Begin typing your search above and press return to search.

‘సవ్యసాచి’తో ఆపట్లేదుగా..

By:  Tupaki Desk   |   2 April 2018 5:30 PM GMT
‘సవ్యసాచి’తో ఆపట్లేదుగా..
X
తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన సినిమాలతో మన ప్రేక్షకులకు బాగానే చేరువయ్యాడు మాధవన్. ఐతే తనకు తెలుగు భాష రాదని.. కాబట్టి డైరెక్ట్ తెలుగు సినిమా చేయనని ఇంతకుముందు కరాఖండిగా చెప్పేశాడు మాధవన్. కానీ ఈ మధ్య ఆ మాట తీసి పక్కన పెట్టేసి అక్కినేని నాగచైతన్య సినిమా ‘సవ్యసాచి’లో కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు. దర్శకుడు చందూ మొండేటి చెప్పిన కథ.. తన పాత్ర బాగా నచ్చడంతో మాధవన్ మనసు మార్చుకున్నాడు. ఈ చిత్రంలో మాధవన్ పాత్ర అతడి కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రం తర్వాత మాధవన్ మరో తెలుగు సినిమాలో నటించబోతుండటం విశేషం.

ఆ చిత్రంలో మాధవనే హీరోగా నటించబోతున్నాడు. ఇంతకుముందు మంచు విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా తీసిన హేమంత్ మధుకర్.. మాధవన్ ప్రధాన పాత్రలో సినిమా రూపొందించబోతున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కుతుంది. ప్రముఖ రచయిత గోపీమోహన్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఇదొక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కబోయే సినిమా అంటున్నారు. అందుకే మాధవన్ కూడా నటించడానికి అంగీకరించాడు. తమిళంలో చివరగా మాధవన్ నటించిన ‘విక్రమ్ వేద’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. మాధవన్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘టెంపర్’ హిందీ రీమేక్ లో మాధవన్ నటించాల్సి ఉండగా.. భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.