Begin typing your search above and press return to search.

ముదిరిన ‘మా’ ఎన్నికల ఎపిసోడ్.. తాజా అప్డేట్ ఇదే

By:  Tupaki Desk   |   9 Aug 2021 3:05 AM GMT
ముదిరిన ‘మా’ ఎన్నికల ఎపిసోడ్.. తాజా అప్డేట్ ఇదే
X
గడిచిన కొద్దిరోజలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తూ.. తరచూ హాట్ చర్చకు తెర తీస్తోంది మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం. ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని కోరుతూ పలువురు డిమాండ్ చేస్తుంటే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చి.. ఇష్యూను మరింత కాంప్లికేటెడ్ గా చేస్తున్న వైనం తెలిసిందే. తాజాగా ఎన్నికల అంశం ‘మా’ క్రమశిక్షణా సంఘంపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ నెల 22న సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశంలో ఇతర ఎజెండాల జోలికి వెళ్లకుండా.. కేవలం ఎన్నికల ఇష్యూను టేకప్ చేసి.. పోలింగ్ తేదీని డిసైడ్ చేయాలన్న డిమాండ్ కొత్తగా తెర మీదకు వచ్చింది. దీని కోసం మెజార్టీ ఈసీ సభ్యులు క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాస్తే.. మరికొందరు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టటం విశేషం. షెడ్యూల్ ప్రకారం ‘మా’ సర్వసభ్య సమావేశం ఈ నెల 22న జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ సమావేశంలో కేవలం ఎన్నికల తేదీని మాత్రమే ప్రకటించాలే తప్పించి.. మరే ఇతర ఎజెండాను పరిగణలోకి తీసుకోకూడదని 12 మందితో కూడిన ఈసీ సభ్యుల టీం తాజాగా క్రమశిక్షణ సంఘానికి లేఖ రాశారు. అంతేకాదు.. ఈ ఏడాది మార్చి 31తో ప్రస్తుత కమిటీ పదవీ కాలం పూర్తి అయ్యిందని.. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరిగే ఈసీ సమావేశానికి చట్టబద్ధత లేదన్న వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. అందుకే.. ఈసారి ఏజీఎంలో మరే ఇతర అంశాల్ని పట్టించుకోకుండా కేవలం ఎన్నికల డేట్ ను డిసైడ్ చేసేలా మీటింగ్ నిర్వహించాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. ‘మా’కు వ్యతిరేకంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న వారిపైనా.. వారికి సహకరిస్తున్న వారిపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్ ను మరికొందరు తెర మీదకు తీసుకొస్తున్నారు. ‘మా’ బైలాస్ ప్రకానం అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపైన చర్యలు తీసుకోవచ్చంటూ తాజాగా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి.. ఎన్నికల తేదీని మాత్రమే ప్రకటించేలా ఏజీఎంను నిర్వహిస్తారా? అంతకు ముందే.. గీత దాటి మాట్లాడుతున్నారంటూ ఆరోపణలు ఉన్న వారిపై చర్యల కొరడాను ఝుళిపిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.