Begin typing your search above and press return to search.

MAA ఎన్నిక‌ల‌ వార్: ఏక‌గ్రీవ ప్ర‌క‌ట‌నతోనే సైలెంట‌య్యారా?

By:  Tupaki Desk   |   5 July 2021 5:30 PM GMT
MAA ఎన్నిక‌ల‌ వార్: ఏక‌గ్రీవ ప్ర‌క‌ట‌నతోనే సైలెంట‌య్యారా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌గ‌డ టాలీవుడ్ సహా తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 950 మంది స‌భ్యులు ఉన్న మా అసోసియేష‌న్ కి ఇంత హ‌డావుడి దేనికి? అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే `మా` అధ్య‌క్షుడు అన్న హోదా కోసం గొడ‌వ‌ల‌కు దిగుతార‌ని కొట్టుకుంటార‌ని స్ప‌ష్ట‌మైంది.

ఇంత‌కుముందు సినీపెద్ద‌లు క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ స‌భ్యులు అధ్య‌క్షుడిగా ఎవ‌రో ఒక‌రిని ఏక‌గ్రీవం చేసేవారు. ఈసీ మెంబ‌ర్ల‌ను నిర్ణ‌యించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కాల‌క్ర‌మంలో అంతా మారింది. ప‌ద‌వి కోసం కొట్టుకునేవాళ్లు పుట్టుకొచ్చారు. ఒక సాధార‌ణ ఎన్నిక‌ల మాదిరిగా యుక్తులు కుయుక్తులు రాజ‌కీయాలు పుట్టుకొచ్చాయి.

ప‌ద‌వీ వ్యామోహంతోనే కొంద‌రు `మా` అసోసియేష‌న్ కి చెడ్డ పేరు తెస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. ఇక‌పోతే ఈసారి సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించాక వ‌రుస ఇన్సిడెంట్స్ గురించి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ ని ప్ర‌క‌టించ‌గానే వీకే న‌రేష్ వ‌ర్గం భ‌గ్గుమంది. మీడియా వేదిక‌గా ర‌చ్చ‌కెక్కారు. మ‌రోవైపు జీవిత‌- హేమ‌- సీవీఎల్ ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గాల మ‌ద్ధ‌తు కోసం ర‌క‌ర‌కాల రాజ‌కీయాలు చేస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్ కి అపోజిష‌న్ గా మంచు విష్ణు- మంచు మోహ‌న్ బాబు కాంపౌండ్ ప‌ని చేస్తోంది. ఇక ప్ర‌కాష్ రాజ్ కి నాగ‌బాబు- చిరంజీవి మ‌ద్ధ‌తు ఉంద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

ఇక ఇటీవ‌ల వ‌రుస‌గా ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ వీకే న‌రేష్ ఎపిసోడ్స్ ర‌చ్చ చూశాక ఎన్నిక‌ల కంటే ఏక‌గ్రీవం చేయ‌డ‌మే స‌రైన‌ద‌ని సినీపెద్ద‌లు భావిస్తున్నార‌ని ఈసారి ఒక లేడీ అధ్య‌క్షురాలు అయితే బావుంటుంద‌ని భావించార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే `మా` మాజీ అధ్య‌క్షుడు .. సీనియ‌ర్ న‌టుడు ముర‌ళిమోహ‌న్ రంగంలోకి దిగి ఈసారి ఎన్నిక‌లు ఉండ‌వ‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మే అయ్యింది. ఈసారి సినీపెద్ద‌లంద‌రూ ముచ్చ‌టించి ఏక‌గ్రీవం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చారు. ఇటీవ‌లే తాను చిరంజీవి- మోహ‌న్ బాబు- జ‌య‌సుధ బృందాన్ని క‌లిసాన‌ని అంతా ఏక‌గ్రీవం అన్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా పోటీబ‌రిలో ఉన్న ప్ర‌కాష్ రాజ్- విష్ణు ఇత‌రుల‌కు పెద్ద పంచ్ ప‌డింది. మా ప‌దవి సంపాదించుకునేందుకు కాదు కేవ‌లం హోదా మాత్ర‌మేన‌ని ముర‌ళి మోహ‌న్ అన్నారు. మొత్తానికి ముర‌ళిమోహ‌న్ ప్ర‌క‌ట‌న తర్వాత అంతా సైలెంట్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి ఎవ‌రూ గ‌డ‌బిడ చేసేందుకు మీడియా ముందుకు రావ‌డం లేదు.

అయితే ముర‌ళీ మోహ‌న్ ప్ర‌క‌టించిన‌ట్టే `మా` ఎన్నిక‌లు జ‌ర‌ప‌కుండా ఏక‌గ్రీవం చేస్తున్నారా? ఒక‌వేళ అలా చేస్తే ఎవ‌రు అధ్య‌క్షులు అవుతారు? ఈసీ క‌మిటీని ఎలా ఎంపిక చేయ‌బోతున్నారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈసారి చిరు-ఎంబీ ఇద్ద‌రికీ స‌న్నిహితురాలు.. వివాద ర‌హితురాలిగా ఉండే స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌ను అధ్య‌క్షురాలిని చేస్తున్నారా? అన్న‌ది కూడా ఇటీవ‌ల స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌కు కార‌ణ‌మ‌వుతోంది. జెంటిల్ మ‌న్ అసోసియేష‌న్ అభాసు పాల‌వ్వ‌కుండా ఉండాలంటే హుందాగా సాగాలంటే క‌చ్ఛితంగా ఏక‌గ్రీవ‌మే అవ‌స‌రం అని `మా` మెజారిటీ స‌భ్యులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ విష‌యంలో సినీపెద్ద‌లు ఏక‌గ్రీవం వైపు ఆలోచిస్తున్నారా? లేక ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా? అన్న‌ది స‌స్పెన్స్ కి తెర దించుతారేమో చూడాలి.