Begin typing your search above and press return to search.

MAA ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   18 Sep 2021 12:30 AM GMT
MAA ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఇప్ప‌టికే వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా పోటీ మంచు విష్ణు..ప్రకాష్ రాజ్ ప్యానల్ మ‌ధ్య ఉండ‌టంతో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా కొత్త పోక‌డ‌ల్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. స‌న్నివేశం నువ్వా? నేనా? అన్న‌ట్లుగా సాగుతోంది. ఒకరికొక‌రు పోటీ ప‌డుతూ లంచ్ పార్టీలు..డిన్న‌ర్ పార్టీలు..మందు పార్టీలుంటూ అందర్నీ ఏకం చేస్తున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే స‌న్నివేశం ఇలా ఉందంటే? వ‌చ్చిన త‌ర్వాత ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా ఆ స‌న్నివేశం వ‌చ్చేసింది. కాసేప‌టి క్రిత‌మే మా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ 2021-23 సీజ‌న్ కి సంబంధించి విడుద‌లైంది.

ఆక్టోబ‌ర్ 10న ఆదివారం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ పోలింగ్ జ‌రుగుతుంద‌ని ఈసీ నోటిఫికేష‌న్లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ మొత్తాన్ని ఎన్నిక‌ల అధికారి వి.కృష్ణ‌మోహ‌న్ ఆదేశాల‌తో నోటిఫికేష‌న్ జారీ అయింది. పోలింగ్ ని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూలు లో నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్..దానికి సంబంధించిన షెడ్యూల్ ఓసారి ప‌రిశీలిస్తే..

8 మంది ఆఫీస్ బేరర్స్..18 మంది ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్స్ కోసం జ‌రిగే ఈ ఎన్నిక‌ల‌కు ఈనెల 27 నుంచి 29 వ‌ర‌కూ నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. 30న నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌రుగుతుంది. నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు వ‌చ్చే నెల 1-2 తేదీల్లో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కూ గ‌డువు ఉంది. అక్టోబ‌ర్ 2న బ‌రిలో ఉన్న అభ్య‌ర్ధుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు నిర్వ‌హించి..సాయం త్రం 7 గంట‌ల‌కు ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. ఇక నియ‌మ నిబంధ‌న‌లు ఎలా ఉన్నాయంటే? ఒక అభ్య‌ర్ధి ఒక పోస్టుకే పోటీ చేయాలి. గ‌త క‌మిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ అయి ఉండి 50 శాతం క‌న్నా త‌క్కువ ఈసీ మీటింగ్ ల‌కు హాజ‌రు కాక‌పోతే అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది. 24 క్రాప్ట్స్ లో ఆఫీస్ బేర‌ర్ గా ఉన్న‌వారు ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌క‌పోతే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అన‌ర్హులు.

మునుపెన్న‌డూ ఇలా లేదు!

`మా` ఎన్నిక‌ల ప్ర‌చార శైలిపై ఇప్ప‌టికే సెటైర్లు ప‌డుతున్నాయి. లంచ్ లు డిన్న‌ర్ లు అంటూ విందు రాజ‌కీయాలు వేడెక్కించేస్తున్నారు. అక్టోబ‌ర్ 10న మూవీ ఆర్టిస్టుల (మా) ఎన్నిక‌ల డే వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటుంది. ఇంత‌కుముందే న‌రేష్ లంచ్ పార్టీలు ఆ త‌ర‌వాత బ‌రిలో దిగి ప్ర‌కాష్ రాజ్ ఆక‌స్మిక పార్టీ గురించి తెలిసిన‌దే. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌కాష్ రాజ్ విందు రాజ‌కీయం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఆయ‌న ఆదివారం హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌ముఖ వెన్యూలో విందు ఏర్పాటు చేసారు. ``కలిసి మాట్లాడుకుందాం.. మన లక్ష్యాలపై చర్చించుకుందాం.. సహపంక్తి భోజనం చేద్దాం`` అంటూ ఆయ‌న పంపిన ఆహ్వానం అందుకుని స‌భ్యులంతా విచ్చేశారు. ఈ విందులో ప్ర‌కాష్ రాజ్ తెలివిగా అసంతృప్తుల్ని బుజ్జ‌గించార‌ట‌. మ‌రోవైపు మంచు విష్ణు కూడా త‌న వ‌ర్గాన్ని సంతుష్టుల‌ను చేసేందుకు సైలెంట్ గా మంత్రాంగం నడిపిస్తున్నార‌ని స‌మాచారం. మంచు విష్ణుకు వీకే న‌రేష్ నుంచి అత‌డి వెంట వ‌చ్చే వంద మంది ఓట‌ర్ల నుంచి మ‌ద్ధ‌తు ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్ మీటింగులు పార్టీల్లో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు నిధి సేక‌ర‌ణ గురించి ప్ర‌స్థావిస్తున్నారు. ఇక మంచు విష్ణు సైతం త‌మ వ‌ర్గానికి ర‌క‌ర‌కాల హామీలిచ్చారు. ఇరు ప్యానెళ్ల న‌డుమా పోటీ హీటెక్కించ‌నుంది. ఈసారి ఎన్నిక‌ల్లో బండ్ల గ‌ణేష్‌.. బాబు మోహ‌న్ పోటీ చేస్తున్నారు. జీవిత రాజ‌శేఖ‌ర్ పై గెల‌వ‌డ‌మే ధ్యేయంగా బండ్ల ఈ పోటీలో నిలుస్తున్నారు. పాతిక రోజుల ముందు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అన్నిరోజులు ప్ర‌చారం హోరెత్త‌నుంది.