Begin typing your search above and press return to search.

#MAA ఎన్నిక‌లు.. నాగార్జున బ‌ర్త్ డే రోజు ప్ర‌కాష్ రాజ్ ర‌గ‌డ‌!

By:  Tupaki Desk   |   28 Aug 2021 2:30 PM GMT
#MAA ఎన్నిక‌లు.. నాగార్జున బ‌ర్త్ డే రోజు ప్ర‌కాష్ రాజ్ ర‌గ‌డ‌!
X
జగడ జగడ జగడం చేసేస్తాం.. రగడ రగడ రగడం దున్నేస్తాం.. ఎగుడు దిగుడు గగనం మేమేరా ..!! కింగ్ నాగార్జున సినిమాలో సాంగ్ ఇది. ఇంత‌కుమించి అల్ల‌రి చేస్తున్నారు మూవీ ఆర్టిస్టులు. గ‌త కొన్నాళ్లుగా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల పేరుతో ప్ర‌కాష్ రాజ్- మంచు విష్ణు- వీకే న‌రేష్ చేస్తున్న అల్ల‌రి మామూలుగా లేదు. ఎన్నిక‌ల పేరుతో ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకున్నా.. మీడియాల‌కెక్కినా ఎవ‌రికి వారుగా నువ్వా నేనా? అన్న‌ట్టే పోటీప‌డ్డారు. ఇంకా మీడియాకెక్కుతూనే ఉన్నారు.

ఏదైతేనేం అక్టోబ‌ర్ లో ఎన్నిక‌ల‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఆ మేర‌కు సినీపెద్ద‌లు డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ర‌గ‌డ మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటోంది. నోటిఫికేషన్ విడుదల కాకుండానే అధ్యక్ష పదవి కోసం ఐదారుగురు బరిలోకి దిగారు. ప్రకాశ్ రాజ్ మెగా కాంపౌండ్ అండ‌దండ‌ల‌తో దూకుడుగా ఉన్నారు. ముందే తన ప్యానెల్ కూడా ప్రకటించారు. మంచు విష్ణు ధీటుగా పోటీప‌డ‌తాన‌ని వార్నింగులు కూడా ఇచ్చారు. ప్ర‌కాష్ రాజ్ కి వ్య‌తిరేకంగా వీకే న‌రేష్ మీడియా స‌మావేశాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌లో జీవితా రాజ‌శేఖ‌ర్ కొన్ని మీడియా సమావేశాల‌తో ట‌చ్ లోకి వ‌చ్చారు. ఇంత‌లోనే గ‌త అధ్య‌క్షుడు న‌రేష్ నిధులు దుర్వినియోగం చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు చేసిన హేమ‌పై క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చ‌ర్య‌లు వ‌గైరా వేడి పెంచాయి. ఇకపైనా ఈ వేడి ఇలానే కొన‌సాగ‌నుంది.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో కింగ్ నాగార్జున బ‌ర్త్ డే వ‌స్తోంది. ఆగ‌స్టు 29 బిగ్ డే. ప‌రిశ్ర‌మ నాలుగు స్థంబాల్లో ఒక‌రైన నాగార్జున బ‌ర్త్ డేని అధ్య‌క్ష బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులంతా ఎన్నికల క్యాంపెయిన్‌ గా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌రిశ్ర‌మ పెద్ద‌ల్లో మెగాస్టార్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి పెద్ద‌ పాత్ర‌ను పోషిస్తున్న అక్కినేని నాగార్జున .. మెగాస్టార్ తో ఉన్న స్నేహం దృష్ట్యా మెగా కాంపౌండ్ అండ‌దండ‌లు ఉన్న ప్ర‌కాష్ రాజ్ కే స‌పోర్ట్ చేస్తారా లేక ఇంకెవ‌రికైనా చేస్తారా? అన్న చర్చా వేడెక్కిస్తోంది.

ఇప్ప‌టికే కింగ్ బ‌ర్త్ డే ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసేందుకు ఈ వేడుక‌ల‌కు నాగార్జున‌ను ఆహ్వానించేందుకు ప్రకాష్ రాజ్ బృందం ప్రిప‌రేష‌న్ లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఫిలింన‌గ‌ర్ ఆఫీస్ లో ఇందుకు సంబంధించిన ప‌నులు సాగుతున్నాయ‌ట‌. న‌టుడు సమీర్ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఆహ్వానాలు పంపార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

పుట్టిన‌రోజు పేరుతో రాజ‌కీయాలు అనే అర్థం రాకుండా ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం తెలివిగా ఈ బ‌ర్త్ డేని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఇక‌పోతే ఈ వ్య‌వ‌హారమంతా ఇప్ప‌టివ‌ర‌కూ కింగ్ నాగార్జున చెవిన ప‌డ‌లేదు. మ‌రి ఆయ‌న దృష్టిలో ప‌డితే ఏమ‌వుతుందో కానీ!! ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఈ నెల 31న ప్రకాశ్ రాజ్ త‌న ప్యానెల్ త‌ర‌పున మీడియా స‌మావేశంలో ముచ్చ‌టిస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక‌పోతే ఈసారి ఎన్నిక‌ల్లో కీల‌క ఎజెండాగా ఉన్న మా అసోసియేష‌న్ భ‌వంతి నిర్మాణం పై ఎవ‌రు ఎంత వ‌ర్క‌వుట్ చేశారో చూడాలి.


MAA సొంత బిల్డింగ్ కోసం 3 స్థ‌లాలు రెడీ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజ‌కీయాలు MAA శాశ్వత భవనం చుట్టూ తిరుగుతున్న వేళ‌ ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు స‌హా ప‌లువురు ఈ కీల‌కాంశాన్ని ప్ర‌స్థావిస్తూ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం సాగిస్తున్నారు. అధ్యక్షుడిగా గెలిపిస్తే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తామని వీరంతా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. క‌లెక్ష‌న్ కింగ్ వార‌సుడు మంచు విష్ణు శాశ్వత భ‌వంతి నిర్మాణం కోసం తన సొంత డబ్బును వెచ్చిస్తానని ఎవ‌రూ రూపాయి కూడా పెట్టాల్సిన ప‌నే లేద‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మే అయ్యింది. ఇటీవల‌ త‌న సోషల్ మీడియాలో MAA శాశ్వత భవనానికి సముచితంగా సరిపోయే మూడు సైట్లను క‌నుగొన్నాన‌ని వాటి నుంచి ఒక‌టి అంద‌రం క‌లిసి ఎంపిక చేద్దామ‌ని ప్ర‌క‌టించి షాకిచ్చాడు. నేను వ్యక్తిగతంగా మూడు స్థ‌లాల‌ను సందర్శించాను. ఆ విష‌యాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. మనమంతా ఆ మూడింటి నుంచి బెస్ట్ స్థ‌లాన్ని ఎంపిక చేసుకుందాం అని విష్ణు అన్నారు.

అత‌డు MAA శాశ్వత భవనం కోసం విష్ణు కొంత సీరియ‌స్ గానే దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. MAA ఎన్నికల రేసులో అత‌డు దూసుకుపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇంత‌కుముందు ప్ర‌కాష్ రాజ్ ని స‌మ‌ర్థిస్తూ .. మా సొంత భ‌వంతికి మంచు విష్ణు డ‌బ్బు స‌ర్ధినా కానీ స్థ‌లం ఎలా తెస్తాడో చెప్పాల‌ని నాగ‌బాబు స‌వాల్ విసిరారు. దానికి స‌మాధానంగానే విష్ణు ఇలా క‌స‌ర‌త్తు చేశారు.

అయితే అస‌లు సొంత భ‌వంతి అవ‌స‌ర‌మే లేద‌ని న‌టుడు కం నిర్మాత‌ బండ్ల గ‌ణేష్ అన‌డం క‌ల‌క‌లం రేపింది. దానికంటే పేద ఆర్టిస్టుల‌కు సొంత ఇల్లు కట్టివ్వాల‌ని గ‌ణేష్ కోరారు. తాను శాశ్వ‌త భ‌వంతి నిర్మాణానికి వ్య‌తిరేకిన‌ని.. ఈ సంక్లిష్ట స‌మ‌యంలో మంచి సంక్షేమ కార్య‌క్ర‌మాలు చాలా అవ‌స‌ర‌మ‌ని బండ్ల అన్నారు. మొత్తానికి ఎన్నిక‌ల ముందు ఇంకా ఎన్ని సిత్రాలు చూడాల్సి ఉంటుందో!