Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి ఎంపీ ప్ర‌భుత్వం బంప‌రాఫ‌ర్

By:  Tupaki Desk   |   2 March 2020 7:00 AM GMT
టాలీవుడ్ కి ఎంపీ ప్ర‌భుత్వం బంప‌రాఫ‌ర్
X
సినీటూరిజం వ‌ల్ల ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాల‌కు ఐడెంటిటీ పెరుగుతుంది. ఫ‌లానా లొకేష‌న్ ఫ‌లానా రాష్ట్రం అంటూ చెప్పుకుంటారు. అది ప‌ర్యాట‌కుల్ని విశేషంగా ఆక‌ర్షిస్తుంది. అందుకే ప్ర‌తి రాష్ట్రం దేనిక‌దే ప‌ర్యాట‌కుల్ని ఆక‌ర్షించేందుకు సినీ షూటింగుల్ని ఎంక‌రేజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్ షూటింగులు దేశ విదేశాల్లో విస్త్ర‌తంగా జ‌రుగుతుంటాయి. దేశం మొత్తం లొకేష‌న్ల కోసం వెతికే భారీ ప‌రిశ్ర‌మ‌లు ఇవి. ఏటేటా వంద‌లాది చిత్రాలు నిర్మిత‌మ‌వుతున్నాయి.

అంద‌మైన లోకేష‌న్ గానీ...సీన్ కు అనుకూలించే వాతావ‌ర‌ణం గాని ఉందంటే మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అక్క‌డ‌ రెక్క‌లు కట్టుకుని వాలిపోతారు. షూటింగ్ స్పాట్ అంటే? ఎక్కువ‌గా హైద‌రాబాద్ ..ముంబై...చెన్నై .. ప‌రిస‌రాల్లో జ‌రుగుతుంటాయి. ప్ర‌త్యేకంగా అక్క‌డ షూట్ కి అవ‌స‌ర‌మైన స్టూడియోల వ‌స‌తి ఉంటుంది కాబ‌ట్టి ఆ మూడు రాజ‌ధానుల‌ను సినిమా వాళ్లు వ‌దిలిపెట్ట‌రు. ఇక గోవా లో త‌ప్ప‌కుండా ఒక షెడ్యూల్ షూటింగ్ త‌ప్ప‌నిస‌రి అయ్యింది. ఇటీవ‌లే ప‌నాజీ ప్రభుత్వం గోవా ప‌రువును సినిమా వాళ్లు మంట‌గ‌లుపుతున్నారని క‌ఠిన నిబంధ‌న‌లు విధించారు. ముందుగానే సినిమా స్క్రిప్ట్ ను సంబంధింత అధికారుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అక్క‌డ నుంచి అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాతే గోవాలో అడుగు పెట్టాల‌ని కొత్త చ‌ట్టం తీసుకొచ్చారు.ఇక షూటింగ్ లో భాగంగా ఖ‌ర్చులు ఎక్కువ‌గానే ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. అక్క‌డి ప్ర‌భుత్వం నుంచి సినిమా వాళ్ల‌కు స‌బ్సిడీ లేవీ పెద్ద‌గా ఉండ‌వు.

అయితే తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్ లో షూటింగ్ చేసుకుంటే స‌బ్సీడీ క‌ల్పిస్తామంటూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. కోటి నుంచి రెండు కోట్ల వ‌ర‌కూ గ్రాంట్ రూపంలో ఎంపీ ప్ర‌భుత్వం అందిస్తుందిట‌. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఎక్స్ ట్రా స‌బ్సిడీ వెసులు బాటు కూడా ఉంద‌ని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ద‌క్షిణాది సినిమాలైన టాలీవుడ్ ..కోలీవుడ్..మాలీవుడ్..శాండిల్ వుడ్.. మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల‌కు అద‌నంగా 10 శాతం స‌బ్సిడి వెసులు బాటు ఉంటుంద‌ట‌.

మ‌ధ్య ప్ర‌దేశ్ అంటే.. ద‌ట్ట‌మైన అభ‌యార‌ణ్యాల‌కు నెల‌వు. పులులు..సింహాలు.. ఖ‌డ్గ‌మృగాలు సంచ‌రించే ప్రాంతం. బంగారు గ‌నులు... వ‌జ్రాల గ‌నుల‌కు ఎంపీ ప్ర‌సిద్ధి చెందిన ప్రాంతం. అక్క‌డ షూటింగ్ లు చాలా రేర్ గా జ‌రుగుతుంటాయి. మ‌రి తాజాగా ప్ర‌భుత్వం ప్రోత్స‌హ‌కాలు అందిస్తోంది కాబ‌ట్టి ఇక‌పై అక్క‌డ షూటింగ్ ల‌కు మ‌న‌వాళ్లు మొగ్గు చూపుతారేమో చూడాలి. అయితే కేవ‌లం రాబ‌డిని వెన‌క్కి ఇస్తామంటే కుద‌ర‌దు.. ఎంపీలో దొంగ‌ల బెడ‌ద .. ప్ర‌మాదాలు ఎక్కువే. అలాంటివేవీ జ‌ర‌గ‌కుండా యూనిట్ ని కాపాడే వ్య‌వ‌స్థ‌ను రెడీ చేయాల్సి ఉంటుందేమో!