Begin typing your search above and press return to search.

ఆదిపత్య పోరుగా మా ఎన్నికలు... ?

By:  Tupaki Desk   |   6 Oct 2021 3:30 AM GMT
ఆదిపత్య పోరుగా మా ఎన్నికలు... ?
X
మా ఎన్నికలు అంటే ఒకపుడు చాలా సైలెంట్ గా జరిగేవి. ఫలనా వారు ప్రెసిడెంట్ అని ఎవరో ఒకరి పేరుని పెద్దలు ప్రతిపాదిస్తే అంతా ఓకే అనేవారు. అలా చాలా మంది సీనియర్లు, హీరోలు మా పీఠం ఎక్కారు. ఇపుడున్న పరిస్థితి చూస్తే మాత్రం వారు పోటీ చేసేవారు సరికదా ఇవేం ఎన్నికలు అంటూ పారిపోయేవారేమో. అయితే గత కొన్నాళ్ళుగా మా ఎన్నికలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. మేము పోటీ అంటే మేము పోటీ అంటూ చాన్నాళ్ల ముందుగానే రెడీ అవడంతో మొదలైన వేడి ఎన్నికలు పూర్తి అయినా చల్లారడం లేదు. ఇదిలా ఉంటే మా ఎన్నికలు ప్రతీ సారి కంటే కూడా ఈసారి ఎక్కువ హీటుని పెంచుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.

ముఖ్యంగా ఎంత కాదనుకున్నా మా లో రాజకీయాలు ప్రవేశించాయనే చెప్పకతప్పదు. ఇక్కడ అన్ని పార్టీల సానుభూతిపరులు ఉన్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాలలో ఇపుడున్న వేడి వాడి రాజకీయాలు కూడా మాలో ఉన్నాయి. అదే విధంగా టాలీవుడ్ లో ఇప్పటికిదాకా కనిపించీ కనిపించని ఆధిపత్య పోరు ఈ ఎన్నికల రూపేణా బాహాటం అయింది అంటున్నారు. టాలీవుడ్ లో చూసుకుంటే ఒకనాడు కమ్మల ఆధిపత్యం బలంగా ఉండేది. చిరంజీవి ఎంట్రీ ఇచ్చాక కూడా కమ్మలు బాగానే చాన్నాళ్ల పాటు శాసించారు. ఎపుడైతే మెగా కాంపౌండ్ నుంచి పెద్ద ఎత్తున హీరోలు రావడం మొదలెట్టారో మెగా ప్రభావం టాలీవుడ్ మీద బలంగా కమ్ముకుందనే చెప్పాలి.

మొత్తం సినిమాలలో ఎక్కువ రిలీజ్ లు వారివే ఉంటున్నాయి. ఇక టర్నోవర్ కూడా వారిదే. దాంతో వారి ఆధిపత్యం అలా గట్టిగా ఉంది. దాన్ని బద్ధలు కొట్టడానికి ప్రత్యర్ధి వర్గం చూస్తూ వస్తోంది. సరిగ్గా మా ఎన్నికలను అవకాశంగా తీసుకుంది అంటున్నారు. అయితే మెగా క్యాంప్ తమ వారిని ఎవరినీ దింపకుండా దూరంగా ఉంటూనే ఈ ఎన్నికల్లో తనదైన పాత్ర పోషిస్తోందని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రకాష్ రాజ్ ఈ తెలుగు రాష్ట్రాల వారే కాదు, దాంతో ఆయనను ముందు పెట్టి ఏ రంగులూ అంటకట్టలేరు. ఇక మంచు విష్ణు ప్యానల్ కి కమ్మ వర్గం నుంచి మద్దతు ఉందని అంటున్నారు. మరి ఈ ఆధిపత్య పోరులో ఎవరు విజేతలు అన్నది తేలాల్సి ఉంది. మా ఎన్నికలను ఈసారి ప్రతిష్టాత్మకంగా తెర వెనక కొందరు పెద్దలు తీసుకున్నారని అంటున్నారు. దాంతో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకూ ఆ ఇంటరెస్ట్ కొనసాగి తీరుతుంది అనే చెప్పాలి.