Begin typing your search above and press return to search.

సావిత్రి 'మ‌హాన‌టి' త‌ర‌హాలో మ‌ధుబాల బ‌యోపిక్

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
సావిత్రి మ‌హాన‌టి త‌ర‌హాలో మ‌ధుబాల బ‌యోపిక్
X
టాలీవుడ్ మేటి క‌థానాయిక‌ సావిత్రి జీవిత‌క‌థ‌తో `మ‌హాన‌టి` (2018) తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. న‌టిగా ద‌ర్శ‌కురాలిగా నిర్మాత‌గా సావిత్రి టాలీవుడ్ లో గొప్ప కీర్తిని అందుకున్నారు. ఇప్పుడు సావిత్రికి స‌మ‌కాలికురాలు.. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ మధుబాల జీవితం ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. మ‌ధుబాల న‌టిగానే కాకుండా నిర్మాత‌గానూ క్లాసిక్ డేస్ లో పేరు తెచ్చుకున్నారు. దివంగ‌త మ‌ధుబాల చిన్న చెల్లెలు మధుర్ బ్రిజ్ భూషణ్ నేతృత్వంలో కుటుంబ స‌భ్యుల‌ మద్దతుతో ఈ మూవీ తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.

ఈ బయోపిక్ ని మధుబాల వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బ్రిజ్ భూషణ్ - ఆమె భాగస్వాములు అరవింద్ కుమార్ మాల్వియా- ప్రశాంత్ సింగ్- మాధుర్య వినయ్ - వినయ్ స్థాపించిన బ్యాన‌ర్‌) సహకారంతో ఒక టాప్ స్టూడియో కం ప్రొడక్షన్ హౌస్ ఈ బ‌యోపిక్ ని నిర్మించడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం బ్రూయింగ్ థాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తో పాటు శక్తిమాన్ త్రయాన్ని నిర్మిస్తున్నది)తో మ‌ధుబాల కుటుంబం క‌లిసి ప‌ని చేస్తోంది.

మేటి క్లాసిక్ నాయిక మధుబాల బయోపిక్ కి సావిత్రి బ‌యోపిక్ కి ఉన్నంత క్రేజ్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అనేక మంది అగ్ర నటీనటులు .. ప్ర‌ముఖ క‌థానాయిక‌లు .. అగ్రశ్రేణి చిత్రనిర్మాతలు ఈ ప్రాజెక్ట్ కి సహకరించడానికి చాలా ఆసక్తిని కలిగి ఉన్నారని తెలిసింది. కానీ మేకర్స్ అలాంటి వారిని త‌మ‌తో క‌లుపుకునేందుకు తొందరపడటం లేదు. ఇంకా ప్రొడక్షన్ హౌస్ టీమ్ ని ఎంపిక చేయ‌లేదు. ఈ బయోపిక్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.

మధుబాల‌ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీ క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతానికి కంటెంట్ గురించి మాట్లాడటం చాలా తొందర పాటు ఉంది అని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నారు. దర్శకుడు- రచయిత- స్టూడియోల వివ‌రాలు ఇంకా వెల్ల‌డించేందుకు స‌మ‌యం ఉంది. అప్పుడు మాత్రమే స్క్రిప్ట్ లేదా మూవీ కంటెంట్ గురించి వెల్ల‌డించ‌నున్నామ‌ని సోర్స్ వెల్ల‌డించింది.

లైఫ్ స్పాన్ చాలా చిన్నదైనప్పటికీ గొప్ప‌ జీవితాన్ని గడిపిన నా ప్రియమైన సోదరి కోసం ఏదైనా చేయాలనేది నా చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసేందుకు నేనూ నా సోదరీమణులందరూ చేతులు కలిపాము అని నిర్మాత‌ బ్రిజ్ భూష‌ణ్ వెల్ల‌డించారు. భగవంతుని ఆశీస్సులతో నా భాగస్వాములు అయిన‌ అరవింద్ జీ- ప్రశాంత్ - వినయ్ స‌హ‌క‌రిస్తున్నాఉ. వారి అంకితభావంతో ఈ బయోపిక్ గ్రాండ్ లెవెల్ లో విజయవంతంగా రూపొందుతుందని విశ్వసిస్తున్నాను.. అన్నారు. ఈ ప్రాజెక్ట్ ను అందంగా తీర్చిదిద్దేందుకు అందరి దీవెనలు కావాలి అని ఆమె కోరారు.

మధుబాల కుటుంబానికి మాత్రమే ఈ బయోపిక్ తీసే హ‌క్కు ఉంది. ఇత‌రుల‌కు చట్టపరమైన హక్కులు లేవని బ్రిజ్ భూషణ్ నొక్కి చెప్పారు. నా అనుమతి లేకుండా నా సోదరి జీవితం ఆధారంగా బయోపిక్ లేదా మరేదైనా ప్రాజెక్ట్ కు అనుమ‌తి లేదు! అని అన్నారు. లెజెండరీ వ్యక్తిత్వం పై బయోపిక్ తెర‌కెక్కిస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉన్నామ‌ని కూడా బ్రిజ్ అన్నారు. ``మేమంతా ఒక బృందంగా గత ఐదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం అత్యంత నిజాయితీతో పని చేస్తున్నాము. ఇప్పుడు మా లక్ష్యం దశాబ్దాల పాటు జ‌న‌రేష‌న్ల‌కు గుర్తుండిపోయే చిత్రాన్ని రూపొందించడం మాత్రమే`` అని బ్రిజ్ వెల్ల‌డించారు.

ఒక స్ఫూర్తిదాయకమైన అందమైన జీవితాన్ని విషాదకరమైన కథను చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. “మధుబాలాజీ జీవితం గుండెల్ని పిండేసేంత‌టి హృదయ విదారకమైన‌ది. వాలెంటైన్స్ డే నాడు జన్మించిన ఒక అంద‌మైన‌ రీల్ బ్యూటీ.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేమను అందుకున్న‌ ఆమె నిజ జీవితంలో నిజమైన ప్రేమ కోసం ఆరాటపడి మరణించింది. ఈ బయోపిక్ కి ప్రాణం పోసేందుకు టీమ్ గా మేమంతా దాదాపు ఐదేళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాం.. అని తెలిపారు.

మధుబాల బయోపిక్ లో ప్రేమ కోణం ఎంతో హైలైట్ గా ఉండ‌నుంది. అగ్ర క‌థానాయ‌కుడు దిలీప్ కుమార్ తో మ‌ధుబాల‌ రిలేష‌న్ షిప్ ని లెజెండ‌రీ కిషోర్ కుమార్ తో వివాహం లాంటి ఎన్నో విష‌యాల‌ను ఆవిష్క‌రిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.