Begin typing your search above and press return to search.

'రాకెట్రీ' విడుదల పై మాధవన్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 AM GMT
రాకెట్రీ విడుదల పై మాధవన్ క్లారిటీ..!
X
'చెలి' 'సఖి' 'రన్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో ఆర్.మాధవన్. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన తరహా కథలు పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు మాధవన్. ఈ క్రమంలో తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'నిశ్శబ్దం' సినిమాతో పలకరించిన విలక్షణ నటుడు.. చాలా రోజులుగా ''రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కే పరిమితమై ఉన్నారు.

ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ''రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'' సినిమా తెరకెక్కుతోంది. ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించడమే కాదు.. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి మాధవన్ స్క్రిప్ట్ అందిస్తూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఆ మధ్య మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది.

అయితే అప్పుడెప్పుడో రెడీ అయిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రాన్ని ఇంకా విడుదల చేయకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మాధవన్ ఈ సినిమా గురించి స్పందిస్తూ.. 'రాకెట్రీ' తన కెరీర్లో ప్రత్యేకమైన సినిమా అని అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి తీసిన ఈ చిత్రాన్ని పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో విడుదల చేయలేదు.

పాన్ ఇండియా సినిమా కావడం వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే వరకు విడుదల చేయలేమని మాధవన్ తెలిపారు. నార్త్ లో కూడా 'రాకెట్రీ' మంచి ప్రభావం చూపుతుందని.. మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో థియేటర్లు ఓపెన్ కానప్పుడు సినిమాను ఎలా విడుదల చేస్తామని మాధవన్ అన్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల అవుతుందని మాధవన్ వెల్లడించాడు.

కాగా, భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ఒకరు. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలకు దీటుగా ఎదిగిన నంబి.. ఇస్రో చేపట్టిన అనేక గొప్ప ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసు ఎదుర్కొని 50 రోజులు జైలు జీవితం గడిపారు. కొన్నేళ్ల తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. ఇలా నంబి జీవితంలోని ఎన్నో ఎత్తు పల్లాలను ''రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'' చిత్రంలో మాధవన్‌ ఆవిష్కరిస్తున్నారు. ఇందులో మాధవన్ కు జోడిగా సిమ్రాన్ నటించింది. సామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.