Begin typing your search above and press return to search.

ఇప్పుడున్న గొడ‌వ‌ల్లో MAAని న‌డిపించే స‌మ‌ర్థుడెవ‌రు?

By:  Tupaki Desk   |   26 Jun 2021 12:30 PM GMT
ఇప్పుడున్న గొడ‌వ‌ల్లో  MAAని న‌డిపించే స‌మ‌ర్థుడెవ‌రు?
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఘ‌న‌చ‌రిత‌ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్ని ద‌శాబ్ధాలుగా ఆర్టిస్టుల‌కు `మా` గొప్ప‌ సేవ‌లందిస్తోంది. న‌టీన‌టుల‌కు మా అసోసియేష‌న్ అంటే ఓ భ‌రోసా. `మా` ఆరంభంలో స‌భ్య‌త్వం సుల‌భ‌మైనా కాల‌క్ర‌మేణా ఆ విధానం మారింది. మా గైడ్ లైన్స్ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌ర‌మ‌య్యాయి. ఈ నిబంధ‌న‌లు పెట్ట‌డానికి కార‌ణం కేవ‌లం ఒక్క‌సారి మాలో స‌భ్య‌త్వం పొందితే ఆప‌త్కాలంలో ఎన్నో ర‌కాలుగా ల‌బ్ధి పొందే అవ‌కాశం క‌లిగి ఉండ‌డ‌మే. ఆ రకంగా `మా` తెలుగు చిత్ర సీమ స‌హా సౌతిండియాలోనే గొప్ప అసోసియేష‌న్ గా కీర్తింప‌బ‌డుతోంది. ఆర్ధికంగా బాగా వెనుక‌బ‌డిన స‌భ్యుల‌కు సొంతంగా ఇండ్లు నిర్మించ‌డం.. ఉచితంగా బీమా సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం...పెన్ష‌న్ వెసులుబాలు..స‌భ్యుల పిల్ల‌ల‌కు స్కూల్స్ వ‌గైరా వంటి ఎన్నో మంచి కార్య‌క్ర‌మాల్ని మా కొన్ని ద‌శాబ్ధాలుగా చేసుకుంటూ వ‌చ్చింది.

ఎంద‌రో దిగ్గ‌జాలు మా అసోసియేష‌న్ కోసం ప‌ని చేశారు. అయితే శివాజీ రాజా అధ్య‌క్షుడైన టెర్మ్ లో ఎన్నో కొత్త స్కీమ్ లు తీసుకొచ్చి ముందుకు న‌డిపించే ప్ర‌య‌త్నం సాగింది. అసోసియేష‌న్ సొంత భ‌వ‌నం కోసం ప్ర‌య‌త్నాలు సాగినా వివాదాల వ‌ల్ల ప‌నుల‌కు ఆటంకం క‌లిగింది. నిధి స‌మీక‌ర‌ణ‌లో అవినీతి ఆరోప‌ణ‌లు ఇబ్బంది పెట్టాయి. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా మంది అధ్య‌క్షుల‌య్యారు. అంతా సొంత భ‌వ‌నం నిర్మిస్తామ‌ని ఎన్నిక‌లు స‌మ‌యంలో హామీలు ఇచ్చారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. అందుకు కార‌ణాలు అనేకం. ముఖ్యంగా మాలో అంత‌ర్గాత త‌గాదాలు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఇక సీనియ‌ర్ న‌రేష్ అధ్య‌క్షుడైన స‌మ‌యంలో ఆ త‌గాదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో తెలిసిందే. శివాజీ రాజా వ‌ర్సెస్ న‌రేష్ ఎపిసోడ్స్ నాలుగేళ్ల పాటు ర‌చ్చ‌కు తెర తీసాయి. మా సొంత భ‌వ‌నం విష‌యంలో బ‌య‌ట‌కి చెప్ప‌లేని రాజ‌కీయాలు ఎన్నో సాగాయి. ఇలా కొన్ని కార‌ణాల వ‌ల్ల మాకు ఇప్ప‌టివ‌ర‌కూ సొంత భ‌వ‌నం స‌మ‌కూర‌లేదు. న‌డిగ‌ర సంఘానికి సొంత భ‌వంతిని క‌డ‌తాన‌ని ఛాలెంజ్ చేసి మ‌రీ ఆ ప‌ని చేసిన విశాల్ ఈ సందర్భంలో గుర్తుకొచ్చారు. అత‌డి స‌మ‌ర్థ‌తకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అయితే ఈసారి మా అసోసియేష‌న్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న వారంతా ప్ర‌ధానంగా త‌మ ఎజెండాగా ఎవ‌రికి వారు మా సొంత భ‌వ‌నం ఏర్పాటు చేస్తామంటూ ముందుకొస్తున్నారు. మ‌రి అధ్య‌క్షుడిగా ఎవ‌రు గెలిచినా ఇది అంత సుల‌భంగా సాధ్య‌మ‌య్యేదేనా? గ‌త నాలుగేళ్లుగా మాలో తీవ్ర‌మైన వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల అవి మ‌రింత జ‌ఠిల‌మ‌య్యాయి. ప్ర‌స్తుత ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు అభివృద్ధి ప‌నులు సైతం మ‌రుగున పడ్డాయి. ఇలా ఎన్నో ర‌కాల సందేహాలు ఉత్ప‌న్న మ‌వుతున్నాయి. అవ‌న్నీ ప‌క్క‌న బెడితే ఇప్పుడు `మా`ని స‌మ‌ర్ధ‌వంతంగా ముందుకు న‌డిపించే నాయ‌కుడి అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న‌ది వాస్త‌వం. అయితే ప్ర‌స్తుత పోటీ బ‌రిలో నిలిచే వారిలో అంత క‌మాండ్ చేయ‌గ‌లిగే వారెవ‌రైనా ఉన్నారా? అంటే క‌ష్ట‌మే అనే విమ‌ర్శ ఎదుర‌వుతోంది.

ప్ర‌కాష్ రాజ్ వివాదాస్ప‌దుడు. వివాదం త‌లెత్తిన‌ప్పుడు ఆయ‌న స్పీడ్ గా స్పందిస్తుంటారు. స‌మ‌స్య మ‌రింత జ‌ఠిల‌మ‌వుతుందే త‌ప్ప తొంద‌ర‌గా ప‌రిష్కారం ద‌క్క‌ద‌నే విమ‌ర్శ ఉంది. ఇక మంచు విష్ణు వివాదాస్ప‌ద మాలో ప్ర‌తిదీ క‌న్విన్స్ చేయ‌డం క‌ష్ట‌మ‌నే ప్ర‌చారం సాగుతోంది. పైగా ఇప్ప‌టివ‌ర‌కూ ప‌దవులు చేప‌ట్టిన అనుభ‌వం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో అత‌డు స‌రితూగుతాడా..? అన్న చ‌ర్చా సాగుతోంది. జీవిత రాజ‌శేఖ‌ర్ కి అంద‌రి నుంచి మ‌ద్ధ‌తు ఉంటుందా? అన్న‌ది కూడా మ‌రోవైపు చూడాలి.

గ‌త అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌ర్ ఎపిసోడ్ గురించి తెలిసిందే. ఇదే ఎపిసోడ్ లో జీవిత కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు. అందువ‌ల్ల ఇలాంటి ఎమోష‌న్స్ తో అధ్య‌క్ష ప‌ద‌విలో వెల‌గాలంటే సులువేనా? అన్న‌ది మా మెంబ‌ర్ల‌లో చ‌ర్చ‌కొచ్చింది. టాలీవుడ్ పెద్ద‌లు.. మీడియా ముఖంగానే రాజ‌శేఖ‌ర్ పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన సంద‌ర్భం ఉంది.

ఈ నేప‌థ్యంలో మా ఎన్నిక‌ల్లో వీరంతా పోటీపడితే ప‌రిస్థితేమిటి? అన్న‌దానిపైనా రివ్యూలు సాగుతున్నాయి. ఇక‌పై వివాదాల్ని అణ‌చివేసి మా అసోసియేష‌న్ ఎదుగుద‌ల‌కు ప‌ని చేసే కమాండింగ్ ఉన్న అధ్య‌క్షుడు కావాలి. సొంత భ‌వ‌నం ఏర్పాటు కావాల‌న్నా..ప్యాన‌ల్ బాడీ స‌క్ర‌మంగా ముందుకు సాగాల‌న్నా స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు అవ‌స‌ర‌మ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో ప్ర‌చారం సాగుతోంది. ఇక దాస‌రి త‌ర‌హాలో పెద్ద‌రికం ఉన్న వాళ్లో లేక‌ మోహ‌న్ బాబు రేంజు ప‌వ‌ర్ ఫుల్ గా క‌మాండ్ చేసేవాళ్లో అయితే బావుండేద‌ని ఒక సెక్ష‌న్ అభిప్రాయ‌ప‌డుతోంది. మ‌రి కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుందేమో!