Begin typing your search above and press return to search.

విశాల్ వివాదాస్పద సినిమా తెలుగులోకి..

By:  Tupaki Desk   |   30 Oct 2015 3:30 PM GMT
విశాల్ వివాదాస్పద సినిమా తెలుగులోకి..
X
ఇప్పుడు తమిళనాట విశాల్ హవా బాగానే నడుస్తోంది. వరుస హిట్లకు తోడు.. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఘనవిజయంతో అతడి రేంజే మారిపోయింది. ఈ ఊపులో ఇంతకుముందు తీవ్ర వివాదాస్పదమై ఆగిపోయిన తన ‘మద గజ రాజా’ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మన తెలుగు తేజం.

ఈ సినిమా విషయంలో అప్పట్లో చాలా పెద్ద గొడవే నడిచింది. మద గజ రాజా.. దీన్ని ఇంగ్లిష్ లో షార్ట్ గా ‘ఎంజీఆర్’ అనే పేరుతో పిలిచారు. ఐతే మా దైవం పేరు పెట్టుకుంటావా అంటూ ఎంజీఆర్ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు అప్పట్లో పెద్ద గొడవ చేశారు. ఈ టైటిల్ గొడవతోనే ఆ సినిమా ఆగిపోయింది. దాదాపు 20 కోట్లు పెట్టి తీసిన సినిమాను విడుదల చేయించడానికి విశాల్ చాలా ట్రై చేశాడు కానీ.. కుదర్లేదు. దీంతో ఆ సినిమాను పక్కనబెట్టేసి వేరే సినిమాలు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ‘మదగజ రాజా’ దుమ్ము దులిపే పనిలో ఉన్నాడు.

ఐతే తమిళంలో కంటే ముందు తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ ‘జిల్లా’ సినిమాను తెలుగులోకి అందించిన నిర్మాతలే ఈ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు. తెలుగు వెర్షన్ కి ‘ఎన్టీఆర్’ అనే షార్ట్ నేమ్ వచ్చేలా పేరు మారుస్తారట. ఇక్కడ పెద్దగా అభ్యంతరాలేమీ ఉండవు కాబట్టి చెల్లిపోతుందిలే. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ సవాల్ చేసి ఓడించిన శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి ఇందులో విశాల్ సరసన ఓ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలొచ్చాయి. ఇక్కడే శరత్ తో గొడవ మొదలై.. ఎన్నికల వరకు వెళ్లిందని తమిళనాట జోరుగా చర్చ జరిగింది. త్వరలోనే విశాల్, వరలక్ష్మి పెళ్లి కూడా చేసుకునే అవకాశాలున్నాయట.