Begin typing your search above and press return to search.

`మా` ఎన్నిక‌లు.. ప్ర‌కాష్ రాజ్ నామినేష‌న్ నేడే

By:  Tupaki Desk   |   27 Sep 2021 6:00 AM GMT
`మా` ఎన్నిక‌లు.. ప్ర‌కాష్ రాజ్ నామినేష‌న్ నేడే
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేడి ఇక‌పై ఈ 10రోజులు మరింత రంజుగా మార‌నుంది. విందు రాజ‌కీయాల‌తో ఇప్ప‌టికే అట్టుడుకుతున్న ఇండ‌స్ట్రీ మునుముందు మ‌రింత‌గా అగ్గి రాజేయ‌బోతోంది. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు ఎపిసోడ్స్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుండ‌గా.. తెర‌వెన‌క దిగ్గ‌జాలు న‌డిపిస్తున్న పోరుగా దీనిని అంతా చూస్తున్నారు.

అధ్య‌క్ష‌ప‌ద‌వి రేసులో ఉన్న ప్ర‌కాష్ రాజ్ చాలా ముందే త‌న ప్యానెల్ స‌భ్యుల‌ను మీడియాకి ప‌రిచ‌యం చేసి అజెండాను ప్ర‌క‌టించ‌గా.. ఇటీవ‌లే మంచు విష్ణు త‌న ప్యానెల్ ని ఎజెండాను ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 10 న ఎన్నిక‌ల్లో తాడో పేడో తేలిపోనుంది.

ఆ రోజు మ‌ధ్యాహ్నానికి రిజ‌ల్ట్ తేలిపోనుంది. ఈసారి 2021-23 సీజ‌న్ కి ఆర్ట‌స్టుల సంఘం (మా) అధ్య‌క్షుడు ఎవ‌రు? అన్న‌ది ఖ‌రారు కానుంది. తాజా స‌మాచారం మేర‌కు నేటి ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో ఫిలింఛాంబర్ లో నామినేష‌న్ వేయ‌నున్నారు. అనంత‌రం మంచు విష్ణు .. అత‌డి ప్యానెల్ స‌భ్యులు కూడా నామినేష‌న్ కి రంగం సిద్ధం చేస్తార‌ని స‌మాచారం.

ఎవ‌రిది అంతిమ విజ‌యం?

పోరులో ఇద్ద‌రూ ఎవ‌రికి వారే స్పెష‌ల్. ఎవ‌రి బ‌ల‌గాలు వారికి ఉన్నాయి. మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి.. నాగ‌బాబు అండ ప్ర‌కాష్ రాజ్ కి పుష్క‌లంగా ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా ప‌లువురు ఆయ‌న‌కు బాస‌ట‌గా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణుకు సూప‌ర్ స్టార్ కృష్ణ‌-మ‌హేష్ స‌హా వీకే న‌రేష్ వ‌ర్గాల అండ‌దండ‌లు ఉన్నాయి. సినీపెద్ద కృష్ణంరాజు స‌హ‌కారం ఎవ‌రికి అన్న‌ది చూడాలి. ఆ ఇద్ద‌రిలో అంతిమ విజ‌యం ఎవ‌రిదో కాల‌మే నిర్ణ‌యించాల్సి ఉంటుంది. మ‌రో 13 రోజుల్లో రిజ‌ల్ట్ తేల‌నుంది.

మా ఎన్నిక‌ల అజెండా ఏదైనా కానీ.. కేవ‌లం 950 ఓట్లు ఉన్న ఈ అసోసియేష‌న్ హ‌డావుడి పెద్ద స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక సెక్ష‌న్ మీడియా మా ఎన్నిక‌ల పేరుతో టీర్పీలు గుంజుతోంద‌ని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇరు వ‌ర్గాలు మా అసోసియేష‌న్ లో మార్పులు తెస్తాన‌ని.. ప్ర‌తి స‌భ్యుడికి మెడి క్లెయిమ్ ఏర్పాటు చేస్తాన‌ని హామీనిచ్చారు. మా సంఘం గ్రూపులుగా విడిపోయి రాజ‌కీయాలు చేయ‌డం బాలేద‌ని విష్ణు అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈసారి ఎన్నిక‌ల్లో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని అన్నారు. చాలా వ‌ర‌కూ ఏక‌గ్రీవం కోస‌మే ప్ర‌య‌త్నించాన‌ని కూడా విష్ణు అన్నారు.
ఎన్నికల తీరుపై ఎవరూ హ్యాపీగా లేరని ఎన్నికల గురిం‍చి మీడియా.. సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధాకరమని కూడా అన్నారు. త‌న ప్యానెల్ లో ఆడాళ్ల‌కు పెద్ద పీట వేస్తాన‌ని మంచు విష్ణు అన్నారు. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ఆర్టిస్టుల సొంత భ‌వంతిని తాను సొంత డ‌బ్బుల‌తో నిర్మిస్తాన‌ని ప్రక‌టించిన మంచు విష్ణు.. అందులో మల్టీప్లెక్స్.. కళ్యాణ మండపం కట్టనని తేల్చి చెప్పారు. ప‌దవిలో ఉన్నా లేక‌పోయినా సేవ‌లు చేస్తాను. స‌మ‌స్య‌లు ఉంటే కూచుని మాట్లాడుకుందామ‌ని విష్ణు అన్నారు. ఇక రాజ‌కీయ పార్టీల జోక్యం త‌గ‌ద‌ని విష్ణు సెటైర్లు వేసారు. ఆర్టిస్టుల ఎన్నిక‌ల‌ను రాజ‌కీయ పార్టీల‌తో ముడి వేయ‌కండి అని మంచు విష్ణు అన్నారు. 26 మందితో ప్యానెల్ ని విష్ణు ప్ర‌క‌టించారు.

మంచు విష్ణు అధ్యక్ష పదవికి.. జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు పోటీ చేస్తారు. వైస్‌ ప్రెసిడెంట్ గా మాదాల రవి.. పృధ్వీరాజ్ పోటీకి దిగుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్‌... ట్రెజరర్ గా శివబాలాజీ.. జాయింట్‌ సెక్రటరీగా కరాటే కల్యాణి.. గౌతమ్ రాజు పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా 18 మంది పోటీ చేయనున్నారు. హీరోయిన్‌ అర్చన.. అశోక్ కుమార్‌.. గీతాసింగ్‌.. హరినాధ్ బాబు.. జయంతి.. మలక్ పేట శైలజ.. మాణిక్‌ పోటీకి దిగుతున్నారు. నటి పూజిత.. రాజేశ్వరిరెడ్డి.. హీరోయిన్‌ రేఖ.. సంపూర్ణేష్ బాబు.. శశాంక్‌.. శివనారాయణ.. శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న `మా` ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ అజెండా

ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా 18 మంది పేర్లను ఆయన ప్రకటించారు. అనసూయ- అజయ్‌- భూపాల్‌- బ్రహ్మాజీ- ఈటీవీ ప్రభాకర్‌- గోవిందరావు- ఖయ్యుం- కౌశిక్‌- ప్రగతి- రమణారెడ్డి- శ్రీధర్‌రావు- శివారెడ్డి- సమీర్- సుడిగాలి సుధీర్‌- సుబ్బరాజు- సురేష్‌ కొండేటి- తనీష్‌- టార్జన్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఇక కోశాధికారిగా నాగినీడు- జాయింట్‌ సెక్రటరీలుగా అనితా చౌదరి- ఉత్తేజ్‌- వైస్‌ ప్రెసిడెంట్లుగా బెనర్జీ- హేమ పేర్లను ప్రకటించారు. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్‌- జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ ను ప్ర‌కాష్ రాజ్ ప్ర‌క‌టించారు. త‌న‌కు వ్య‌తిరేకంగా బండ్ల గణేష్ రెబ‌ల్ గా పోటీకి దిగుతున్నారు. సాయికుమార్‌- జీవిత- బెనర్జీ- ప్రకాష్‌రాజ్‌ స్పోక్‌ పర్సన్లుగా వ్యవహరించనున్నారు.

సినీ ఇండస్ట్రీకి సేవ చేయాలన్నదే తమ లక్ష్యమని.. సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని అన్నారు ప్రకాష్‌రాజ్. అన్ని అంశాలు ఆలోచించాకే ప్యానల్‌ ప్రకటించామన్నారు ఆయన. మా ప్యానల్‌లో మహిళలకు అవకాశం కల్పించామని సినీ పరిశ్రమలోని సమస్యలు తెలిసినవారే ప్యానల్ లో ఉన్నారని చెప్పారు. తమకు అవకాశం ఇస్తే తామేంటో చేసి చూపిస్తామని అన్నారు. ఆర్టిస్టుల‌ సేవ‌ల‌కోసం 10కోట్ల నిధిని స‌మీక‌రిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.