Begin typing your search above and press return to search.

'మా' ఆఫీస్ కు తాళం వేశారా? మంచు విష్ణు అందుబాటులో ఉండటం లేదా?

By:  Tupaki Desk   |   27 Nov 2021 4:30 PM GMT
మా ఆఫీస్ కు తాళం వేశారా? మంచు విష్ణు అందుబాటులో ఉండటం లేదా?
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఎన్నో హామీలతో గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. 40 రోజుల క్రితం తన ప్యానల్ తో కలిసి 'మా' నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు.. ఇప్పుడు అసోసియేషన్ సభ్యులకు అందుబాటులో ఉంటడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలను తలపించేలా రసవత్తరంగా జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ వర్గం మీద మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'మా' లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అధ్యక్షుడితో పాటుగా గెలిచిన సభ్యులెవరూ మా మెంబర్స్ కు అందుబాటులో ఉండటం లేదట. 'మా' ఆఫీస్ కు ఎప్పుడు వెళ్లినా తాళం వేసే ఉంటోందని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది.

ప్రాంతీయవాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ మీద విష్ణు గెలిచారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓ వర్గం వారు అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కొత్త అధ్యక్షుడిని ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. అప్పుడెప్పుడో 'మా' శాశ్విత బిల్డింగ్ కోసం రెండు మూడు స్థలాలను చూశానని ప్రకటించిన విష్ణు.. దీనికి ఎప్పుడు కార్యరూపం తీసుకొస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు అందుబాటులో ఉండటం లేదని మరో లొల్లి చెలరేగడం చర్చనీయాంశంగా మారింది.

తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. తాము అందరికీ అందుబాటులో ఉంటున్నామని మంచు విష్ణు టీమ్ చెబుతోంది. 'మా' ఆఫీస్ సిబ్బంది వారి వ్యక్తిగత కారణాలతో రావడం లేదని.. త్వరలో వారిని మార్చడంపై నిర్ణయం తీసుకుంటామమని అంటున్నారు. ఈ నెల 28న జరిగే మీటింగ్ లో ఈ అంశంపై విష్ణు ఏదొక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే 100 రోజులలో 'మా' లో మార్పు తీసుకొస్తామని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చెలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించిన మంచు విష్ణు.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు 40 రోజులు గడిచినా మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారని.. ఏదీ ఆచరణలో కనిపించడం లేదని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

అయితే మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు పరచడంలో పర్ఫెక్ట్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నామని మంచు విష్ణు టీమ్ అంటున్నారు. 'మా' అధ్యక్షుడి గా మంచు విష్ణు మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసే విధంగా తొలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాన ఎజెండాల్లో ఒకటైన సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు మంచు విష్ణు ఇటీవలే తెలిపారు.

'మా' అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నగరంలోని ఏఐజీ - అపోలో - కిమ్స్ - మెడికవర్ - సన్ షైన్ వంటి హాస్పిటల్స్ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ ఆసుపత్రుల్లో ఉచితంగా హెల్త్ చెకప్స్ - 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్ తోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సేవలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. 'మా' సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని.. టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లోనూ రాయితీపై పరీక్షలు చేయించనున్నట్లు విష్ణు పేర్కొన్నారు.