా’కు చెందిన కీలక సభ్యులు కొందరి మాటగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.